కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం : మంత్రి ఈటల

  • Published By: bheemraj ,Published On : June 18, 2020 / 06:31 PM IST
కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం : మంత్రి ఈటల

కరోనా బాధితులకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే వైద్యం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. ప్రజా వైద్యంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకు అనుమతించినట్లు తెలిపారు. ప్రైవేట్‌ ఆస్పత్రులు కూడా కర్తవ్యంగా భావించి రోగులకు చికిత్స అందించాలన్నారు. ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టెస్టు‌లకు ప్రభుత్వం నిర్వహించిన ధరల విషయంపై ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ మంత్రి ఈటల రాజేందర్‌ను కలిశారు. 

బీఆర్కే భవన్‌లో గురువారం మంత్రి ఈటల‌ ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్ సభ్యులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా టెస్టులకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలు పెంచాలని ఆస్పత్రుల అసోసియేషన్‌ మంత్రి ఈటలను కోరారు. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల అసోసియేషన్‌ వినతిని ప్రభుత్వం తిరస్కరించింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు వైద్యం అందించడానికి సహకరించాలని అసోసియేషన్‌ ప్రతినిధులకు విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. ప్రజలకు ధైర్యం కల్పించాలని కోరామన్నారు. 

కొందరు కరోనా పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేయడం సరికాదన్నారు. కరోనా పాజిటివ్‌తో ఉన్నా లక్షణాలు ఉన్నవారికి మాత్రమే హాస్పటల్‌లో ఉంచి చికిత్స అందించాలని చెప్పారు. కరోనా లక్షణాలు లేనివారిని హోం ఐసోలేషన్‌లో ఉంచాలన్నారు. ఐసీయూలో ఉన్న పేషెంట్లకు ప్రభుత్వ రేట్ల ప్రకారమే చికిత్స అందించాలని తెలిపారు. పీపీఈ కిట్లు, మందుల వినియోగానికి అయ్యే ఖర్చును ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగానే వసూలు చేయాలన్నారు.  ప్రైవేటు ఆస్పత్రులకు ఉన్న ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించాలని అసోసియేషన్‌ విజ్ఞప్తి చేయగా త్వరలోనే పెండింగ్‌ బకాయిలను విడుదల చేస్తామని మంత్రి పేర్కొన్నారు.

Read: ఏపీ, తెలంగాణ మధ్య ప్రారంభం కానున్న బస్సు సర్వీసులు?