Stambheshwar Mahadev : సముద్రజలాల్లో అభిషేక ప్రియుడు…స్తంభేశ్వర్ మహాదేవ్

ఈ ఆలయం గుజరాత్ లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఒడ్డుకు కొంత దూరంలో సముద్రంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది.

Stambheshwar Mahadev : సముద్రజలాల్లో అభిషేక ప్రియుడు…స్తంభేశ్వర్ మహాదేవ్

Stambheshwar

Stambheshwar Mahadev : పరమశివుడంటేనే అభిషేక ప్రియుడు. అలాంటి ఆయనకు సముద్రుడే తన జలాలతో నిత్యం అభిషేకం చేయటమంటే నిజంగా అది మహిమాన్వితమే. అవును ఇది నిజం.. గుజరాత్ లోని వడోదరా సమీపంలోని కవికంబోయి సమీపంలో ఉంది. దీనిని స్తంభేశ్వర ఆలయంగా పిలుస్తారు. ఈ దేవాలయానికి ఎంతో ప్రాచీనమైన చరిత్ర ఉంది. ఇక్కడి శివలింగం పురాతనమైనది. ఆలయ చరిత్రను బట్టి చూస్తే 150 సంవత్సరాల క్రితమే దీనిని నిర్మించినట్లు తెలుస్తుంది. సాదాసీదాగా కనిపించే ఈ ఆలయాన్ని అద్భుతంగా నిర్మించారు.

సముద్రతీరంలో నిర్మించిన అనేక ఆలయాలు కాలక్రమేణా మునిగిపోవడం సహజమే. నీటిమట్టం తగ్గి ఆ ఆలయం బయటపడినప్పుడు భక్తులు వెళ్లి దర్శనం చేసుకోవటాన్ని మనం చూసుంటాం. అయితే అలల తాకిడికి అనుగుణంగా ఆలయం అదృశ్యం అయిపోతూ, అంతలోనే కనిపిస్తూ ఉండే అరుదైన దృశ్యం మాత్రం ఈ కవికంబోయిలోని స్తంభేశ్వర్ మహాదేవ్ ఆలయం విషయంలో చూడవచ్చు. స్కందపురాణంలో ఈ ఆలయం గురించిన ప్రస్తావన ఉంది.

శివుని కుమారుడైన కార్తికేయుడు, తారకాసురుడు అనే రాక్షసుని సంహరించిన విషయం తెలిసిందే! తారకాసురుడు రాక్షసుడే అయినప్పటికీ మహాశివభక్తుడు. అలాంటి శివభక్తుని తన చేతులతో చంపినందుకు కార్తికేయుడు పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. తను చేసిన పనికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలనుకున్నాడు. ఈక్రమంలో కార్తికేయుని బాధను గమనించిన విష్ణుమూర్తి శివభక్తుని పట్ల జరిగిన అపచారం శివపూజతోనే తొలగిపోతుందని సూచించాడు. అప్పుడు కార్తికేయుడు దేవతల శిల్పి అయిన విశ్వకర్మ చేత మూడు శివలింగాలను చెక్కించి వాటిని పూజించాడు. వాటిలో ఒక శివలింగమే స్తంభేశ్వర ఆలయంలోని మూలవిరాట్టుగా పురాణగాధ చెబుతుంది.

ఈ ఆలయం గుజరాత్ లోని వడోదరా నుంచి 50 కిలోమీటర్ల దూరంలోని కవికంబోయి అనే గ్రామంలో ఉంది. అక్కడి అరేబియా సముద్రతీరంలో ఒడ్డుకు కొంత దూరంలో సముద్రంలో ఈ ఆలయం కొలువై ఉంటుంది. సముద్రపు అలలకు అనుగుణంగా ఈ ఆలయం భక్తులకు దర్శనమిస్తుంది. అలలు తక్కువగా ఉన్నప్పుడు ఒకొక్క అంగుళమే ఈ ఆలయం బయటయపడుతుంది. ఆసమయంలో భక్తులు అందులోకి వెళ్ళి స్వామి దర్శనం చేసుకుని వస్తారు. తరువాత కొద్ది సేపటికి నిదానంగా సముద్రంలో మునిగిపోతుంది. ఆలయం బయటకు రావడం దగ్గర్నుంచీ సముద్రగర్భంలోకి వెళ్లిపోవడం వరకూ మొత్తం క్రమాన్ని గమనించేందుకు భక్తులు ఉదయం నుంచీ సాయంత్రం వరకూ తీరం వద్దనే వేచి ఉంటారు. శివపుత్రుడైన కార్తికేయుడు ఇక్కడి శివలింగాన్ని పూజించి సర్వదోషాల నుంచి విముక్తుడైన విధంగానే… ఈ లింగాన్ని దర్శించుకున్నవారు కూడా తెలిసీతెలియక చేసిన తప్పుల నుంచి విముక్తులవుతారని భక్తుల నమ్మకం.

ఒక్కో రోజు ఒక్కో తీరుగా ఆలయం దర్శనమిస్తుంది. సముద్రం మంచి పోటు మీద ఉండే అమవాస్య, పౌర్ణమి రోజులలో శివుని దర్శనం కోసం కాస్త ఎక్కువసేపు వేచి ఉండాల్సి వస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి నిత్యం ఆ సముద్రుడే ఆయనకు అభిషేకించి తరిస్తున్నాడని భావించవచ్చు. ఈ ఆలయం సమీపంలోనే మహీనది అరేబియా సముద్రంలో కలవడం మరో విశేషం. ఆ సంగమ ప్రాంతంలో స్నానాలు చేసి స్తంభేశ్వరుని దర్శించుకునేందుకు వేలాదిమంది భక్తులు తరలివస్తుంటారు.