సంచయిత వర్సెస్ ఊర్మిళ.. పూసపాటి వారసురాలు ఎవరు? విజయనగరం కోటలో యువరాణుల పోరు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Sanchaita Gajapathi Raju vs Urmila Gajapathi Raju: విజయనగరం కోటలో యువరాణుల మధ్య పోరు మరింత వేడెక్కింది. సిరిమానోత్సవంలో మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్ సంచయిత.. తమను అవమానించారని సోషల్ మీడియాలో ఆవేదన వెళ్లగక్కిన ఊర్మిళ గజపతి.. ఇప్పుడు డైరెక్ట్‌గానే అక్కకు ప్రశ్నలు సంధించింది. కోటపై కూర్చున్న తమ కుటుంబాన్ని వెళ్లిపొమ్మని ఆదేశించే హక్కు.. సంచయితకు ఎవరిచ్చారని అడుగుతోంది. పూసపాటి రాజవంశం వారసురాలిగా ఆమెకున్న అర్హతేంటని ప్రశ్నిస్తోంది. మరి.. ఊర్మిళ ప్రశ్నలకు.. సంచయిత బదులిస్తుందా.. లేదా అన్నదే ఇప్పుడు ఇంట్రస్టింగ్‌గా మారింది.

అక్కాచెల్లెళ్ల మధ్య ముదిరిన విభేదాలు:
విజయనగరం పూసపాటి రాజుల సంస్థానంలో.. అక్కాచెల్లెళ్ల మధ్య విభేదాలు ముదురుతున్నాయి. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సాక్షిగా చోటు చేసుకున్న ఘటనతో.. కోటలో హీట్ పెరిగింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్మన్ సంచయిత.. అంతా తానే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని.. మాన్సాస్ తన సొంత సంస్థలా భావించి అధికారం చెలాయిస్తున్నారని సుధాగజపతి, ఊర్మిళ గజపతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సంచయిత వ్యవహారశైలి.. ఆనందగజపతిరాజుకు అవమానకరమన్నారు.

కోట బురుజులపై నుంచి సిరిమానోత్సవం చూడటం తమ వారసత్వ హక్కు అన్నారు ఊర్మిళ గజపతి. కోటపై కూర్చున్న తమ కుటుంబాన్ని వెళ్లిపొమ్మని ఆదేశించే హక్కు సంచయితకు ఎవరిచ్చారని ప్రశ్నించింది. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌ పదవి.. ఏ హోదాతో వచ్చిందని అడుగుతోంది ఊర్మిళ గజపతి. అసలు.. తమ కుటుంబవ్యవహారాల్లో కలగజేసుకొనే అధికారాలు సంచయితకు ఎక్కడివని ప్రశ్నిస్తోంది ఊర్మిళ.

న్యాయపోరాటం చేస్తాం:
మాన్సాస్ ట్రస్ట్ బోర్డు మెంబర్‌గా సుధాగజపతిని నియమించినప్పటికీ.. ఇప్పటికీ ప్రమాణస్వీకారం జరగనివ్వడం లేదని చెప్పారు ఊర్మిళ గజపతి. తమకు జరుగుతున్న అన్యాయంపై మాత్రమే ప్రశ్నిస్తున్నామని.. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని చెప్పారు. మాన్సాస్‌ ట్రస్ట్‌లో జరుగుతున్న పరిణామాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు.

మొన్నటిదాకా బాబాయ్, అమ్మాయి మధ్య వివాదం.. ఇప్పుడు అక్కాచెల్లెళ్ల మధ్య యుద్ధం:
సంచయిత గజపతిరాజు మాన్సాస్ ట్రస్టు ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత.. విజయనగరం రాజవంశం విభేదాలు రచ్చకెక్కాయి. ఇదంతా.. కుటుంబ వివాదమే అయినప్పటికీ.. మాన్సాస్ ట్రస్ట్ చుట్టూ తిరగడంతో.. రాజకీయపరంగానూ ఆసక్తి మొదలైంది. ట్రస్టు వ్యవహారంపై.. మొన్నటిదాకా బాబాయ్ అశోక్ గజపతిరాజు, అమ్మాయి సంచయిత మధ్య వివాదం కొనసాగింది. ఇప్పుడది కాస్తా.. అక్కాచెల్లెళ్లైన సంచయిత, ఊర్మిళగజపతి మధ్య యుద్ధంగా మారింది.

సంచయితకు ఉన్న వారసత్వ హక్కులేంటో చూపించాలని సవాల్:
సంచయిత, ఊర్మిళ ఒకే తండ్రి బిడ్డలైనప్పటికీ.. తల్లులు వేరు కావడంతో రాజ సంస్థానంలో నిజమైన వారసులెవరన్న దానిపై ముందు నుంచి వివాదం నడుస్తోంది. మాన్సాస్ ట్రస్ట్ మాజీ ఛైర్మన్ ఆనందగజపతిరాజు మొదటి భార్య ఉమా కుమార్తె సంచయిత గజపతి కాగా.. రెండో భార్య సుధా కుమార్తె ఊర్మిళ గజపతి. మొదటి భార్య ఉమకు.. ఆనందగజపతి ఎప్పుడో విడాకులిచ్చేశారు. అప్పటి నుంచి.. తల్లి దగ్గరే పెరిగిన సంచయిత.. ఉన్నట్టుండి విజయనగరం గడ్డపై ప్రత్యక్షమయ్యారు.

వైసీపీ ప్రభుత్వం అండతో.. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆనందగజపతిరాజు మరణాంతం వరకు.. ఆయనతోనే జీవితం కొనసాగించిన భార్య సుధా, కూతురు ఊర్మిళగజపతి.. ఆయన వారసులుగా తమకు అన్ని హక్కులు ఉన్నాయని చెబుతున్నారు. దీనికి సంబంధించి.. తమ దగ్గర న్యాయపరమైన, సంస్థానపరమైన రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయంటున్నారు. మరి.. సంచయితకు ఉన్న వారసత్వ హక్కులేంటో చూపించాలని సవాల్ చేస్తున్నారు.

ప్రశ్నించే వారిని కూడా భయపెట్టే స్థాయికి.. సంచయిత దిగజారిందని సుధాగజపతి విమర్శించారు. తాము అడిగే ప్రశ్నలు.. ప్రజల్లో నుంచి కూడా వస్తున్నాయని చెప్పారు. చెల్లెలు ఊర్మిళ చేస్తున్న ఆరోపణలు, ప్రశ్నలకు మాత్రం సంచయిత నుంచి ఎలాంటి స్పందన రావడం లేదు. మరి.. తాజా వివాదంపై సంచయిత సమాధానం ఇస్తారా.. లేరా.. అన్నది ఆసక్తిగా మారింది.

Related Tags :

Related Posts :