పచ్చని కాపురాల్లో కరోనా చిచ్చు… కూలుతున్న కుటుంబాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం అంతా ఇంతా కాదు..ప్రజలకు ప్రాణ భయాన్ని కల్గించి… ప్రపంచాన్ని ఆర్ధికంగా దెబ్బతీస్తే…పచ్చని కుటుంబాల్లో చిచ్చురేపింది. అదని ఇదని లేకుండా అన్నీరంగాలు కరోనా బారిన పడి సతమతమవుతూనే ఉన్నాయి.  కుటుంబ వ్యవస్ధ కూడా కొన్ని చోట్ల చిన్నాభిన్నమైపోతోంది.  ఇందుకు కారణాలు అనేకం ఉన్నాయి.

ఇంట్లో ప్రతి చిన్న విషయానికి  భార్యా భర్తల మధ్య  గొడవలు జరుగుతున్నాయి. ప్రతి దానికి కీచులాడుకుంటూ ఇంట్లో అశాంతి నెలకొల్పుతున్నారు. ఇది కేవలం ఒక్క రాష్ట్రానికో, ఒక ప్రాంతానికో పరిమితం కాలేదు. ఇదే సమయంలో భార్యాభర్తల వివాహేతర సంబంధాలు, ఆడవారిని మోసం చేసిన ఇంట్లో రామయ్యవీధిలో కృష్ణయ్యలాంటి మగవారి బాగోతాలు కూడా బయటపడ్డాయి.

లాక్ డౌన్ మొదలైన మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకు లక్ష మంది జనాభా ఉన్న తమిళనాడులోని పుదుక్కోటై అనే చిన్న ఊళ్లో 1400 గృహ హింస కేసులు నమోదయ్యాయంటే ప్రజలు తన భాగస్వామి పట్ల ఎంతగా  విసిగిపోయారో అర్ధం చేసుకోండి. అక్కడి మొత్తం కేసులను విశ్లేషించి చూడగా 3 ప్రధాన కారణాలు  కాపురంలో చిచ్చు రేపటానికి కారణమవుతున్నాయని గుర్తించారు. (1) ఇంట్లో  ఎవరు ఏమి చేయాలని పని విభజన చేసుకోలేక పోవటం (2) భార్యా భర్తల్లో ఒకరిపై ఒకరికి అనుమానం (3)  అభద్రతా భావం..ఆర్ధిక సమస్యలు… ఈ మూడు కారణాలతోనే పేచీలు మొదలై అవి తెగే దాకా వచ్చాయి. బయట ఉన్న కరోనాకి తోడు ఇంట్లో ఈ గొడవలు కూడా కుటుంబంలో అశాంతికి కారణమయ్యాయి.

ఇళ్లలో పనిమనుషులు రావటం లేదు వాళ్లు వస్తామన్నా రానివ్వని పరిస్ధితి ఎందుకంటే వాళ్లు అన్ని ఇళ్ళల్లో పని చేసి వస్తారు.ఏ ఇంటిలోంచి కరోనా ఏ ఇంటికి చేరుతుందో అని భయం..దీంతో ఇంట్లో అంట్లు తోమటం..బట్టలు ఉతకటం మొదలు వంటపని దాకా..ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే దాకా ఇంటి ఇల్లాలి పైనే భారం పడుతోంది.  ఆ ఇల్లాలికి సాయపడే వాళ్లు ఉంటారా అంటే… పిల్లలేమో స్మార్ట్ ఫోన్ లోనూ పతిదేవుడు టీవీ ముందు…లేదంటే సోషల్ మీడియాలోనూ కాలక్షేపం చేస్తూ ఉంటారు.

దీంతో సహనం చచ్చిన ఇల్లాలు  పేచీ మొదలెడుతోంది. ఇది చిలికి చిలికి గాలివానగా మారుతోంది. చివరికి పోలీసు స్టేషన్లకు చేరి పెద్ద  పంచాయతీ అవుతోంది. ఇంట్లో  భార్యా భర్తలిద్దరూ  ముందుగానే ఒక టైం టేబుల్ వేసుకుని ఎవరు ఏం పని చేయాలో నిర్ణయించుకుని వాటిని చేసుకుంటూ వెళ్లిపోతే ఇలాంట సమస్యలను ఆదిలోనే తుంచేయవచ్చు. భార్యలకు కొంత ఊరటగా ఉంటుంది.

ఇక ఇంట్లో కూర్చున్న భర్త సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో… వాట్సప్ లోనో  చాటింగ్ చేస్తుంటే అది కూడా గొడవలు సృష్టిస్తోంది.  భార్య ఇంట్లో పనిఅంతా తాను ఒక్కతే  చేస్తుంటే భర్త ఫోన్ మాట్లాడూతూ..చాటింగ్ చేస్తుంటే చిర్రెత్తుకొచ్చిన ఆడ మనిషి గొడవ చేస్తోంది. ఇక్కడే భర్తల కృష్ణలీలలు బయట పడుతున్నాయి. ఉదయం లేచింది మొదలు రాత్రి పక్క మీదకు చేరాక కూడా వాట్సప్ లో అయ్యగారు చేసే చాటింగ్ తో బయట వెలగబెట్టిన రాసలీలలు బయట పడుతున్నాయి.

ఇన్నాళ్ల నుంచి లాక్ డౌన్ కారణంగా దూరంగా ఉన్న ప్రియురాలి, ప్రియుడి నుంచి వచ్చే ఫోన్ కాల్స్, వాట్సప్ మెసేజ్ లు ఇంట్లో కలవర పెడుతున్నాయి. ఇవి భార్యా,భర్తల మధ్య  సంబంధాన్ని దెబ్బతీస్తున్నాయి. ఇన్నాళ్ళు గుట్టుగా సాగిన రంకు ఇప్పుడు బయట పడుతోంది.  డబ్బు సంపాదనలో పడి ప్రశాంతత లేక, యాంత్రికంగా జీవనం సాగిస్తూ…. వేరే సుఖ సంతోషాల కోసం పక్కదారులు పట్టిన భార్యా భర్తల బాగోతాలు ఈ కరోనాలాక్ డౌన్ టైంలో  చాలా వెలుగు చూశాయి. భర్త పట్టించుకోక పోవటంతో పక్కదారి పట్టిన భార్యలు, తాళికట్టిన భార్య ఉన్నా కొత్త రుచుల కోసం పక్కదారి పట్టిన భర్తలు… ఇలాంటి కధలు వెలుగు చూశాయి. కొన్నికేసుల్లో పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ ఇద్దరినీ ఒక గూటికి చేర్చారు.

కరోనా కారణంగా ఆర్ధిక సమస్యలు పెరిగాయి. కొందరికి ఉన్నఉద్యోగాలు పోతే…మరి కొందరికి సగం జీతమే వచ్చింది. వ్యాపారాలు సరిగ్గా జరగక పోవటం ఆర్ధిక సమస్యలను తెచ్చిపెట్టాయి. ఇంట్లో ఒకటి రెండు ఖర్చులు మినహా మిగతా వన్నీ యధాతథంగానే ఉన్నాయి కదా… సరిపడనంతా డబ్బు  ఇంట్లో ఖర్చులకు భర్త ఇవ్వకపోయే సరికి వాటిని సర్దుబాటు చేయలేక భార్య రుస రుసలు.. భార్య రుసరుసలతో భర్త చిరాకులు ఇద్దరి మధ్య  సఖ్యత లోపించి ఒకరి మీద ఒకరు అరుచుకుంటూ కొట్టుకునే స్ధాయికి వెళ్లిన కేసులు ఉన్నాయి.

కరోనా లాక్ డౌన్ కారణంగా  మానసికంగా బాధపడుతున్న వారు కూడా ఎక్కువయ్యారు.  ప్రతి మనిషిలోనూ ఇప్పడు ప్రాణ భయం పట్టుకుంది. ఎంత సంపాదించాం అని కాక ఎంత ఆరోగ్యంగా ఉన్నాం అనే కాన్పెప్ట్ లోకి వచ్చారు జనం.  కొంత మందిలో తెలియకుండా  చావుభయం ఏర్పడింది. మరికొందరిలో సహనం నశించింది. ఇప్పటికే వివిధ మానసిక కారణాలతో సైక్రియాటిస్టులను సంప్రదించే వారు కూడా ఎక్కువయ్యారు. మున్ముందు ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు సైక్రియాటిస్టులు. కరోనా బారిన పడకుండా శానిటైజర్, మాస్క్ లతో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లే కుటుంబాల్లో  అభిప్రాయ బేధాలు వచ్చినప్పుడు భార్యా భర్త కూర్చుని మాట్లాడుకుంటే సమస్యలు అవే సమసిపోతాయి. ఆనందమయ జీవితం గడిపేయవచ్చు.

Read: భారత్‌లో కరోనా చికిత్సకు వాడుతున్న 5 బెస్ట్ మెడిసిన్స్ ఇవే!