టీ20 ప్రపంచ కప్ జరిగేనా 

  • Published By: madhu ,Published On : May 25, 2020 / 04:18 AM IST
టీ20 ప్రపంచ కప్ జరిగేనా 

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్‌ జరిగే అవకాశాలు కనిపించడం లేదన్నాడు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ మార్క్‌ టేలర్‌. ఆస్ట్రేలియా వేదికగా జరగాల్సిన ఈ టోర్నీ.. షెడ్యూల్‌ ప్రకారం జరిగే అవకాశాలు లేవన్నాడు. పరిస్థితుల తీవ్రతను చూస్తుంటే ఏ ప్రపంచ టోర్నీ కూడా జరిగేలా కనిపించడం లేదన్నారు. అయితే… ప్రపంచకప్‌పై ఐసీసీ ఈ వారమే నిర్ణయం తీసుకోవాలన్నాడు. ఈ వారంలో జరిగే ఐసీసీ బోర్డు సమావేశంలో ప్రపంచకప్‌ నిర్వహణ విషయాన్ని తేల్చేయాలని సూచించాడు. ప్రపంచకప్‌ జరగాల్సిన అక్టోబర్‌ – నవంబర్‌లో ఐపీఎల్‌ జరిగితే… ఆ టోర్నీలో ఆస్ట్రేలియా ఆటగాళ్లు పాల్గొనేందుకు అనుమతిచ్చే అవకాశం కూడా ఉండొచ్చని అంచనా వేశాడు. 

అయితే… టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేయొద్దంటున్నాడు పాకిస్థాన్‌ హెడ్‌ కోచ్‌, చీఫ్‌ సెలెక్టర్‌ మిస్బా ఉల్‌ హక్‌. ఆరోగ్య సంరక్షణ చర్యలు చేపడుతూనే మెగాటోర్నీని నిర్వహించాలని కోరాడు. 16 జట్లను ఒకే చోటకు చేర్చడం కాస్త కష్టమైనా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో క్రికెట్‌ను తిరిగి ప్రారంభించేందుకు ఇంతకన్నా మంచి మార్గం ఉండబోదన్న మిస్బా… వైరస్‌ గురించి ఆలోచిస్తూ తీవ్ర నైరాశ్యంలో ఉన్న ప్రజల  దృష్టి మరల్చాల్సిన అవసరం ఉందన్నాడు. అయితే లాక్‌డౌన్‌ అనంతరం ప్లేయర్లంతా కలిసి కాకుండా విడివిడిగా ప్రాక్టీస్‌ చేయాలని, ఎవరికి వారే సిద్ధం కావాలని చెప్పాడు. 

మరోవైపు…IPL భవితవ్యం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉందన్నారు క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు. లీగ్‌ నిర్వహణపై ఎలాంటి నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకుంటుంది కానీ.. బీసీసీఐ కాదని స్పష్టం చేశారు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా లేదనుకుంటేనే ఐపీఎల్‌ సాధ్యపడుతుందన్నారు. వైరస్‌ పరిస్థితిని అనుసరించి.. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ఏదైనా నిర్ణయం తీసుకుంటామని… క్రీడా ఈవెంట్ల కోసం ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టలేమని చెప్పారు. 

Read:టీ20ల్లో కెప్టెన్‌గా రోహిత్ శర్మ: మాజీ ఫేస్ బౌలర్