Chinna Jeeyar Swamy : రామానుజ విగ్రహ ఆవిష్కరణకు రావాలని రాష్ట్రపతికి చిన్నజీయర్‌ స్వామి ఆహ్వానం

భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు.

Chinna Jeeyar Swamy : రామానుజ విగ్రహ ఆవిష్కరణకు రావాలని రాష్ట్రపతికి చిన్నజీయర్‌ స్వామి ఆహ్వానం

Chinna Jeeyar Swamy

Chinna Jeeyar Swamy :  ప్రపంచం నలుమూలల నుంచి అన్ని వర్గాల వారు చేతులు కలిపినప్పుడే శ్రీ రామానుజాచార్యుల సమతా భావన సాధ్యమవుతుందన్నారు శ్రీశ్రీశ్రీ తిదండి చిన్నజీయర్‌స్వామి. భగవద్ రామానుజాచార్యుల జయంతి సహస్రాబ్ది వేడుకల సందర్భంగా సమతామూర్తి విగ్రహాన్ని 2022 ఫిబ్రవరిలో ప్రజలకు అంకితం చేయనున్నారు. ఈ సందర్భంగా రామానుజాచార్య సమతామూర్తి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరు కావాలంటూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. ఈ రోజు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రామ్‌నాథ్ కోవింద్‌ను స్వయంగా కలిసి ఆయన ఆహ్వానపత్రం అందించారు. రామానుజాచార్య విగ్రహ విశేషాలను.. ఏర్పాటు చేయడానికి గల కారణాలను రాష్ట్రపతికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీజీ.

శంషాబాద్‌ ముచ్చింతల్‌లోని దివ్యసాకేత ఆశ్రమంలో అతిపెద్ద సమతామూర్తి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కూర్చుని ఉన్న విగ్రహ రూపాల్లో ప్రపంచంలోనే ఇది రెండో అతి పెద్దది. 200 ఎకరాల్లో వేయి కోట్లతో ఈ రామానుజ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు. స్టాట్చ్యూ ఆఫ్‌ ఈక్వాలిటీగా ఏర్పాటు చేస్తోన్న 216 అడుగుల పంచలోహ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి 2022 ఫిబ్రవరి 2నుంచి 14 వరకు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా 1,035 హోమ గుండాలతో ప్రత్యేక యాగం నిర్వహించనున్నారు. దీని కోసం 2 లక్షల కిలోల ఆవు నెయ్యి వినియోగించనున్నారు. చిన్నజీయర్ స్వామీజీతో పాటు మై హోం గ్రూప్ అధినేత డాక్టర్ జూపల్లి రామేశ్వరరావు, మైహోం గ్రూప్ సంస్థల డైరెక్టర్ జూపల్లి రంజిత్‌రావు రాష్ట్రపతితో భేటీ అయ్యారు.

Read Also : TTD SVBC : ఎస్వీబీసీ కన్నడ, హిందీ ఛానల్స్ కు కేంద్రం అనుమతి
శంషాబాద్ ముచ్చింతల్‌లోని ఆశ్రమంలో జరిగే రామానుజ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడును కూడా ఆహ్వానించారు శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి. రాష్ట్రపతిని కలిసిన అనంతరం… నేరుగా ఉప రాష్ట్రపతి దగ్గరకు వెళ్లి ఆహ్వాన పత్రం అందించారు. కుల,మత,వర్గ, ఆర్థిక కారణాలతో సమాజం విచ్ఛిన్నమవుతున్న సమయంలో అందర్నీ ఏకం చేసేందుకే సమతామూర్తిని ఏర్పాటు చేసినట్లు వెంకయ్యనాయుడికి వివరించారు చిన్నజీయర్‌ స్వామీ.

సమాజంలో అంటరానితనాన్ని, వివక్షను రూపుమాపి సమానత్వ సాధన కోసం కృషిచేసిన భగవత్‌ రామానుజాచార్యులు సామాజిక సంస్కరణాభిలాషిగా చెరగని ముద్ర వేశారన్నారు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు. భగవంతుడు అందరివాడు అంటూ వారు చూపిన మార్గం అందరికీ ఆచరణీయం అన్నారు. సామాజిక చైతన్య ప్రభోదకులైన రామానుజుల వారి అతిపెద్ద ప్రతిమను ఏర్పాటు చేయడం ద్వారా వారి బోధనలు, సందేశం ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉంటుందని ఆకాంక్షించారు ఉపరాష్ట్రపతి.

ప్రపంచం వివక్ష, కుల, మత, లింగ, ఆర్థికపరమైన అసనమాతలవైపు వెళుతున్న సమయంలో సమతా భావన పెంపొందాల్సిన అవసరం ఉందన్నారు శ్రీశ్రీశ్రీ తిదండి చిన్నజీయర్ స్వామి. తీవ్రవాదం ద్వారా పైచేయి సాధించాలన్న భావన ఇటీవల పెరిగిపోయిందన్నారు. ఇలాంటి సమయంలో సమతామూర్తి విగ్రహం ద్వారా సమ భావనను అందరిలోకి తీసుకెళ్లగలిగితే వివక్ష, అసమానతలకు సరైన పరిష్కారం దొరుకుతుందన్నారు.
ప్రతి ఒక్కరిలో సమతా భావనను రగిలిస్తే రాబోయే తరాలు సమాజంలో సమభావన ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోగలుగుతాయన్నారు చిన్నజీయర్ స్వామి. 1017వ సంవత్సరంలో జన్మించిన రామానుజాచార్య.. 120 ఏళ్లపాటు జీవించారు. భారతదేశమంతటా పర్యటించారు. విశ్వమంతా ఒకే కుటుంబంలా ఉండాలంటూ ప్రభోదించారు.