రోడ్డుక్కెనున్న సిటీ బస్సులు?

  • Published By: srihari ,Published On : May 30, 2020 / 01:20 AM IST
రోడ్డుక్కెనున్న సిటీ బస్సులు?

హైదరాబాద్ నగరంలో సిటీ బస్సులు రోడ్డుకెక్కనున్నాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. కానీ, నగరంలో మాత్రం సిటీ సర్వీసులను ఇంకా ప్రారంభించలేదు. ఈనెల 31తో నాలుగో విడత లాక్‌డౌన్‌ ముగుస్తున్న నేపథ్యంలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించే దిశగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కేంద్రం మరికొన్ని సడలింపులతో కొత్త మార్గదర్శకాలు జారీ చేసే అవకాశం కనిపిస్తోంది. సిటీ బస్సులు లేకపోవటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కరోనా నిబంధనలతో సిటీ సర్వీసులు కూడా ప్రారంభించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. వచ్చే నెల మొదటి వారంలో వీటిని ప్రారంభించే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయం కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. వచ్చేనెల 5వ తేదీ నుంచి బస్సులు ప్రారంభించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

సిటీ బస్సుల్లో కండక్టర్లు కాకుండా స్టేజీల వద్దే టికెట్లు జారీ చేసే ప్రతిపాదనను ఆర్టీసీ అధికారులు రూపొందించారు. ప్రతి స్టేజీలో ఇద్దరు చొప్పున కండక్టర్లు ఉండనున్నారు. ఒకరు టికెట్‌ జారీ చేస్తే మరొకరు దిగే ప్రయాణికుల వద్ద టికెట్లు తనిఖీ చేయనున్నారు. ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. జిల్లా సర్వీసుల తరహాలోనే కండక్టర్లతో కూడిన బస్సులనే తిప్పాలని నిర్ణయించింది. నిలబడి ప్రయాణించేందుకు అవకాశం ఇవ్వవద్దని నిర్ణయించారు. సిటీ బస్సులకు ఒకేసారి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు ఎగబడే పరిస్థితి ఉండటంతో నిలబడకుండా చూడటం కష్టసాధ్యమేనని అధికారులు అంటున్నారు. 

నిత్యం 33 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో సిటీలో ప్రయాణిస్తారు. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. షేర్‌ ఆటోల్లో కూడా పెద్ద సంఖ్యలో జనం ప్రయాణించే వారు ఉన్నారు. ఎక్కువ మంది సొంత వాహనాలతో వెళ్తున్నారు. లాక్‌డౌన్‌ వరకు ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణించిన వారు ఇప్పుడు సొంత వాహనాల్లో వస్తుండటంతో నగర రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. లాక్‌డౌన్‌కు ముందు సాధారణ రోజుల్లో ఉన్న ట్రాఫిక్‌ కంటే ఇప్పుడు చాలా ఎక్కువగా కన్పిస్తోంది. బైక్‌ల సంఖ్య బాగా పెరిగింది. 

ప్రస్తుతం నగరంలో కరోనా పాజిటివ్‌ కేసులు విపరీతంగా వెలుగు చూస్తున్నాయి. జియాగూడ, ఆసిఫ్‌నగర్, పాతబస్తీలో ఎక్కువగా ఉంటున్నాయి. ఆ ప్రాంతాలకు కాకుండా మిగతా ప్రాంతాలకు బస్సులు నడపాలని ఆర్టీసీ భావిస్తోంది. సికింద్రాబాద్, మేడ్చల్, రామచంద్రాపురం, హయత్‌నగర్, కుత్బుల్లాపూర్, ఉప్పల్, మాదాపూర్‌.. తదితర ప్రాంతాల వైపు ఎక్కువగా తిప్పాలని భావిస్తోంది. సిటీలో బస్సులు గాని తిరిగేతే నగరవాసులకు రవాణా తిప్పలు తప్పినట్టే.. ఊహించినట్టుగానే  సిటీ బస్సులు ప్రారంభమవుతాయో లేదా చూడాలి. 

Read: తెలంగాణలో న్యాయవ్యవస్థ లాక్ డౌన్ జూన్ 6 వరకు పొడిగింపు