తెలంగాణపై Corona ఎఫెక్ట్ : మే నెలలో కూడా జీతాల్లో కోత

  • Published By: madhu ,Published On : May 28, 2020 / 12:29 AM IST
తెలంగాణపై Corona ఎఫెక్ట్ : మే నెలలో కూడా జీతాల్లో కోత

ప్రజాప్రతినిధులు, ఉద్యోగుల వేతనాల్లో కోత తప్పదు. పెన్షనర్ల పెన్షన్‌లో కోత కంటిన్యూ అవుతుందని తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. లాక్‌డౌన్ నిబంధనల్లో కొన్ని సడలింపులు ఇచ్చినప్పటికీ ఆదాయం పెద్దగా పెరగలేదన్నారు. ఆర్థిక పరిస్థితి దృష్ట్యా వేతనాల్లో కోత కొనసాగిస్తున్నామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 2020, మే 27వ తేదీ బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా అధికారులు రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని కేసీఆర్‌కు వివరించారు. ప్రభుత్వానికి వస్తున్న ఆదాయంపై ఆరా తీసిన ఆయన… కరోనా ప్రభావంతో తెలంగాణ ఆదాయం గణనీయంగా తగ్గిందన్నారు. తెలంగాణ రాష్ట్రానికి నెలకు 12 వేల కోట్ల వరకు ఆదాయం రావాల్సి ఉండగా మే నెలలో కేంద్రం వాటాతో కలిపి 3100 కోట్ల ఆదాయం మాత్రమే వచ్చిందని వెల్లడించారు. ఈ డబ్బులతోనే అన్ని అవసరాలు తీర్చుకోవాల్సి ఉందన్నారు.

ఇప్పుడు వచ్చిన ఆదాయం ఉద్యోగుల వేతనాలు, పెన్షన్స్‌ సరిపోతుందన్నారు. ప్రతీనెలా ఉద్యోగుల జీతాలు, పెన్సన్లకు తెలంగాణ ప్రభుత్వం రూ. 3000 వేల కోట్లు చెల్లిస్తోందన్నారు. ఉద్యోగులు, ఫించనర్లకు ఫించన్లు చెల్లిస్తే.. ఖజానా ఖాళీ అవుతుందన్నారు. దీంతో మే నెలలోనూ ఉద్యోగుల వేతనాల్లో కోత కొనసాగించాలని నిర్ణయించామన్నారు. 

ప్రజాప్రతినిధుల వేతనాల్లో 75 శాతం, ఆలిండియా సర్వీసు అధికారుల వేతనాల్లో 60 శాతం కోత విధించనున్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో 50 శాతం, పెన్షన్‌ దారులకు 25 శాతం, కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది వేతనాల్లో 10శాతం మేర  కోతను కొనసాగించాలని ఆదేశించారు. ఇక లాక్‌డౌన్‌ నుంచి ప్రభుత్వం తెల్లరేషన్‌ కార్డు లబ్దిదారులకు ఇస్తోన్న రూ. 1500 నగదును కూడా నిలిపివేయనున్నట్టు కేసీఆర్‌ తెలిపారు.

తెలంగాణ ఏడాదికి అప్పులకు  రూ. 37,400 కోట్లు వడ్డీగా చెల్లించాల్సి ఉంటుందన్నారు. అప్పులను రీ-షెడ్యూల్‌ చేయాలని కోరినా కేంద్రం స్పందించకపోవడంతో వడ్డీలు తప్పక కట్టాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఎఫ్ఆర్‌బీఎం పరిమితి పెంచినప్పటికీ, కేంద్రం విధించిన షరతుల కారణంగా అదనపు రుణాలను సమకూర్చుకునే పరిస్థితిలో లేమని సీఎం కేసీఆర్‌కు అధికారులు వివరించారు. 

Read: అదే నిర్లక్ష్యం : పొడ్చన్ పల్లి బోరు బావి విషాదం..అసలు ఏం జరిగింది ?