కార్తీకమాసంలో ఉసిరిచెట్టు క్రింద వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా……..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

significance of karthika masam vanabhojanalu : కార్తీకమాసం వచ్చిందంటే చాలు వనభోజనాలకు పెట్టింది పేరు. వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని ప్రజలు వెతుకుతుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే దాని కొమ్మయినా వెంట తీసుకు వెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ ఉసిరి చెట్టువద్ద కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం.

ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం ఉంది. ఉసిరి సకల మానవాళిని రక్షిస్తుందనీ విశ్వసిస్తారు. వృద్దాప్యాన్ని దరిచేరనివ్వని ఔషద మొక్కలలో ఉసిరికి ఉసిరే సాటి అని చెపుతుంది ఆయుర్వేదం. అందుకే ప్రతి వ్యక్తీ తన జీవితకాలంలో ఐదు ఉసిరి చెట్లు నాటాలని చెబుతుంటారు.కార్తీక మాసంలో వనభోజనాల్లో ఉసిరి చెట్టు కింద సాలగ్రామాన్ని ఉంచి గంధం, అక్షతలు, పుష్పాలతో పూజించాలి. అనంతరం పండితులను పిలిచి సత్కరించి అందరూ భోజనం చేయాలి. వనభోజన కార్యక్రమాలను నిర్వహించే వారికి పాపాల నుంచి విముక్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. కార్తీకమాస వన భోజనం అంటే ఎక్కడ పడితే అక్కడ చేసే కార్యక్రమం కాదు.వన భోజనానికి ఎంచుకునే ప్రదేశం అత్యంత పవిత్రంగా ఉండాలి. వన భోజనాలకు రకరకాల పల, పుష్ప, వృక్షాలు కలిగి ఏటి ఒడ్డున ఉన్న ప్రదేశాన్ని ఎన్నుకోవడం ఉత్తమం. అక్కడ తప్పనిసరిగా ఉసిరి చెట్టు ఉండాలి. తులసివంటి మొక్కలు కూడా ఉంటే మరీ మంచిది. బయట నుండి తెచ్చినవి కాకుండా ఆహార పదార్థాలు అక్కడే వండుకోవాలి. సాత్విక ఆహారాన్ని తీసుకోవడం మేలు.

సూత మహర్షి మునులందరితో కూడి నైమిశారణ్యంలో కార్తీక పౌర్ణమి నాడు ఉసిరి చెట్టు క్రింద వనభోజనాలను చేసినట్లు కార్తీక పురాణంలో వర్ణించబడినది. ఉసిరి చెట్టు అనేక ఔషధ గుణాలను కల్గిన వృక్షం మరియు దామోదరునికి (శ్రీహరికి) అత్యంత ప్రీతిపాత్రమైన వృక్షం. అందుకే వనభోజనాలకు ఉసిరి చెట్టు నీడ శ్రేష్టం. వనభోజనాల ప్రారంభానికి ముందు, ఉసిరి చెట్టు మొదట్లో విష్ణుమూర్తి పటాన్ని లేదా విగ్రహాన్ని ఉంచి, పూజించి ఆ తరువాత ఆనందంగా పెద్దలు, పిల్లలు, బంధువులు, మిత్రులతో కలసి వనభోజనాలను చేస్తారు.

శ్రీకృష్ణ భగవానుడు తన సోదరుడు బలరాముడి తోను, మరియు తోటి గోప బాలకులతో కలసి ఉసిరి మొదలైన మహా వృక్షాల నీడన యమునా నదీ తీరాన, బృందావనంలో అత్యంత ఆనందంగా వనభోజనాలను చేసాడని భాగవతంలో వర్ణించబడినది.ఉసిరిచెట్టు క్రింద ఉసిరికాయలతో దీపారాధన చేసి శ్రీమహావిష్ణువును అర్చించే వారిని చూడటానికి యమునికి కూడ శక్తి చాలదట. ఉసిరి చెట్లు ఉన్నతోటలో వనభోజనాలు చేస్తే వారి మహాపాతకాలు సైతం తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

ధాత్రి అంటే ఉసిరిక. ఉసిరిక లక్ష్మీదేవికి ఆవాసమై ఎంతో ఇష్టమైనది. కార్తీకమాసంలో ఈ ఉసిరిక వృక్షం కింది భోజనం చేయడం ఎంతో అదృష్టాన్నిస్తుంది. ఉసిరి వృక్షం మొదట్లో ధాత్రీదేవిని, దామోదర స్వామిని పూజించి, మధుర పదార్థాలను నివేదించాలి.ఉసిరి చెట్టుకి ఎనిమిది వైపులా దీపాలు పెట్టి ఎనిమిది ప్రదక్షిణలు చెయ్యాలని, ఈ ఉసిరి పత్రితో విష్ణువుకి పూజ చెయ్యాలని పెద్దలు అంటుంటారు. ఈ కాలంలోనే ఉసిరి కాయలు బాగా వస్తాయి. ఉసిరి మన ఆరోగ్యానికి సంజీవినిలాంటిది. రోజూ ఉసిరి ఏదో ఒక రూపంలో మనం తినాలి. ఇందులో షడ్రుచులలోని చేదు తప్ప మిగతా ఐదు రుచులు వున్నాయి.

ఇది మన జీర్ణశక్తిని కాపాడుతుంది. మన శరీర ఉష్ణోగ్రత తగ్గిస్తుంది. శరీరంలో సమతుల్యం తీసుకువస్తుంది. ఈ చెట్టుగాలి కూడా చాలా మంచిది. అందుకే కార్తీకమాసంలో ఉసిరి చెట్టు దగ్గర దీపాలు, పూజలు, ప్రదక్షిణలు, వన భోజనాలు అంటూ ఎక్కువసేపు ఈ చెట్టుదగ్గర గడపాలని చెప్పారు.ఉసిరిచెట్టు మూలంలో శ్రీహరి, స్కంధంలో రుద్రుడు, ఊర్ధ్వంలో బ్రహ్మ, శాఖలలో సూర్యుడు, ఉపశాఖలలో దేవతలు ఆశ్రయించి ఉంటారు. కార్తీక పౌర్ణమి రోజున శ్రీమహావిష్ణువును పూజించి, చిత్రాన్నాలను నివేదించి, మధ్యాహ్నం బంధుమిత్రులతో కలసి ఉసిరి చెట్టు నీడలో వన భోజనం చేస్తే సకల పాపాలు తొలగిపోయి విష్ణులోకం పొందుతారు.

కార్తీకమాసంలో వాతావరణ ప్రభావం వల్ల మనిషిలో ఉష్ణాంశము తక్కువై, త్రిదోషాలు వికృతి చెందుతాయి. తులసి వాసన, ఉసిరిక వాసన పీల్చుకోవడం వల్ల ఆరోగ్యం చేకూరుతుందనే నమ్మకం వనభోజనాలు ఏర్పాటు చేయడానికి నాంది పలికిందని పెద్దలు అంటారు. కార్తీక పొర్ణమి నాడు చేసే సాలగ్రామ దానం, ఉసిరి కాయల దానం వల్ల కూడా పాపాలు నశిస్తాయి.వన భోజనం చేయడం వల్ల ఆధ్యాత్మిక ఫలితాలు, ఆరోగ్యంతో పాటు ప్రజల్లో ఆత్మీయతానురాగాలు పెంపొంది సామాజిక సామరస్యతకు, సమైక్యతకు దోహదం చేస్తుంది. ఆనందానికి సంకేతం పచ్చదనం. దాన్ని పంచుకుంటూ ఆనందాన్ని మనసులో నింపుకొంటూ చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ఆటపాటలతో, నృత్య గీతాలతో ఆనందంగా గడుపుతారు.

వనంలోకి వెళ్లి ఆ ఉసిరి చెట్టు కింద, తులసి బృందావనంలో చక్కగా వంట చేసుకుని, పరమేశ్వరుడికి మహా నైవేద్యం పెట్టి, అందరూ ఒక్కటిగా నిలబడి అన్నం తిని, ఆ ప్రకృతి అనుగ్రహాన్ని, పరమాత్మ అనుగ్రహాన్ని పొంది ఇంటికి తిరిగి వచ్చే పక్రియనే వన భోజన పక్రియ అంటారు. వన భోజనం ఎందుకు నిర్దేశించారో అందుకే చేయాలి. చేయకూడని పనుల కోసం వన భోజనాలకు వెళ్లకూడదు.


Related Tags :

Related Posts :