తెలంగాణలో ఒక్కరోజే 985 కరోనా కేసులు

  • Published By: bheemraj ,Published On : June 28, 2020 / 01:01 PM IST
తెలంగాణలో ఒక్కరోజే 985 కరోనా కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. శుక్రవారం (జూన్ 26, 2020) ఒక్కరోజే 985 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 12, 349కు చేరింది. శుక్రవారం ఏడు మంది మృతి చెందగా, మొత్తం మరణాల సంఖ్య 237 కు చేరింది. ఒక్కరోజే 78 డిశ్చార్జ్ అయ్యారు. దీంతో మొత్తం 4,766 మంది డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో 7,436 మంది చికిత్స పొందుతున్నారు.

అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 774 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్‌ ఆసిఫ్‌నగర్‌ పోలీస్‌ డివిజన్‌లో శుక్రవారం ఒక్కరోజే 177 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఆసిఫ్‌నగర్‌ పోలీస్ స్టేషన్ లో ఓ హెడ్‌కానిస్టేబుల్‌కు కూడా వైరస్‌ సోకింది. దీంతో ఇప్పటివరకు ఈ పోలీస్‌స్టేషన్‌లో కరోనా కేసుల సంఖ్య 19కి చేరింది.

అంబర్‌పేటలో ఇద్దరికి రెండోసారి కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఓ మహిళా వైద్యురాలికి 21 రోజుల క్రితం పాజిటివ్‌గా తేలడంతో గాంధీలో చికిత్స పొందారు. తర్వాత హోంక్వారంటైన్‌లో ఉన్నారు. చికిత్స పూర్తయిన అనంతరం విధుల్లో చేరడానికి మరోసారి టెస్ట్‌ చేయించుకోగా మళ్లీ పాజిటివ్‌గానే వచ్చింది. కాచిగూడ చప్పల్‌బజార్‌కు చెందిన ఓ వ్యక్తికి గత నెలలో పాజిటివ్‌ రాగా, గాంధీలో చికిత్స పొంది డిశ్చార్జి అయ్యాడు. రెండురోజుల కిందట మళ్లీ వైరస్‌ లక్షణాలు కనిపించడంతో టెస్ట్‌ చేసుకున్నారు. శుక్రవారం పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వీరిని హోంక్వారంటైన్‌లో ఉంచారు.

రంగారెడ్డి-86, మేడ్చల్‌-53, వరంగల్‌ అర్బన్‌-20, మెదక్‌-9, ఆదిలాబాద్‌-7, నాగర్‌కర్నూల్‌, నిజామాబాద్‌, రాజన్నసిరిసిల్ల-6 చొప్పున, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ఖమ్మం-3 చొప్పున, ములుగు, జగిత్యాల, యాదాద్రిభువనగిరి-2 చొప్పున, వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, నల్లగొండ జిల్లాల్లో-1 చొప్పున కేసులు నమోదయ్యాయి. వైరస్‌ కారణంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 75,308 పరీక్షలు చేయగా, 12,349 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. మొత్తం 237 మంది మరణించినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్‌లో పేర్కొన్నది.

Read:  లావణ్య లహరి ఆత్మహత్య కేసులో కొత్త విషయాలు…