సోము వీర్రాజు సెకండ్ యాంగిల్.. నోరు మెదపడానికి భయపెడుతున్న బీజేపీ లీడర్లు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అధ్యక్ష పదవిలో లేనప్పుడు మౌనంగా ఉన్న సోము వీర్రాజు… ఇప్పుడు పార్టీని శాసించేలా వ్యవహరిస్తున్నారు. బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతలు చేపట్టాక ఆయనలోని వేరే కోణం బయటకు తీశారని పార్టీ నేతలే అంటున్నారు. ఆయన నాయకత్వంలో పార్టీ నేతలు మాట్లాడితే ఒక తంటా.. లేకుంటే మరో తంటా అని చెవులు కొరుక్కుంటున్నారు. ఎందుకొచ్చిందిలే అని సైలెంట్‌గా ఉంటే పనిచేయడం లేదనే నింద.

మరోవైపు పార్టీలో ఆయనతో పాటు ప్రతీ సమస్యపై ఓ ఇద్దరు ముగ్గురు తప్పితే మరెవరూ నోరు మెదపని పరిస్ధితి. పార్టీలో ఉన్నా లేనట్లుగానే వ్యవహరిస్తున్నారు. ఇతర బీజేపీ నేతలు. “ఏపీలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తా.. సారీ జనసేనతో కలిసి అధికారంలోకి తీసుకు వస్తా… ఒక్క చాన్స్ ఇవ్వండి.. మేమంటే ఏంటో చూపిస్తా… ప్రాంతీయ పార్టీల వల్ల ప్రజలు నష్టపోయింది చాలు. ఇక జాతీయ పార్టీలకు అవకాశం ఇవ్వండి..” ఈ మాటలే సోమూ వీర్రాజు కొత్త పాటగా వినిపిస్తున్నారు.

అమరావతి రాజధాని విషయంలో నాలుక కరుచుకున్న బీజేపీ.. కొత్త వారిని మాట్లాడనీయకుండా భయపెడుతోంది. ఒకవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజధాని అమరావతిలోనే ఉండాలంటే.. బీజేపీ మాత్రం రైతులకు న్యాయం జరగాలంటుంది. దీనిపై ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితి. ఇదే సమయంలో నోరు తెరిచి మాట్లాడుతున్న నేతలపై ఇప్పటికే సస్పెన్షన్ల వేటు వేశారు కొత్త అధ్యక్షుల వారు. ఇక వలసవాదులకైతే అక్షింతలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఎవరిని తిట్టాలో ఎవరిని తిట్టకూడదో,.. ఏం మాట్లాడాలో తెలియక పార్టీ కేడర్‌ అంతా సైలెంట్ అయిపోయిందట.

ఇప్పటికే మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ వర్గానికి పార్టీలో కీలక పదవుల నుంచి ఉద్వాసన తప్పదనే ప్రచారం జరుగుతోంది. పొమ్మన లేక పొగ అన్నట్టుగా ఒక్కొక్కరినీ సైడ్ చేస్తున్న క్రమంలో నోరు తెరిస్తే తమపై కూడా వేటు పడుతుందనే ఉద్దేశంతో ప్రజా సమస్యలపై కూడా నోరెత్తడమే మానేశారట పార్టీ నేతలు. ఇప్పటికే జిల్లాల పర్యటనలో బిజీగా ఉన్న సోము వీర్రాజే ప్రతి సమస్యపై గళమెత్తుతున్నారు. ఆయనతో పాటు ప్రభుత్వంపై పార్టీలోని ఇద్దరు, ముగ్గురు మాత్రమే స్పందిస్తున్నారు.

ఇదే సమయంలో ప్రతీ చోట తాను చెప్పిందే వేదమన్నట్లుగా వీర్రాజు వ్యవహరిస్తున్నారంటూ పార్టీ నేతలే చెవులు కొరుక్కుంటున్నారు. పార్టీ పదవులు ఆశించిన వారంతా తమకెందుకులే ఈ గొడవలటూ ఇళ్లకే పరిమితం అవుతున్నారు. సోము వీర్రాజు పర్యటిస్తున్న సందర్భంలో, మిగతా కార్యక్రమాల సమయంలో మాత్రమే దర్శనమిస్తున్నారు. దీంతో పార్టీలో వీర్రాజు వర్సెస్ మిగిలిన నేతలు అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. కానీ వీర్రాజు మాత్రం క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఎవరు తప్పు చేసినా క్షమించేది లేదంటూ హెడ్‌ మాస్టర్‌ స్టయిల్లో లెక్చర్లు ఇస్తూ హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

READ  TTD సంచలన నిర్ణయం.. తిరుమల కొండపైకి నో ఎంట్రీ!

ఇదే వలస నేతలకు మింగుడు పడడం లేదట. పదవులు వచ్చే ముందు సైలెంట్‌గా ఉండడాన్నే ప్రధాన అస్త్రంగా భావిస్తూ ఢిల్లీ నేతలతో టచ్‌లో ఉంటూ పార్టీలో తమ ఉనికిని కాపాడుకుంటున్నారట. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సోమూ వీర్రాజు అందరినీ కలుపుకొని తన మార్కును చాటుకుంటారా? పార్టీ నేతలకు పవర్స్ ఇచ్చి ప్రోత్సహిస్తారా? లేక ఉన్న కొద్దిపాటి కేడర్‌ను పోగొట్టుకుంటానా? అనే ప్రశ్నలు ఇప్పుడు పార్టీ కేడర్‌తో పాటు నేతలను వేధిస్తున్నాయి. ఈ విషయంలో సోము వీర్రాజు తన స్టయిల్‌ మార్చుకుంటారా? నేను మోనార్క్‌ని అంటూ ముందుకెళ్తారా అన్నది చూడాల్సిందే.

Related Posts