రేపే భారత్ కు…30వేల అడుగుల ఎత్తులో ఆకాశంలోనే ఇంధ‌నం నింపుకున్న రాఫెల్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సోమ‌వారం ఫ్రాన్స్​లోని మారిగ్నాక్ వైమానిక స్థావరం నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మ‌రో ఘ‌న‌త సాధించాయి. మంగ‌ళ‌వారం అవి30వేల అడుగుల ఎత్తులో గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ అందించిన స‌హ‌కారాన్ని భార‌త వాయుసేన (ఐఏఎఫ్‌) ప్ర‌శంసించింది. తొలిదశలో రానున్న 5 విమానాలలో రెండు శిక్షణ, మూడు యుద్ధ విమానాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

ఫ్రాన్స్‌తో మొత్తం 36 యుద్ధ‌విమానాల‌కు ఒప్పందం కుదిరిన విష‌యం తెలిసిందే. ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగల ఈ విమానాలు గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. పైలట్‌లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే, రాడార్‌ రిసీవర్లు, శత్రువుల సిగ్నల్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్‌ జామర్లు, ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు సమర్థంగా పోరాడగలవు.


దసాల్ట్‌ సంస్థ తయారు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాల‌ను భార‌త్ స‌మ‌కూర్చుకొంటున్న‌ది. రూ.59,000 కోట్లతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.

మొదటి దశలో భాగంగా సోమవారం ఫ్రాన్స్‌ నుంచి భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు బుధ‌వారం హ‌ర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌కు చేర‌నున్నాయి. ఈ నేప‌థ్యంలో అక్క‌డ హై అలెర్ట్ ప్ర‌క‌టించారు. అంబాలా కంటోన్‌మెంట్ ప‌రిధిలోని నాలుగు గ్రామాల్లో 144 సెక్ష‌న్ విధించిన‌ట్లు అంబాలా ట్రాఫిక్ డీఎస్పీ మునీష్ సెహగల్ తెలిపారు. రాఫెల్ యుద్ధ విమానాల‌ ల్యాండింగ్ సమయంలో ఇంటి మిద్దెలు, డాబాల‌పై ప్ర‌జ‌లు గుమిగూడ‌టం, ఫోటోలు తీయ‌డంపై నిషేధం విధించిన‌ట్లు ఆయ‌న చెప్పారు. అలాగే అంబాలా కంటోన్‌మెంట్ ప్రాంతాన్ని డ్రోన్ ర‌హిత ప్రాంతంగా ప్ర‌క‌టించిన‌ట్లు తెలిపారు. నిబంధ‌న‌లు ఉల్లంఘించిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ఆయ‌న హెచ్చ‌రించారు.Related Posts