అప్పుడు అంతర్వేది, ఇప్పుడు బెజవాడ.. దుర్గ గుడిలో మూడు సింహాలు మాయం, విలువ రూ.15లక్షలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అంతర్వేది రథం దగ్ధం ఘటన మరువక ముందే బెజవాడ కనకదుర్గమ్మ వెండి ఉత్సవ రథానికి ఉన్న మూడు వెండి సింహాలు మాయమయ్యాయి. ఒక్క సింహం విగ్రహం మాత్రమే మిగిలింది. దానిని కూడా పెకలించేందుకు ప్రయత్నించి.. విఫలమైనట్లుగా కనిపిస్తోంది. దుర్గగుడి ప్రాంగంణంలోనే ఉన్న వెండి రథానికి ఉన్న సింహాలు మాయం కావడం సంచలనం సృష్టిస్తోంది. మాయమైన మూడు వెండి సింహాల విలువ దాదాపు 15 లక్షల రూపాయలు. కనకదుర్గ అమ్మవారిని ఉగాది రోజున వెండి రథంపై ఊరేగిస్తారు.

సుమారు 20 ఏళ్ల క్రితం ఈ వెండి రథాన్ని తయారు చేయించారు. సుమారు 70 కేజీలకుపైగా వెండితో ఈ రథానికి తాపడం చేశారు. దీనికోసం అప్పట్లోనే సుమారు 50 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. రథం నాలుగు స్తంభాలకు నాలుగు వెండి సింహాల విగ్రహాలను అమర్చారు. ఒక్కో సింహం విగ్రహానికి 8 కేజీల వెండిని తాపడం చేసినట్లు సమాచారం. ఇప్పుడు 3 సింహాలు మాయమయ్యాయి. అంటే, మొత్తం 24 కేజీల వెండి చోరీకి గురైనట్లు తెలుస్తోంది.

వెండి ఉత్సవ రథాన్ని పరిశీలించినప్పుడు వెలుగులోకి విషయం:
అంతర్వేది రథం దగ్థం ఘటన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఆలయాల్లో రథాల భద్రతపై దృష్టి సారించారు. అందులో భాగంగా దుర్గగుడి ఈవో సురేశ్‌బాబు విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ శ్రీనివా‌స్‌తో సమావేశమయ్యారు. దుర్గగుడిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. రథాలకు ప్రత్యేక షెడ్లను నిర్మించి పటిష్ఠ భద్రత కల్పించాలని.. సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని కమిషనర్‌ సూచించారు. ఈ భేటీ తర్వాత.. ఈవో, సిబ్బంది దుర్గమ్మ రథాలను పరిశీలించారు. వెండి ఉత్సవ రథాన్ని పరిశీలించినప్పుడు విషయం బయటపడింది. రథానికి నాలుగువైపులా ఉండాల్సి న వెండి సింహాల్లో మూడు అపహరణకు గురైనట్లు తేలింది.

కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ:
ఈ రథం దుర్గగుడి ఆవరణలో.. సమాచార కేంద్రానికి సమీపంలోనే ఉంది. ఇక్కడ సిబ్బంది పర్యవేక్షణ కూడా ఉంటుంది. అయినప్పటికీ.. సింహాలు మాయం కావడం అనుమానాలకు తావిస్తోంది. కరోనా లాక్‌డౌన్‌ సమయంలోనే చోరీ జరిగినట్లు భావిస్తున్నా రు. రథానికి టార్పాలిన్‌ పట్టాతో అధికారులు కప్పి ఉంచడంతో ఈ విషయం బయటపడలేదు. టార్పాలిన్‌ను తొలగించడంతో విగ్రహాల మాయం విషయం బయటపడింది.

విగ్రహాలు మాయమైనా, అసలేమీ జరగనట్టు అధికారుల మౌనం:
దుర్గమ్మ ఉత్సవ రథం విగ్రహాలు మాయమైనప్పటికీ… అసలేమీ జరగనట్లుగానే అధికారులు మౌనం వహించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. పైగా… పొంతనలేని మాటలు చెబుతున్నారు. సింహాలు స్టోర్‌ రూంలో ఉండొచ్చని ఒకసారి, అంతకు ముందే పోయి ఉండొచ్చని మరోసారి చెబుతూ వచ్చారు. స్టాక్‌ రిజిస్టర్‌ పరిశీలిస్తే కానీ ఈ విషయం నిర్ధారించలేమని ఈవో సురేశ్‌ బాబు చెప్పారు.

READ  అమరావతిలో భూముల కొనుగోలు : టీడీపీ నేత ఇంటికి నోటీసులు అంటించిన సీఐడీ

స్టోర్‌ రూమ్‌ను, స్టాక్‌ రిజిస్టర్‌ను పరిశీలించేందుకు రోజుల సమయం ఎందుకు పడుతుందనే ప్రశ్న మెదులుతోంది. సింహాల చోరీ విషయాన్ని దాచిపెట్టి… పోయిన వాటి స్థానంలో కొత్తవి పెట్టే ప్రయత్నం జరుగుతుందని భక్తులు ఆరోపిస్తున్నారు. రికార్డుల పరిశీలనకు మూడు రోజుల సమయం ఎందుకని విపక్ష నేతలు ప్రశ్నిస్తున్నారు. రథాన్ని మీడియాకు చూపించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

దొంగలను గుర్తించడం కష్టమే:
వెండి ఉత్సవ రథం దగ్గర సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ వెండి సింహాలు మాయం కావడం వెనుక ఇంటి దొంగల పాత్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయంలో సీసీ ఫుటేజీ బ్యాకప్‌ నెల రోజులకు మించి ఉండదు. లాక్‌డౌన్‌ సమయంలో చోరీ జరిగి ఉంటే.. ఆ దృశ్యాలేవీ ఇప్పుడు సీసీ టీవీల్లో లభించవు. ఇప్పుడు దొంగలను గుర్తించడం కూడా కష్టంగా మారే అవకాశం ఉంది.

ఇక సింహం విగ్రహాల చోరీని ఆలయ ఈవో సురేశ్‌బాబు ఖండించారు. ఏడాది నుంచి రథాన్ని బయటికి తీయలేదని.. చోరీ జరిగిందా? లేక స్టోర్‌ రూంలో ఉన్నాయా? అన్నది రికార్డులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు.Related Posts