కార్తీక సోమవారం శోభ : భక్తులతో శైవ క్షేత్రాలు కళకళ

  • Published By: sreehari ,Published On : November 30, 2020 / 06:42 AM IST
కార్తీక సోమవారం శోభ : భక్తులతో శైవ క్షేత్రాలు కళకళ

Devotees rush to Shiva temples Karthika Somavaram : కార్తీకమాసం మూడో సోమవారం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలన్నీ కళకళలాడుతున్నాయి. శివాలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే మహిళలు పుణ్యస్నానాలు ఆచరించి శివుడిని దర్శనం చేసుకుంటున్నారు. దీంతో శైవక్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మార్మోగుతున్నాయి.




కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. అభిషేకాలు చేస్తున్నారు. ఆలయాల ముందు కార్తీక దీపాలు వెలిగించి తమకు ఏ ఆపద రాకుండా చూడాలని ప్రార్థిస్తున్నారు. కార్తీక మూడో సోమవారం సందర్భంగా వేములవాడ రాజన్న ఆలయం కళకళలాడుతోంది. భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
https://10tv.in/no-use-of-such-units-union-minister-nitin-gadkari-on-caste-based-cells-in-political-parties/
స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. దీంతో మహిళలు తెల్లవారుజాము నుంచే పోటెత్తారు. శివుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు హరిహర నామస్మరణతో మార్మోగుతున్నాయి.

పంచారామ క్షేత్రాలైన భీమవరం సోమేశ్వరాలయం, పాలకొల్లు క్షీరా రామలింగేశ్వర ఆలయం, పట్టిసీమ భద్రకాళి ఆలయం, ద్వారకాతిరుమల ఆలయం భక్తులతో కళకళలాడుతున్నాయి. శివాలయాల్లో భక్తులు పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఆచంట రామేశ్వరాలయంలో కార్తీ పూర్ణిమ అఖండ జ్యోతి దీపోత్సవం ఘనంగా నిర్వహించారు.




కార్తీక పూర్ణిమ ప్రతి సంవత్సరం ఉపవాస దీక్షతో ఆచార సంప్రదాయంగా వస్తున్న కర్పూర అఖండ జ్యోతిని వెలిగించారు గుడవర్తి వంశస్తులు. కర్పూర అఖండ జ్యోతిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తి శ్రద్ధలతో దీపాలు వెలిగించి పూజలు నిర్వహించి.. మొక్కులు చెల్లించుకున్నారు.

ద్వారకా తిరుమలలో కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాలకు భక్తుల పోటెత్తారు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. మహిళలు అత్యంత భక్తి శ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించారు. విశాఖలోనూ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. తెల్లవారుజాము నుంచే భక్తుల సందడి నెలకొంది. పుణ్యస్నానాలు ఆచరించి… కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. ముక్కోటికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తున్నారు.