Japali Teertham : సూర్యున్ని మింగేందుకు హనుమాన్ ఎగిరిందీ అక్కడే!

టీటీడీ ప్రకటించడానికి ముందే.. తిరుమలతో ఆంజనేయుడి అనుబంధానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కనిపించాయ్. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడీ ఆంజనేయస్వామి.. కూతవేటు దూరంలో ఉండే జాపాలీ తీర్థం..

Japali Teertham : సూర్యున్ని మింగేందుకు హనుమాన్ ఎగిరిందీ అక్కడే!

Japali Teertham As Hanuman Birthplace In Tirumala

Japali Teertham as Hanuman Birthplace : టీటీడీ ప్రకటించడానికి ముందే.. తిరుమలతో ఆంజనేయుడి అనుబంధానికి సంబంధించి ఎన్నో ఆధారాలు కనిపించాయ్. శ్రీవారి ఆలయం ఎదురుగా ఉండే బేడీ ఆంజనేయస్వామి.. కూతవేటు దూరంలో ఉండే జాపాలీ తీర్థం.. మారుతి మనోడే అని చెప్పకేనే చెప్పాయ్. ఈ రెండు ప్రదేశాలు పురాణాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయ్. ఆంజనేయుడి జన్మస్థానంపై ఏంటన్న ఇన్నాళ్లుగా జరిగిన చర్చ అంతా ఇంతా కాదు. తిరుమల గిరుల్లోనే హనుమాన్ జన్మించాడని.. మారుతి మనోడే అని ఆధారాలతో సహా నిరూపించింది టీటీడీ.

ఇకపై జాపాలీ తీర్థాన్నే హనుమంతుడి జన్మస్థలంగా పరిగణించనున్నారు. తెలిసిందే అయినా.. హనుమాన్ జన్మస్థలం గురించి తెలిశాక మరోసారి అక్కడికి వెళ్లాలన్న ఉత్సాహం ఇప్పుడు భక్తుల్లో కనిపిస్తోంది. కలియుగంలో శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన ఆ ఏడు కొండలే.. అసలైన మారుతీ జన్మ స్థలమని మొదటి నుంచి చెప్తూ వస్తున్న టీటీడీ.. ఇప్పుడు దాన్ని నిరూపించింది. దీంతో ఇప్పుడు తిరుమల గిరులతో హనుమంతుడి అనుబంధంపై తెలుసుకోవాలన్న కోరిక చాలామందిలో పెరిగింది.

త్రేతాయుగంలో బాల హనుమ..
తిరుమలలో శ్రీవారి సన్నిధికి తూర్పు మాడ వీధిలో మహద్వారానికి, అఖిలాండానికి ఎదురుగా బేడీ ఆంజనేయస్వామి దేవాలయం ఉంటుంది. రెండు చేతులు అంజలి ఘటించి వేంకటేశ్వరస్వామి వారికి నమస్కరిస్తూ మారుతి నిలబడి ఉంటాడు. త్రేతాయుగంలో రామబద్రునికి సేవ చేసిన హనుమంతుడు.., కలియుగంలో వెంకటేశ్వరుడే రాముడిగా భావించి కనులార స్వామి వారిని వీక్షిస్తూ.. స్వామి వారికి సేవ చేస్తున్నాడు. భగవంతునికి భక్తుడు ఏప్పుడు ఒక మెట్టు పైనే అనే మాటకు నిదర్శనంగా వెంకన్న ఆలయానికంటే హనుమ ఆలయం ఎత్తులో ఉంటుంది. ఇక త్రేతాయుగంలో బాల హనుమ.. ఒంటెను వెతుకుతూ అంజనాద్రి పర్వతాన్ని వీడేంత పనిచేసాడట. అందుకోసమే ఆ అంజనాదేవి ఆంజనేయుని కాళ్ళకు, చేతులకు సంకెళ్ళు వేసిందట. కలియుగం ప్రారంభం నుంచి.. వరాహ స్వామి, శ్రీవారికి నైవేద్యం సమర్పణ తర్వాత బేడి ఆంజనేయ స్వామి వారికీ నైవేద్య సమర్పణ జరుగుతోందని స్థల పురాణం చెబుతోంది.

ఏడుకొండల్లో ఓ కొండ పేరు అంజనాద్రి :
ఏడుకొండల్లో ఓ కొండ హనుమంతుడి మాతృమూర్తి పేర అంజనాద్రిగా వర్థిల్లుతోంది. అంజనా దేవి తపస్సు చేసిన దివ్యస్థలమే అంజనాద్రి. ఆ పుణ్యమూర్తి గర్భాన హనుమ జన్మించిన ప్రదేశమే జాపాలి తీర్థం ఉన్న ప్రదేశం. రావణ సంహారం తర్వాత సీతా సమేతంగా అయోధ్యకు వెళ్లే ముందు శ్రీరాముడు జాపాలి తీర్థంలో కొంతకాలం విడిది చేసినట్టు మరో కథనం. ఆ సమయంలో శ్రీరామచంద్రుడు స్నానం చేసిన తీర్థానికి శ్రీరామ తీర్థమనీ, సీతాదేవి జలకమాడిన తీర్థానికి సీతా తీర్థమనీ పేర్లు వచ్చాయ్. ఇవి ఆలయానికి తూర్పున ఒకటి, పడమర ఒకటీ ఉన్నాయి. జాపాలి ప్రాంతంలో హనుమ జన్మస్థలానికి ప్రతీకగా ఆలయం నిర్మించారు. పూర్వం జాపాలి అనే మహర్షి తన శిష్యులతో కలసి శ్రీ వేంకటేశ్వరునికి సేవలు చేసేవార‌ట.

శ్రీనివాసునికై జాపాలి మహర్షి జపం ఆచరించి, ప్రసన్నం చేసుకోవడంతో ఈ తీర్థానికి జాపాలి అనే పేరు వచ్చింది. 15వ శతాబ్దంలో విజయ రాఘవ రాయులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు శాసనాలు చెబుతున్నాయి. తిరుమల క్షేత్రం మహంతుల పాలనలోకి వెళ్లిన తర్వాత జాపాలి తీర్థాన్ని అభివృద్ధి చేశారు. ఇప్పటికీ జాపాలి తీర్థం మహంతుల పాలనలోనే ఉన్నాయ్. టీటీడీలో ఎంతో మంది ఈవోలుగా సేవ‌లందించారు. అయితే ఎవ‌రి ప్ర‌త్యేక వారిది. జ‌వ‌హ‌ర్‌రెడ్డి ఈవోగా బాధ్య‌త‌లు తీసుకున్న త‌ర్వాత శ్రీ‌వారి ప‌ర‌మ భ‌క్తుడు, సేవ‌కుడైన హ‌నుమంతుని జ‌న్మ ర‌హ‌స్యాన్ని ఛేదించే మ‌హ‌త్త‌ర కార్యానికి శ్రీ‌కారం చుట్టారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలే అని ప్రకటించడంతో… జాపాలి తీర్థాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు టీటీడీ ప్రణాళికల రచిస్తోంది.