నట ‘బాలు’..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

SPB as Actor: సినిమా గాయకుడికి గాత్రంతో నటించగలగడం వచ్చుండాలి. అలా వచ్చిన గాయకుడే సక్సెస్ అవుతాడు. సంగీతం అభినయంతో సమ్మిళితం కావాలి. ఆ ఏరియాలో ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం అద్భుతమైన విజయం సాధించారు. ‘ముత్యాలు వస్తావా’ పాటతో అల్లు రామలింగయ్యే పాడుతున్న అనుభూతి కలిగించేశారు. ఆ ఉత్సాహమే తెర మీదకు తీసుకువచ్చింది. బాలు తొలిసారి తెరమీద కనిపించిన చిత్రం ‘మహమ్మద్ బిన్ తుగ్లక్’.
అయితే బాలసుబ్రహ్మణ్యం పూర్తి స్థాయి నటుడిగా కనిపించిన చిత్రం వాసు దర్శకత్వం వహించిన ‘పక్కింటి అమ్మాయి’. ఇదే కథతో అంతకు ముందు వచ్చిన ‘పక్కింటి అమ్మాయి’ సినిమాలో ఎఎమ్ రాజా వేసిన పాత్రనే ఈ కొత్త ‘పక్కింటి అమ్మాయి’లో బాలు పోషించారు. రాజాలో లేని నట ఉత్సాహం బాలులో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.


బాలులోని నటుణ్ణి గుర్తించిన దర్శకుడు బాలచందర్. తను తీసే తమిళ సినిమాల్లో బాలుతో చిన్న చిన్న పాత్రలు చేయించుకునేవారు. బాలచందర్ టీమ్ లో ఒకరైన అనంతు డైరక్ట్ చేసిన ‘శిగరం’ చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడంతో పాటు ఓ చక్కని పాత్ర కూడా చేశారు బాలు. బాలచందర్ దర్వకత్వంలో వచ్చిన ‘నందిని’ లోనూ బాలు డాక్టర్ పాత్రలో నటించారు.

బాలచందర్, అనుంతు వరుసలోనే దర్శకుడు వసంత్ కూడా బాలులోని నటుడికి అభిమాని. ఆ అభిమానంతో నడివయసు పాత్రను లీడ్ రోల్ గా చేసుకుని రాసుకున్న కథలో బాలుని హీరోగా ఎంచుకున్నాడు. ‘కేలడి కన్మణి’ టైటిల్ తో విడుదలైన ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. చెన్నైలో రెండువందల రోజులు పైన ఆడేసింది. ఇదే సినిమాను తెలుగులో ‘ఓ పాపాలాలి’ పేరుతో డబ్ చేశారు. అది కూడా చాలా పెద్ద విజయం సాధించింది. అందులో బాలు పాడిన బ్రీత్ లెస్ సాంగ్ జనం మనసుల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది.


ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలోని నటుడు బాగా తెలిసిన తెలుగు దర్శకుడు జంధ్యాల. ముఖ్యంగా బాలులోని హాస్యప్రియత్వం జంధ్యాలను ఆకట్టుకుంది. అభినయాల్లో హాస్యాభినయం కాస్త ఎక్కువ కష్టం. దాన్ని బాలు అద్భుతంగా పండించగలరని నమ్మి ‘మల్లెపందిరి’ సినిమాలో షేక్ జాకబ్ శాస్త్రిగా నటింపచేసుకున్నారు జంధ్యాల.

బాలసుబ్రహ్మణ్యం గానంలో ఎంతటి ఈజ్ ఉంటుందో నటనలోనూ అంతే ఈజ్ కనిపిస్తుంది. తెలుగు సినిమా ప్రేక్షకులకు అలవాటు లేని నటన ఇది. తమిళ ప్రేక్షకులే ఎక్కువ ఆదరించారు. ఇదంతా ఒక తరం వరకే.. తర్వాత బాలును నటుడుగా కూడా యాక్సెప్ట్ చేసేశాయి ఆ తర్వాత వచ్చిన రెండు తరాలూ …


బాలు సరదాగా నటించినప్పుడు ఎక్కువగా హాస్యపాత్రలనే ఎంచుకునేవారు. అయితే సీరియస్ కారక్టర్లను కూడా అదే స్థాయిలో పండించగల నటుడు తను. నటుడు బాలుకి మంచి శిక్షణ ఇచ్చింది అతనిలోని డబ్బింగ్ కళాకారుడు బాలు. కమల్ హాసన్ లాంటి కొత్త తరం నటులకు తను డబ్బింగ్ చెప్పడం ద్వారా కొత్త తరహా నటనకు ఓనమాలు దిద్దేశారు.

READ  స్నేహితురాలితో శర్వా పెళ్లి!..

దాసరి నారాయణరావు తో ‘పర్వతాలూ పానకాలూ’ చిత్రంతో సహా అనేక చిత్రాల్లో బాలు అతిథి పాత్రల్లోనో పూర్తి స్థాయి పాత్రల్లోనో కనిపించినా నటుడిగా తనదైన ముద్ర వేసిన చిత్రాలు కొన్నే. వాటిలో ‘పవిత్ర బంధం’ ఒకటి. తండ్రిగా మామగా కొడుక్కీ కోడలుకూ మధ్య నలిగిపోయే పాత్రలో చాలా పరిణితి గల నటన కనబరుస్తారాయన.


ఎస్పీబాలసుబ్రహ్మణ్యం తనతో నటింపచేసే దర్శకులకూ నిర్మాతలకూ ఓ విజ్ఞప్తి చేస్తూ ఉండేవారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తనకు పాటలు పెట్టవద్దనీ పెట్టినా అందులో తనతో డ్యాన్సు చేయించడం లాంటి పనులు చేయించవద్దనీ చెప్పేవారు. ఇన్ని చెప్పినా ఆయనతో ఓ పాటకు డ్యాన్స్ చేయించారు దర్శకుడు శంకర్. ఆ పాటలో ప్రభుదేవాకంటే కూడా బాలునే బాగా నర్తించారనే పేరూ వచ్చింది.

‘ప్రేమికుడు’ సినిమాలో బాలులోని నటుడికి తృప్తి కలిగించే సన్నివేశాలూ ఉన్నాయి. కొడుకుకు తను పనిచేసే పోలీస్ స్టేషన్ లోనే థర్డ్ డిగ్రీ ఇంటరాగేషన్ చేయాల్సిరావడం లాంటి సన్నివేశాల్లోనూ కొడుకు ప్రేమలో పడ్డాడని గుర్తించి తాగించి తన మనసులో మాట రాబట్టే సీన్ లోనూ ఆయన నటన మామూలుగా ఉండదు.


వంశీ దర్శకత్వంలో ఎస్పీబీ నటించిన చిత్రం ‘వైఫ్ ఆఫ్ వి వరప్రసాద్’. అందులోనూ సంగీత సాహిత్యాభిరుచి ఉన్న వృద్ధ పాత్రలో కనిపిస్తారాయన. తన మనవడి అభిరుచికి తగిన అమ్మాయినిచ్చి పెళ్లి చేసి వాళ్ల సమక్షంలో తన చివరిరోజులు గడపాలనుకునే తాత పాత్రలో అద్భుతంగా నటించారాయన.

బాలు తొలి సారి డబ్బింగ్ చెప్పిన చిత్రం బాలచందర్ డైరెక్ట్ చేసిన ‘మన్మధలీల’. అందులో కమల్ పాత్రకు సంగీత దర్శకుడు చక్రవర్తి డబ్బింగ్ చెప్తే కమల్ పక్కనే ఉండే వృద్ధ కార్యదర్శికి బాలు డబ్బింగ్ చెప్పారు. గాత్రంతో నటించడం ఏమిటో చెప్పారాయన. కమల్ తో ఆ అనుబంధం చివరి వరకు కొనసాగింది. తన సొంత చిత్రంలో కమల్ తోనటింపచేయడం మాత్రమే కాదు కమల్ చిత్రంలో తనూ నటించేవారు బాలు.


నటుడుగా బాలు చేసిన పాత్రలన్నీ ఒకెత్తు అయితే ‘మిథునం’ లో అప్పదాసు పాత్ర మరోఎత్తు. జీవిత సాయంకాలంలో భార్యతో కలిసి ఒంటరిగా లంకంత ఇంట్లో ఉండడం.. పొద్దున్నే పలకరించే మరో మనిషి కోసం ఎదురుచూసే పరిస్థితిని అర్థం చేసుకోవడం … తను అర్థం చేసుకోవడమే కాదు.. భార్యకు ఇలాంటి ఒంటరితనం అనుభూతికి రాకుండా చూసుకోవడం.. బాలు నటనకు పరాకాష్టగా నిలబడిపోయే చిత్రం ‘మిథునం’.

పాట వచ్చే సందర్భమూ నటించే నటుడి నటనకు సంబంధించిన వివరాలు స్పష్టంగా తెలుసుకుని సన్నివేశాన్ని రక్తి కట్టించడం నేపథ్య గాయకుడికి ఉండాల్సిన లక్షణం. సరిగ్గా ఈ పరిశీలనే బాలును నటుడిగా తీర్చిదిద్దింది. ఉన్నత శిఖరాలను చేర్చింది. ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేసింది. తెలుగు సినిమా ఉన్నంత వరకు నిలిచి వెలిగే నట మూర్తి శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం.


Related Posts