మృగశిర కార్తె : చేపలు ఎందుకు తింటారో తెలుసా

  • Published By: madhu ,Published On : June 8, 2020 / 02:02 AM IST
మృగశిర కార్తె : చేపలు ఎందుకు తింటారో తెలుసా

మృగ శిర కార్తె ప్రారంభం అయ్యింది. ఈ కార్తె ప్రవేశించడంతో…అందరి చూపు దానిపైనే ఉంటుంది. ఈ రోజు నుంచి చేపలు తినడం ఆనవాయితీగా వస్తోంది. కానీ చేపలే ఎందుకు తినాలి ? మృగశిర కార్తెకు ఉన్న సంబంధం ఏంటీ ? అనే ప్రశ్నలు అందరిలోనూ మెదలుతుంటాయి. ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు దాగి ఉన్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. 

కార్తె ప్రవేశం రోజు..ఏం వంట చేశారు అని అడిగితే..ఠక్కున చేపల కూర..చేపల పులుసు..అని చెబుతుంటారు. ఎప్పుడూ తినని వారు సైతం..ఈ రోజుల్లో ఆరోగ్యం కోసం చేపలు తింటుంటారు. మరికొందరైతే..ఎండబెట్టిన చేపల వరుగును చింత చిగురు వేసుకుని తింటుంటారు. మృగ శిర కార్తె ప్రవేశం రోజు చేపలకు ఫుల్ గిరాకీ ఉంటుంది. దీంతో చేపల ధరలకు రెక్కలు వస్తుంటాయి. సాధారణ రోజు కంటే కిలో చేప ధర రెట్టింపు పలుకుతుంది. బొమ్మె అయితే..రూ. 600 నుంచి వెయ్యి దాక ఉంటాయి. 
మృగ శిర కార్తెలో చేపలను తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుందని, ఎండలు వెళ్లిపోయి..వానలతో పాటు చల్లని వాతావరణం మృగశిర కార్తె మోసుకొస్తుంది.

ఎండకాలం తర్వాత..వాతావరణం చల్లబడడంతో శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటుంటారు. ఈ సీజన్ లో జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. జ్వరం, జలుబు ఇతర అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి. శాఖాహారులైతే..ఇంగువను బెల్లంలో కలుపుకుని తయారు చేసుకుని తింటారు. 
సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించిన నాటి నుంచి నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇస్తుంటాయి. దీంతో వాతావారణం ఒక్కసారిగా చల్లబడడం..తో పాటు అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు, క్రిమి కీటకాలు పునరుత్పత్తి అవుతాయి. మానవులలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం, దగ్గు వచ్చి, శ్వాస సంబంధ వ్యాధులు వస్తుంటాయి.

చేపల విషయానికి వస్తే..ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయనే సంగతి తెలిసిందే. కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కాపర్, మెగ్నీషియం, జింక్ వంటి ఖనిజ పోషకాలు లభిస్తాయి. మానవునికి కావాల్సిన అతి ముఖ్యమైన రుచిని పెంచే లైసిన్, మిథియోనిన్, ఐసాల్యూసిన్ వంటి ఆమ్లోనో అమ్లాలు పుష్కలంగా ఇందులో లభిస్తాయి. థయామిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, పెరిడాక్సిన్‌, బయోటిన్‌, పెంటోదినిక్‌ ఆమ్లం, బీ 12 వంటి విటమిన్స్‌ పుష్కలంగా ఉంటాయి.

ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో DHA, EPA వంటివి కంటి చూపునకు పనిచేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి. చేపల్లో ఉన్న కొవ్వులు (కొలెస్ట్రాల్‌, ట్రై గ్లిసరైడ్స్‌) శరీర రక్త పీడనంపై (అంతిమంగా గుండెపై) మంచి ప్రభావం చూపుతాయి. గుండె జబ్బు, అస్తమా వ్యాధిగ్రస్తులు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే చాలా మంచిది. మృగ శిర కార్తెలో బత్తిని సోదరులు చేపమందు వేసేవారు. కరోనా నేపథ్యంలో ఈసారి వేయడం లేదు. మొత్తంగా చేపల ద్వారా అనేక పోషకాలు అందడమే కాకుండా…సులువుగా జీర్ణమవుతుంది.

Read: యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం..ఆధార్ తప్పనిసరి