మళ్లీ మైదానంలోకి శ్రీశాంత్.. రంజీల్లోకి తీసుకుంటారా?

  • Published By: vamsi ,Published On : June 19, 2020 / 02:43 AM IST
మళ్లీ మైదానంలోకి శ్రీశాంత్.. రంజీల్లోకి తీసుకుంటారా?

సెప్టెంబరులో బిసిసిఐ నిషేధం ముగిసిన తర్వాత ఫిట్నెస్ నిరూపిస్తే కేరళ క్రికెట్ జట్టులో ఎంపిక కోసం భారత మాజీ పేసర్ ఎస్ శ్రీశాంత్ పరిగణించబడతారని రాష్ట్ర జట్టు కోచ్ టిను యోహన్నన్ వెల్లడించారు. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్‌కి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీశాంత్ (37) ను 2013 ఆగస్టులో బీసీసీఐ జీవితకాలానికి నిషేధించింది. అయితే, బిసిసిఐ అంబుడ్స్‌మన్ డికె జైన్ గత ఏడాది శిక్షను ఏడేళ్లకు తగ్గించారు. ఈ సెప్టెంబరుతో శ్రీశాంత్‌పై నిషేధం పూర్తికానుంది. 

ఈ క్రమంలో ఈ ఏడాది రంజీ ట్రోఫీకి శ్రీశాంత్ పరిగణించబడతారని, శ్రీశాంత్ మళ్లీ కేరళ తరఫున ఆడాలని ఎదురుచూస్తున్నట్లు చెప్పారు యోహన్నన్. కేరళలో అందరూ కూడా దాని కోసం ఎదురుచూస్తున్నారని, తన ఫిట్‌నెస్‌ కోసం కష్టపడడానికి శ్రీశాంత్‌కు తగినంత సమయం ఉందని యోహన్నన్ చెప్పారు. 

ప్రస్తుతం COVID-19 మహమ్మారి నేపథ్యంలో ఆగస్టులో ప్రారంభమయ్యే దేశీయ సీజన్‌ను తిరిగి మార్చవచ్చునని, ఆట పున: ప్రారంభం గురించి చాలా అనిశ్చితి ఉన్నందున క్యాంప్, ప్రాక్టీస్ మొదలైన వాటి కోసం ప్రణాళికలు రావాలంటే వేచి చూడక తప్పదని అన్నారు. శ్రీశాంత్ తనతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాడని, అతని ఆటపై తీవ్రంగా కృషి చేస్తున్నారని యోహన్నన్ చెప్పాడు.

మళ్లీ క్రికెట్‌ ఆడేందుకు ఎదురుచూస్తున్నానని శ్రీశాంత్‌ కూడా చెప్పాడు. “ప్రస్తుతం శిక్షణ కొనసాగిస్తున్నానని, సన్నిహితులు, కోచ్‌లు, సెలెక్టర్లు అంతా నన్ను తిరిగి కేరళ జట్టుకు ఆడాలని ఆశిస్తున్నారు. ఫిట్‌గా ఉన్నా. ఆడాలనే ఉత్సాహంగా ఉన్నా. త్వరలో నన్ను మైదానంలో చూస్తారు’’ అని శ్రీశాంత్‌ చెప్పాడు.  టీమ్‌ఇండియా తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు ఆడారు శ్రీశాంత్.

Read: ఇండియా ఫ‌స్ట్ ట్రాన్స్ జెండ‌ర్ ఫుట్ బాల్ టీం