Bathukamma: ప్రకృతిని అరాధించే వేడుక..బతుకమ్మ పండుగ షురూ..

బతుకమ్మ పండుగ సంబురాలు మొదలయ్యాయి. ప్రకృతి పండుగ బతుకమ్మ వేడుకలకు ఆడబిడ్డలు సిద్ధమైపోయారు. తీరొక్క పూలు..కోటి కాంతులు : ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలకు తెలంగాణ సంబురాలు షురూ అయ్యాయి.

10TV Telugu News

Bathukamma festival 2021 :  ప్రపంచంలో ప్రకృతి ఆరాధించే అరుదైన పండుగ ఏది అంటే ఏమాత్రం సందేహం లేకుండా చెప్పే పండుగ.. బతుకమ్మ పండుగ. బతుకమ్మ అంటే ప్రకృతే. ఆడపిల్లలను ‘బతుకు అమ్మా’అని మనసారా ఆశీర్వదించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. బతుకమ్మనే ‘బొడ్డెమ్మ’ అని కూడా అంటారు. దసరా శరన్నవరాత్రులు అంటే తొమ్మిది రోజులు జరిపే ఈ బతుకమ్మ పండుగను ఒక్కోరోజు ఒక్కో పేరుతో బతుకమ్మ పండుగను జరుపుకుంటారు ఆడబిడ్డలు. అలా మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలైన సద్దుల బతుకమ్మతో ఈ బతుకమ్మ వేడుకలు ముగుస్తాయి. ఈ తొమ్మిది రోజులలో వీరు రోజూ బతుకమ్మలను పువ్వులతో తయారు చేసి.. ప్రతీ సాయంత్రం బతుకమ్మ చుట్టూ తిరుగుతు పాటలు పాడుతు ఆటలు ఆడుతు ఆ తరువాత దగ్గరలో ఉన్న జలాలలో బతుకమ్మను నిమజ్జనం చేస్తారు. అలా ఏడాది కూడా బతుకమ్మ వేడుకలు తెలంగాణలో మొదలయ్యాయి. బుధవారం ‘అక్టోబర్ 6నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబురాలు ప్రారంభం కానున్నాయి.

Read more : బతుకు అమ్మా : తొమ్మిది రోజుల బతుకమ్మ వేడుక

ఈ బతుకమ్మ పండుగ పూలు బాగా వికసించే కాలంలో వస్తుంది. జలవనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో బతుకమ్మ పండుగ వచ్చి, భూమితో, జలంతో, మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకోబడుతుంది. ఈ సంబరాలు జరుపుకునే వారం అంతటా స్త్రీలు ‘బొడ్డెమ్మ‘ను బతుకమ్మతో పాటూ చేసి నిమజ్జనం చేస్తారు.

ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ. తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. అయితే నేటి కాలంలో బతుకమ్మ పండుగ గొప్పతనం ఎల్లలు దాటి దేశ విదేశాల్లో కూడా ఘనంగా సంబరాలు జరుపుకుంటున్నారు.

Read more : ఎంగిలి పూల బతుకమ్మ అంటే తెలుసా?

మంచి వర్షాలతో వరుణ దేవుడు అనుగ్రహించి అన్నపూర్ణమ్మ దయతో వ్యవసాయం అభివృద్ధి చెంది రైతు జీవితం కళకళలాడుతూ ఉండాలని, ఊరంతా పచ్చగా ఉండాలని ఆకాంక్షిస్తూనే యువతులు ముత్తైదువులు రంగు రంగు పువ్వులతో బతుకమ్మను తీర్చిదిద్ది అందులో గౌరమ్మను పెట్టి పూజించి ఊరంతా ఒక్క చోట గుమిగూడి పల్లె ప్రజల జీవితాలను కష్ట సుఖాలను పాటల రూపంలో ప్రకృతి గౌరమ్మకు విన్నవించుకుంటారు. తమ కష్టాలు,సుఖాలు అన్నీ గౌరమ్మకు చెప్పుకుంటారు ఆడబిడ్డలు.

రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్ట సుఖాలు, ప్రేమ, స్నేహం, బంధుత్వం, ఆప్యాయతలు, భక్తి, భయం, చరిత్ర, పురాణాలు మేళవిస్తారు.. ఈ పాటలు చాలా వినసొంపుగా ఉంటాయి.. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక ఈ బతుకమ్మ పండుగ.. తెలంగాణ అస్తిత్వం బతుకమ్మలోనే ఉంది. అందుకే బతుకమ్మ అంటే ప్రకృతి పండుగ. బతుకమ్మ అంటే పూల పండుగు. బతుకమ్మ అంటే మనిషి ప్రకృతితో మమేకం అయ్యే అత్యంత అరుదైన అద్భుతమైన పండుగ బతుకమ్మ పండుగ.

×