Tirumala : వసంతమండపంలో ” అరణ్యకాండ పారాయణ దీక్ష ” ప్రారంభం
తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది.

Tirumala : శ్రీవారి అనుగ్రహంతో సృష్టిలోని సకల జీవరాశులు సుభిక్షంగా ఉండాలని, సకల కార్యాలు సిద్ధించాలని కోరుతూ తిరుమల వసంత మండపంలో అరణ్యకాండ పారాయణ దీక్ష శనివారం ప్రారంభమైంది. జూలై 10వ తేదీ వరకు ఈ పారాయణం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తోంది.
ఈ సందర్భంగా ధర్మగిరి వేద విజ్ఞానపీఠం ప్రిన్సిపాల్ శ్రీ కుప్పా శివసుబ్రమణ్య అవధాని మాట్లాడుతూ ప్రపంచ మానవాళి సంక్షేమం కోసం టీటీడీ షోడశదిన సుందరకాండ దీక్ష, అఖండ సుందరకాండ పారాయణం, బాలకాండ, అయోధ్యకాండ, యుద్ధకాండ పారాయణం నిర్వహించినట్లు చెప్పారు. శ్రీమద్రామాయణ పారాయణం ఒక జ్ఞానయజ్ఞమన్నారు. వేదస్వరూపమైన రామాయణ పారాయణం ద్వారా భక్తి, జ్ఞానం, వైరాగ్యం, చిత్తశుద్ధి కలుగుతాయని, వీటి ద్వారా మోక్షం లభిస్తుందన్నారు.

సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలో సంచరించేటప్పుడు పితృవాక్య పరిపాలన, సీతమ్మవారు పతివ్రత ధర్మం, లక్ష్మణ స్వామివారు సోదర ధర్మం వంటి అనేక ధర్మాలను తేలియజేస్తుందని తెలిపారు. రామాయణంలోని అరణ్యకాండ పారాయణం చేసిన, విన్న ప్రతి ఒక్కరికి మోక్షం సిద్ధిస్తుందని చెప్పారు. మొదటి, రెండవ సర్గల్లో పితృ వాక్య పాలనపై శ్రీరామచంద్రమూర్తి అరణ్యంలోకి ప్రవేశిస్తాడని, అక్కడ విరాధుడనే రాక్షసుడు సీతారామ లక్ష్మణుల మీద దాడిచేసేందకు ప్రయత్నిస్తే లక్ష్మణుడు యుద్ధం చేస్తాడని వివరించారు.

ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో ….
మరోవైపు ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో 16 మంది ఉపాసకులు ఉదయం, సాయంత్రం వేళల్లో హోమాలు, జపాలు, హనుమంత, సీతాలక్ష్మణ సమేత శ్రీరాముని మూలమంత్రానుష్టానం జరుపుతున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమాల్లో మొత్తం 32 మంది వేదపండితులు పాల్గొంటున్నార అవధాని వివరించారు. ఈ కార్యక్రమంలో ధర్మగిరి వేద విజ్ఞానపీఠం పండితులు పాల్గొన్నారు.
Also Read : Vijayawada : రేపటి నుంచి విజయవాడ ఇంద్రకీలాద్రిపై పోగాకు నిషేధం