శంభో శంకర….వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు

  • Published By: chvmurthy ,Published On : February 21, 2020 / 01:17 AM IST
శంభో శంకర….వైభవంగా ప్రారంభమైన మహాశివరాత్రి వేడుకలు

తెలుగు రాష్ట్రాల్లో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ తెల్లవారు ఝూము నుంచే శివ నామ స్మరణతో శైవక్షేత్రాలు మారుమోగుతున్నాయి. పలు ప్రధాన దేవాలయాల్లో పరమ శివుడి దర్శనం కోసం భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. ప్రధాన శైవక్షేత్రాలైన శ్రీశైలం,వేములవాడల్లో భక్తులు అర్ధరాత్రి నుంచి క్యూలైన్లలో వేచి ఉన్నారు.

శ్రీశైలంలోని స్వయంభుగా వెలిసిన మల్లికార్జునస్వామి-శ్రీభమరాంబదేవి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీశైలంలో ఈ రోజు సాయంత్రం స్వామివార్లకు ప్రభోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి 10 గంటల నుంచి పాగాలంకరణ, లిగోద్భవకాల మహాన్యాస రుద్రాభిషేకం జరగనుంది. రాత్రి 12 గంటలకు శ్రీభమరాంబదేవీ-మల్లికార్జునస్వామి వార్ల బ్రహోత్సవ కల్యాణం నిర్వహిస్తారు.

వరంగల్‌లోని చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఈ వైభవంగా ప్రారంభమయ్యాయి. ప్రభుత్వ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వర్తించి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వినయ్‌భాస్కర్‌ మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా ఈ మహాశివరాత్రి వేడుకలను ప్రజలు భక్తి శ్రధ్దలతో మహావైభవంగా నిర్వహిస్తారని… కాకతీయులు శైవ సంప్రదాయం పాటిస్తూ తెలంగాణ, ఆంధ్రా ప్రాంతం వరకు అనేక శైవక్షేత్రాలు నిర్మించారన్నారు.

వరంగల్‌ నగరం నుంచే కాకుండా చుట్టుపక్కల జిల్లాల నుంచి స్వామివారిని దర్శించుకోవడానికి వస్తుంటారని, రుద్రేశ్వరుడి కృపతో ఎంతో మంది ఉన్నతస్థాయికి చేరుకుంటారన్నారు. ధార్మిక భావనతోనే మానసిక ప్రశాంతత చేకూరుతుందన్నారు. ఆలయ ప్రధానార్చకులు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ అర్ధనారీశ్వరువై పరమశివునికి ప్రీతికరమైన శుక్రవారం మహాశివరాత్రి రావడం విశేషమన్నారు. శుక్రవారం రోజున మహాలక్ష్మీ ఉద్భవించిన మారేడు దళములతో అభిషేకాలు నిర్వహించడం వలన ఈశ్వరకటాక్షం లభిస్తుందన్నారు.

ఇక దక్షిణకాశీగా పేరొందిన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వర దేవాలయం భక్తులతో కిటకిటలాడుతోంది. తెల్లవారుజాము నుంచే ఆలయంలో ప్రత్యేక పూజలు కొనసాగుతున్నాయి. శివరాత్రి నేపథ్యంలో అధికారులు ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులకు మహాలఘు దర్శనం కల్పిస్తున్నారు. ఉదయం 7 గంటలకు టీటీడీ తరఫున రాజరాజేశ్వరస్వామివారికి అధికారులు పట్టువస్త్రాలు సమర్పించనున్నారు. 8 గంటలకు ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. సాయంత్రం 4 గంటలకు శివదీక్ష పరులకు అధికారులు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశారు. సాయంత్రం 6 గంటలకు స్వామివారి కల్యాణ మండపంలో మహాలింగార్చన నిర్వహించనున్నారు. రాత్రి 11.30 గంటలకు గర్భగుడిలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు.

అలంపూరు క్షేత్రంలోనూ మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లా కలెక్టర్‌ శ్రుతి ఓఝా చేతుల మీదుగా నిన్న వైభవంగా ప్రారంభమయ్యాయి. అష్టాదశ శక్తి పీఠాల్లో ఐదో శక్తి పీఠమైన జోగుళాంబ బాలబ్రహ్మేశ్వరస్వామి ఆలయాల్లో మహాశివరాత్రి మహోత్సవాలు శాస్రోక్తంగా, సాంప్రదాయ పద్ధతిలో అర్చకులు ప్రారంభించారు. ఉదయం 7:30 గంటలకు యాగశాల ప్రవేశం, గణపతి పూజ, పుణ్యాహవచనం, ఋత్విక్‌ వరణము, అఖండ దీపస్థాపన, మహాకలశ స్థాపన, రుద్ర హోమా మొదలగు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.

నిన్న సాయంత్రం 4 గంటలకు నుంచి మృత్‌ సంగ్రహణం లో భాగంగా మట్టిలో నవధాన్యాలను ఉంచి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ఆలయలంలో అంకురార్పణ, భేరి పూజ, బలిహరణ, నిర్వహించారు. రాష్ట్రం సకల సంపదలతో విరాజిల్లాలని, ఎల్లప్పుడు సుభిక్షంగా ఉండాలనే ఆకాంక్షతో అర్చకులు ఆలయంలో ప్రత్యేక పాత్రలో నవ ధాన్యాలను మొలకెత్తించారు. ముందుగా గోవత్స సహిత ప్రదక్షిణ గావించారు. సర్వతో బద్ర మండలి వద్ద కంకణ ధారణ చేపట్టారు. ఆగమ సాంప్రదాయంతో అర్చకులు శాస్త్ర పద్ధతిలో ఉత్సవాలను కొనసాగించారు. సాయంత్రం సంధ్యా సమయంలో ధ్వజారోహణం నిర్వహించారు.