రాములోరి కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే  శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

  • Published By: chvmurthy ,Published On : April 13, 2019 / 12:18 PM IST
రాములోరి కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే  శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.

భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం జరిగే  శ్రీసీతారాముల కల్యాణోత్సావాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు జిల్లా అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వసంతపక్ష ప్రయుక్త శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్14న శ్రీసీతారాముల తిరుకల్యాణోత్సవం, సోమవారం  ఏప్రిల్15న శ్రీరామ పట్టాభిషేకం జరగనున్నాయి. ఆదివారం ఉదయం గం.10-30 నుండి గం.12-30 మధ్య కాలంలో రాముల వారి కళ్యాణం జరగనుంది.  ఈ వేడుకలకు వివిధ రాష్ర్టాల నుంచి భారీ ఎత్తున భక్తులు భద్రాద్రికి తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భద్రాచలంలో అన్ని సౌకర్యాలు ఏర్పాట్లు చేశారు.  ఉత్సవాల్లో భాగంగా గర్భాలయంలో స్వామివారిని శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. ఈ అలంకరణలో సీతారాములు చూడముచ్చటగా దర్శనమిచ్చారు.
Read Also : కొంప, కుటుంబం వద్దా రా : 12 గంటల డ్యూటీ చేసిన చైనా కంపెనీలు

స్వామివారి కల్యాణం నిర్వహించే మిథిలా ప్రాంగణంలో చలువ పందిళ్లు వేసి చాందినీ వస్ర్తాలతో అందంగా అలంకరించారు. భక్తులు స్వామి వారి కల్యాణం వీక్షించే విధంగా సెక్టార్ల వారిగా ఏర్పాట్లు చేశారు. చలువ పందిళ్ల క్రింద కూలర్లు, ఫ్యాన్లను అధికారులు ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల చుట్టూ సైతం చలువ పందిళ్లు నిర్మించారు. రామాలయాన్ని విద్యుదీపాలతో అందంగా అలంకరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్లల్లో స్వాగత ద్వారాలు ఏర్పాటు చేశారు. భక్తుల రాకను దృష్టిలో పెట్టుకొని 2లక్షలకు పైగా లడ్డూ ప్రసాదాలను దేవస్ధానం సిద్దం చేసింది. కళ్యాణాన్ని వీక్షించే భక్తుల కోసం దేవస్థానం ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయించింది. వివిధ ప్రాంతాల్లో టిక్కెట్ కౌంటర్లను ఏర్పాటు చేసి భక్తులకు నేరుగా టిక్కెట్లను కూడా అందచేసింది. 

కళ్యాణం తిలకించేందుకు వచ్చే భక్తులకు ముత్యాల తలంబ్రాలను అందించేందుకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేశారు. సీతారాముల కళ్యాణంలో ప్రత్యేకంగా నిలిచేవి గోటి తలంబ్రాలు. వీటిని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ శ్రీకృష్ణ చైతన్యం సంఘం ఆధ్వర్యంలో ఏటా అందజేశారు. ఆర్‌టీసీ బస్సుల ద్వారా కూడా కళ్యాణ తలంబ్రాలను అందజేసేందుకు దేవస్థానం ఏర్పాట్లను చేసింది. తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా సమీప ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్, ఇతర రాష్ర్టాల నుంచి కూడా భక్తులు వేలసంఖ్యలో స్వామివారి కళ్యాణం తిలకించేందుకు భద్రాద్రి  వస్తారు.  భక్తుల రాకకనుగుణంగా పట్టణంలో తాత్కాలిక వసతి, తాగునీరు, మరుగుదొడ్లను ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌శైనీ, భద్రాచలం సబ్‌కలెక్టర్ భవేష్‌ మిశ్రాలు శ్రీరామనవమి ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. జిల్లా ఎస్‌పీ సునిల్‌దత్ ఆధ్వర్యంలో పోలీస్‌లు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
Read Also : Be Alert : మీ 2G.. PoS మిషన్స్ Upgrade చేయండి