ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడున్న చాలా మంది నేతలకు ఆయనే రాజకీయ గురువు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో మూడు
ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో ఇప్పుడున్న చాలా మంది నేతలకు ఆయనే రాజకీయ గురువు. అప్పట్లో ఆయన చెప్పిందే వేదం. రాష్ట్ర, కేంద్ర మంత్రిగా రాజకీయాల్లో మూడు దశాబ్దాలు రాణించిన ఆయన ఇప్పుడు పత్తా లేకుండా పోయారు. ఒక్క ఓటమి తర్వాత కనిపించకుండా మాయమైపోయారు. ఇంతటి ఘనమైన చరిత్ర కలిగిన ఆ నాయకుడు ఎక్కడ? రాజకీయాల్లో మళ్లీ యాక్టివ్ అవుతారా? విశ్రాంతి తీసుకుంటారా?
వేణుగోపాలచారి ఎక్కడున్నారంటూ జనం ప్రశ్న:
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సముద్రాల వేణుగోపాలచారి పేరు తెలియని వారుండరు. మూడు దశాబ్దాల పాటు తిరుగులేని నాయకుడిగా ఏకఛత్రాధిపత్యం చలాయించిన లీడర్ ఆయన. అయితే గడచిన రెండేళ్ల నుంచి అసలు కనబడడం లేదట. ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నారు? ఎక్కడ ఉన్నారని జనాలు అడుగుతున్నారు. తెలుగుదేశం పార్టీలో కీలకనేత, చంద్రబాబుకు సమకాలికుడిగా, నమ్మకమైన వ్యక్తిగా కేంద్రంలో, రాష్ట్రంలో చక్రం తిప్పారు చారి. ఇక ఆదిలాబాద్ జిల్లా తెలుగుదేశం పార్టీలో ఆయనే సుప్రీం. టికెట్ల కేటాయింపులు, పదవుల పంపకాల్లో ఆయన చెప్పిందే వేదం. జిల్లా రాజకీయాల్లో ఎందరో నాయకులకు గురువుగా మారారు. అలాంటి నేత ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మౌనంగా వీక్షిస్తున్నారు.
2012లో టీడీపీని వీడి టీఆర్ఎస్లో చేరిన చారి:
1985లో నిర్మల్ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయకేతనం ఎగరవేసింది మొదలు టీడీపీ నుంచి బయటకు వచ్చిన 2012 వరకు రాజకీయంగా ఎదురులేని నాయకుడిగా చలామణి అయ్యారు వేణుగోపాలచారి. అలాంటిది ఆయన మొన్నటి ఎన్నికల్లో పోటీ కూడా చేయలేని విచిత్ర పరిస్థితిని ఎదుర్కొన్నారు. చంద్రబాబు వర్గంలో ముఖ్య నాయకుడిగా పేరు పొందిన చారికి తనతో పాటే 1985లో సిద్దిపేట నుంచి గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సాన్నిహిత్యం ఉండేది. ఆనాటి నుంచి చారి తెలుగుదేశం పార్టీని వీడేంత వరకు పార్టీలో కీలకమైన నాయకుడిగా వ్యవహరించారు.
2014 ఎన్నికల్లో విఠల్‌రెడ్డి చేతిలో ఓడిన చారి:
మొన్నటి వరకు ఉమ్మడి ఆదిలాబాద్‌లో ప్రజా ప్రతినిధులుగా వ్యవరించిన నేతల్లో ఎక్కువ శాతం మంది వేణుగోపాలచారి రాజకీయ నీడలో ఎదిగినవారే. 2014లో ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా ముథోల్ నుంచి పోటీ చేసిన ఆయన.. కాంగ్రెస్ అభ్యర్థి విఠల్‌రెడ్డి చేతిలో ఓటమి పాలవడం తొలిదెబ్బ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ సాధించిన ఏకైక సీటు విఠల్‌రెడ్డిదే కావడం చారిని కుంగదీసింది. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే కేసీఆర్… తన పాత మిత్రుడైన చారికి ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా కేబినెట్ హోదా కట్టబెట్టారు.
చారి రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు?:
2014లో ఓటమి తర్వాత ఢిల్లీ, హైదరాబాద్‌కే పరిమితం కావలసిన పరిస్థితి ఎదురైంది. ముథోల్‌లో తనపై గెలిచిన విఠల్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరి, ఇప్పుడు మరోసారి టికెట్టు తెచ్చుకోని ఎమ్మెల్యేగా గెలిచారు. దీనిని చారితో పాటు ఆయన వర్గీయులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారట. వేణుగోపాలచారి రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పని చేశారు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా పని చేసిన చారి.. 2012లో టీడీపీకి రాజీనామా చేశారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, ముఖ్యమంత్రి లాంటి వారితో ఎంతో సత్సంబంధాలు ఉన్న నేతకు ఇప్పుడు గడ్డు రోజులు వచ్చాయని జనాలు అంటున్నారు, ఉమ్మడి జిల్లాను తన గుప్పెట్లో పెట్టుకున్న చారి ఇప్పుడు కనీసం జనాలకు కనిపించక పోవడంతో ఆయన రాజకీయ భవిష్యత్తుపై నీలినీడలు కమ్ముకున్నట్టే అని కార్యకర్తలు చెవులు కొరుక్కుంటున్నారు.
Also Read | కోవిడ్ – 19 (కరోనా)..రాకూడదంటే ఇలా చేయొద్దు!