హిందుత్వాన్ని పరిరక్షించకపోతే కేంద్రం ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది, ఏపీ ప్రభుత్వానికి సోమువీర్రాజు వార్నింగ్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రాష్ట్రంలో ఆలయాలపై దాడులు జరుగుతున్నాయని ఏపీ బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ఆందోళన వ్యక్తం చేశారు. అంతర్వేది ఘటనపై వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని సీఎం జగన్ కు లేఖ రాసినట్టు చెప్పారు. హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. లేని పక్షంలో కేంద్రం ఆగ్రహిస్తుందనే విషయాన్ని తెలుసుకోవాలన్నారు. దేవాదాయశాఖకు చెందిన సెంటు భూమి కూడా అన్యాక్రాంతం కాకుండా చూస్తామని సోమువీర్రాజు చెప్పారు. అంతర్వేది ఘటనపై టీడీపీకి మాట్లాడే హక్కు లేదన్నారు. టీడీపీ, వైసీపీలు మతతత్వ రాజకీయ పంథాలతో వెళ్తున్నాయని మండిపడ్డారు.

ప్రజల ఆవేదనలో ఉన్నారు:
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆలయాలపై దాడులు బాధాకరం అన్నారు. ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన అంతర్వేది శ్రీలక్ష్మీ నరసింహస్వామి వారి రథం అగ్నికి ఆహుతి అవుతుంటే ప్రజలు ఎంతో ఆవేదనకు గురయ్యారని సోమువీర్రాజు అన్నారు. అంతకుముందు బిట్రగుంట, పిఠాపురంలలో కూడా ఈ తరహా సంఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తు చేశారు.

కేంద్రం ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుంది:
”అసలు రాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడింది. ఇలా రాష్ట్రంలో హిందుత్వానికి విఘాతం కలిగించే అంశాలపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టి పెట్టాలి. లేని పక్షంలో కేంద్రం కఠినంగా వ్యవరించాల్సి వస్తుంది” అని సోమువీర్రాజు హెచ్చరించారు. అసలు మీరు హిందుత్వాన్ని పరిరక్షిస్తారా… లేదా? తేల్చి చెప్పండి అని సూటిగా జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దేవాలయాలలో జరుగుతున్న పరిణామాలుపై బీజేపీ తరపున ఒక కమిటీ వేస్తామని సోమువీర్రాజు వెల్లడించారు.

చర్చిలకు వచ్చిన ఆదాయంతోనే చర్చిల నిర్మాణం చేయగలరా?
టీడీపీపైనా సోమువీర్రాజు ఫైర్ అయ్యారు. అంతర్వేది ఘటనపై మాట్లాడే హక్కు టీడీపీకి లేదన్నారు. గోదావరి, కృష్ణా పుష్కరాల సమయంలో ఎన్నో ఆలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చి వేసిందన్నారు. టీడీపీ, వైసీపీలు మతతత్వ రాజకీయాల పంథాలో వెళ్తున్నాయని, టీడీపీ మేనిఫెస్టోలో సైతం క్రైస్తవులకు మేలు చేసే అంశాలు ఇచ్చారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం చర్చి నిర్మాణం కోసం నిధులు ఇస్తోందని సోమువీర్రాజు ఆరోపించారు. ”టీడీపీ, వైసీపీ వాళ్లకి సవాల్ చేస్తున్నా. టీటీడీ నిధులతోనే దేవాలయ నిర్మాణం చేస్తాం అంటున్నారు. అలాగే కేవలం చర్చిలకి వచ్చే ఆదాయంతోనే చర్చిలు నిర్మాణం చేయగలరా? చర్చిలు ఆస్తులపై కమిటీలు వేయగలరా?” అని ప్రశ్నించారు.

టీటీడీ బోర్డులో స్వామీజీలకే చోటు:
”ఇక టీటీడీ బోర్డులో రాజకీయ నాయకులు కాకుండా కేవలం స్వామీజీలను నియమించాలని నిర్ణయించాం. 2024 ఎన్నికల్లో అన్ని మతాలకు మేలు చేసేలా మేనిఫెస్టో రూపొందిస్తాం. మతాల ఆధారంగా రిజర్వేషన్ ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రంలో హిందుత్వానికి విఘాతం కలిగించే విధంగా ఎవరు వ్యవరించినా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలి” అని సోమువీర్రాజు డిమాండ్ చేశారు.

READ  టీడీపీ ఓటమికి కారణమైన లోకేశ్‌కు జగన్‌ను విమర్శించే స్థాయి లేదు

Related Posts