రూ.3కోట్ల ఆస్తి పంచి ఇచ్చినా, తిండి పెట్టకుండా తండ్రిని బజారులో వదిలేసిన ముగ్గురు కొడుకులు అరెస్ట్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

రూ.3 కోట్ల విలువైన ఆస్తులు పంచి ఇచ్చినా లాభం లేకపోయింది. కనీసం అన్నం కూడా పెట్టకుండా కన్నతండ్రిని నడి బజారులో వదిలేశారు కొడుకులు. అందరిని కంటతడి పెట్టించిన ఈ ఘటనపై వీఆర్వో ఇచ్చిన ఫిర్యాదుతో కోహెడ ఎస్‌ఐ స్పందించారు. తండ్రిని నడి వీధిలో వదిలేసిన ఆ ముగ్గురు కసాయి కొడుకులను పోలీసులు బుధవారం(ఆగస్టు 5,2020) అరెస్ట్ చేశారు. వారిని కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ రిమాండ్‌కు ఆదేశించారు.సిద్దిపేట జిల్లా కోహెడ మండలం శనిగరం పరిధి శంకర్‌నగర్‌కు చెందిన పోతు మల్లయ్య(79)కు రవీందర్‌, జనార్దన్‌, రవీందర్‌ సంతానం. తండ్రి మల్లయ్య వారికి రూ.కోటి చొప్పున ఆస్తి పంచి ఇచ్చాడు. తండ్రి ఆస్తిని పంచుకున్న కొడుకులు ఆయనను మాత్రం గాలికి వదిలేశారు. ఒక్కొక్కరు కోటి రూపాయల ఆస్తి దక్కించుకున్నా, తండ్రిని పోషించడానికి మాత్రం వారిలో ఒక్కరు కూడా ముందుకు రాలేదు. తమకేమీ సంబంధం లేన్నట్టుగా తండ్రిని వదిలేశారు. కనీసం అన్నం కూడా పెట్ట లేదు. మల్లయ్య పరిస్థితి చూసి చలించిపోయిన గ్రామ పెద్దలు రంగంలోకి దిగారు. ఆ ముగ్గురు కొడుకులకు అనేక విధాలుగా నచ్చ చెప్పారు. తండ్రిని చూసుకోవాలని కోరారు. ఆ తర్వాత పోలీసులు కూడా రంగంలోకి దిగిన కౌన్సిలింగ్‌ ఇచ్చారు. అయినా మార్పు లేదు. చివరికి ఆర్డీవో చెప్పినా ఆ కసాయి కొడుకల్లో మార్పు రాలేదు. కన్నతండ్రిని పట్టించుకోలేదు. దీంతో మల్లయ్య ఏడాదిగా గ్రామ ప్రజలు పెట్టింది తింటూ కాలం వెళ్లదీస్తున్నాడు.నెలరోజుల క్రితం కోహెడ ఎస్‌ఐ రాజకుమార్‌, గ్రామపెద్దలతో కలిసి మల్లయ్యను చిన్నకోడూరు మండలం అంకిరెడ్డిపల్లి గ్రామ శివారులోని వృద్ధాశ్రమంలో చేర్పించారు. అక్కడ చేరిన తరువాత అనారోగ్యం పాలయ్యాడు. దీంతో ఆశ్రమ నిర్వాహకులు మల్లయ్యను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్నాడు మల్లయ్య.దీని గురించి కుమారులకు ఎస్ఐ సమాచారం ఇచ్చారు. అయినా ఒక్కరూ కూడా ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడలేదు. తండ్రిని పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో కన్నతండ్రిని పట్టించుకోని కుమారులపై శనిగరం వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఎస్‌ఐ రాజ్‌కుమార్‌ ఆ ముగ్గురు కుమారులను అరెస్ట్ చేశారు. వారిపై కేసు నమోదు చేసి హుస్నాబాద్‌ కోర్టులో హాజరు పరచగా మెజిస్ట్రేట్‌ వారికి రిమాండ్ విధించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. తండ్రి ఆస్తిని పంచుకున్న ఆ కొడుకులు, తండ్రిని పట్టించుకోకపోవడం అందరిని కంటతడి పెట్టించింది. జాలి, దయ, మనసు లేని ఆ కొడుకులను కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. వారికి ఇచ్చిన ఆస్తిని కూడా వెనక్కి లాక్కోవాలన్నారు.

READ  కోరిక తీర్చమని కోడలికి వేధింపులు...కొడుకు చేతిలో హత్య

Related Posts