ఆ డబ్బు మాదే, అంగీకరించిన అంజన్ రావు భార్య, నోట్ల కట్టల కేసులో కీలక మలుపు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

anjan rao house : సిద్ధిపేటలో రాజకీయ దుమారం రేపుతున్న దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందర్ రావు బంధువు ఇంట్లో నోట్ల కట్టల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. సిద్దిపేటలో సురభి అంజన్‌రావు ఇంట్లో నిన్న(అక్టోబర్ 26,2020) చేసిన సోదాల దృశ్యాలను పోలీసులు విడుదల చేశారు. ఆ డబ్బు తమదే అని అంజన్‌రావు భార్య అంగీకరించారని పోలీసులు తెలిపారు. తన బావమరిది నగదు ఇచ్చినట్లు అంజన్‌రావు చెప్పారని పోలీసులు వెల్లడించారు. నిన్న అంజన్ రావు ఇంట్లో సోదాలు చేసిన పోలీసులు పెద్ద మొత్తంలో నగదు సీజ్ చేశారు. సోదాల సమయంలో తీసిన వీడియోని పోలీసులు రిలీజ్ చేశారు. అంజన్ రావు, ఆయన భార్య సమక్షంలో సోదాలు నిర్వహించి డబ్బులు సీజ్ చేసినట్టు వీడియోలో స్పష్టంగా ఉంది.

కాగా, పోలీసులే డబ్బు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు కీలక వీడియో రిలీజ్ చేశారు. వాస్తవాలు తెలిపే ప్రయత్నం చేశారు.

నోటీసులిచ్చాకే సోదాలు:
బీజేపీ దుబ్బాక అభ్యర్థి రఘునందన్‌రావు బంధువుల ఇళ్లల్లో సోదాలు, డబ్బు కాక అంశాలపై సిద్దిపేట పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్‌ క్లారిటీ ఇచ్చారు. నోటీసులిచ్చాకే సోదాలు చేశామన్నారు. సోదాలు మొత్తం వీడియో ద్వారా చిత్రీకరించామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారమే నడుచుకున్నామన్నారు.

పోలీసులే డబ్బులు తీసుకొచ్చి ఇంట్లో పెట్టారనేది అవాస్తవమని తేల్చి చెప్పారు. పోలీసులపై ఆరోపణలు చేయడం తగదన్నారు సీపీ. తనిఖీలపై అధికారులు పంచనామా నిర్వహించారన్నారు. సురభి అంజన్‌రావు ఇంట్లో డబ్బులు దొరికాయని.. డబ్బులు సీజ్‌ చేసే ప్రక్రియను వీడియో తీశామన్నారు సీపీ. ఎన్నికల ప్రక్రియలో భాగంగానే సోదాలు చేశామన్నారు సీపీ జోయల్‌ డేవిస్‌. ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించడమే తమ ముందున్న లక్ష్యమన్నారు.

బండి సంజయ్‌పై దాడి అవాస్తవం:
బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌పై దాడి ఆరోపణల్లో నిజం లేదన్నారు సీపీ జోయల్ డేవిస్. మొత్తం ఘటనపై ముందే సమాచారం ఇచ్చామని.. దుబ్బాకకు రావొద్దని విజ్ఞప్తి చేసినా ఆయన పట్టించుకోలేదన్నారు. అయినప్పటికీ మర్యాదపూర్వకంగానే ఆయనను అరెస్ట్ చేసి తరలించామన్నారు. దుబ్బాకలో ప్రచారానికి వస్తున్న నేతలెవర్నీ అరెస్ట్ చేయలేదన్నారు సీపీ జోయల్ డేవిస్. ప్రచారానికి విఘాతం కలిగించే వారిని మాత్రమే అరెస్ట్ చేశామన్నారు.

anjan rao wife

బీజేపీ అభ్యర్థి బంధువు ఇంట్లో రూ.18లక్షలు లభ్యం:
దుబ్బాక అసెంబ్లీ ఉపఎన్నిక వేళ.. రాజకీయం వేడెక్కింది. మరికొన్ని రోజుల్లో దుబ్బాక స్థానానికి పోలింగ్ జరగాల్సి ఉంది. ఇంతలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దుబ్బాక ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో రాజకీయం రసవత్తరంగా మారింది. సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో సిద్దిపేట అట్టుడికింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనిపించింది.

దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల నుంచి బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టు వరకూ హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం(అక్టోబర్ 26,2020) మధ్యాహ్నం.. పోలీస్‌, రెవెన్యూ అధికారులు కలిసి రఘునందన్‌రావు బంధువులు సురభి రాంగోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రఘునందన్‌రావు మామ రాంగోపాల్‌రావు ఇంట్లో ఎటువంటి నగదు లభ్యం కాలేదు. కాగా, సురభి అంజన్‌రావు ఇంట్లో మాత్రం రూ.18.67 లక్షల నగదు లభ్యమైనట్లు ప్రకటించడం సంచలనం రేపింది. ఆ నగదుతో బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి.. లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు.

మరోవైపు తనిఖీల విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా అక్కడికి చేరుకొని.. నోటీసులివ్వకుండా తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.

బట్ట కాల్చి మీదేస్తున్నారు: రఘునందన్‌
దేశంలో ఎవరి ఇళ్లలో డబ్బులు దొరికినా తనకు సంబంధించినవేననడం సమంజసం కాదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. తనను వందసార్లు చెక్‌ చేశారని, ఇంకా వందసార్లు చెక్‌ చేసినా తాను ఫెయిర్‌గానే ఉన్నానని తెలిపారు. బట్ట కాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో కూడా తనిఖీలు చేసుకోవచ్చని సూచించారు. తన కూతురు, అల్లుడు ఇద్దరు డాక్టర్లేనని, వారిని కూడా పని చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు నోటీసు ఇవ్వలేదని, పైగా డబ్బులను బీజేపీ కార్యకర్తలు అపహరించారంటూ ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు సంబంధం లేని ఇంట్లో తనిఖీలు చేశారని, పోటీ చేయకుండా తప్పించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు.

అడ్డంగా దొరికినా డ్రామాలు చేస్తున్నారు:
బీజేపీ నేతలపై మంత్రి హరీశ్‌ రావు ఫైర్‌ అయ్యారు. బీజేపీ నోట్ల కట్టలతో అడ్డంగా దొరికినా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు నిరసన కార్యక్రమాలు చేస్తోందని విమర్శించారు. మద్యం, నోట్ల కట్టలతో ఓట్లను కొనాలనుకుంటున్నారని మండిపడ్డారు హరీశ్‌రావు. ఓడిపోతామనే భయంతో బీజేపీ ఎన్నికలు వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తోందన్నారు. బీజేపీ గోబెల్స్ ప్రచారాన్ని జనం నమ్మరని మంత్రి హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు దుబ్బాకలో డిపాజిట్లు కూడా దక్కే పరిస్థితి లేదని హరీష్ రావు జోస్యం చెప్పారు.

Related Tags :

Related Posts :