Kashi Temple : కాశీ విశ్వేశ్వరుడికి ‘మిల్లెట్స్’ లడ్డు .. ‘శ్రీ అన్న’ప్రసాదంగా పేరు

కాశీ విశ్వేశ్వరుడికి ‘మిల్లెట్స్’ లడ్డు.. ఈ ప్రసాదానికి ‘శ్రీ అన్న’ప్రసాదంగా పేరు పెట్టారు.

Kashi Temple : ఇక నుంచి కాశీ విశ్వేశ్వరుడికి ప్రసాదంగా ‘మిల్లెట్స్ ’ (చిరుధాన్యాలు) లడ్డు ప్రసాదం కానుంది. దీనికి ‘శ్రీ అన్న’ప్రసాదంగా పేరు పెట్టరు. ఈ శ్రీ అన్న ప్రసాదాన్ని మిల్లెట్లు, బెల్లం, నువ్వులు, జీడిపప్పు, బాదం, నెయ్యి, ‘ఖోయా’లతో తయారు చేయనున్నారు. మోడీ ప్రభుత్వం దేశంలో చిరుధాన్యాల (మిల్లెట్స్‌) ఉత్పత్తులను ప్రోత్సహించే భాగంలో ప్రధాని మోడీ నియోజకవర్గమైన వారణాసిలో కొలువైన శ్రీ కాశీ విశ్వనాథ దేవాలయంలో మిల్లెట్‌లతో చేసిన లడ్డూ ప్రసాదాన్ని పంపిణీ చేయనున్నారు.

ఈ లడ్డూలను మినుములు, నువ్వులు, బెల్లం, దేశీ నెయ్యి,డ్రై ఫ్రూట్స్‌తో తయారుచేయనున్నామని ఆలయ చీఫ్‌ డెవలప్‌మెంట్‌ అధికారి హిమాన్షు తెలిపారు. ఈ లడ్డూల తయారీ బాధ్యతను మహిళా స్వయం సహాయక సంఘాలకు అప్పగించారు. ప్రసాదం తయారీలో సంపూర్ణ స్వచ్ఛతను నిర్ధారిస్తామని తెలిపారు. సిద్దం చేసే లడ్డూలపై “ఇయర్ ఆఫ్ మిల్లెట్స్ 2023” లోగో కూడా ఉంటుందని..లడ్డూల పంపిణీ కోసం ఆలయ ప్రాంగణంలో కౌంటర్‌ను కూడా ఏర్పాటు చేశాం అని లడ్డూల తయారు చేసే మహిళా సంఘం అధ్యక్షురాలు సునీతా జైస్వాల్ తెలిపారు.

ఇప్పటివరకు ప్రసాదం తయారు చేస్తున్న నేషనల్‌ రూరల్‌ లైవ్‌లీహుడ్‌ మిషన్‌ వారే శ్రీ అన్న ప్రసాదాన్ని కూడా అందజేయనున్నారు. బరువులో కానీ, ధరలో కానీ తేడా ఉండదని, అలాగే పూర్తి శుభ్రత, నాణ్యతతో తృణ ధాన్యాలు, జీడిపప్పు, స్వచ్భమైన నెయ్యి, బెల్లం తదితరాలతో ఈ ప్రసాదాన్ని తయారు చేయనున్నామని హిమాన్షు తెలిపారు. ప్రసాదం ధరలో ఎటువంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.

కాగా ఐక్యరాజ్యసమితి ఈ సంవత్సరాన్ని మిల్లెట్స్ సంవత్సరంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశంలో ఎప్పటి నుంచో మిల్లెట్స్ ను ఆహారంలో భాగంగా తీసుకుంటున్నారు. ఇవి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. శరీరంలో ఉండే చెడు కొలస్ట్రాల్ ను కరిగించటంతో చిరుధాన్యాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని ఆహార నిపుణులు సైతం చెబుతున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు