ముక్కోటి ఏకాదశి-భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు

ముక్కోటి ఏకాదశి-భక్తులతో కిటకిటలాడుతున్న వైష్ణవ ఆలయాలు

Mukkoti ekadasi festival  : తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాల్లో ముక్కోటి ఏకాదశి వేడుకలు తెల్లవారుఝూమునుంచే వైభవంగా ప్రారంభమయ్యాయి. చలిని సైతం లెక్కచేయకుండా భక్తలు వైష్ణవ ఆలయాల వద్ద బారులుతీరారు.

తిరుమలేశుని తొలి గడప కడపలో
తిరుమలేశుని తొలి గడప దేవుని కడప ఆలయానికి వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. శ్రీలక్ష్మీవెంకటేశ్వర స్వామి ఆలయానికి వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచి శ్రీవారి దర్శనం చేసుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. శ్రీవారిని దర్శించుకునేందుకు కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. వైకుంఠ ద్వారం వద్ద భక్తులకు గరుడ వాహనంపై దర్శనం ఇచ్చారు శ్రీవారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ అన్బురాజన్ ఆదేశాల మేరకు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. వైకుంఠ ఏకాదశి రోజున వైకుంఠ ద్వారం మీదుగా శ్రీవారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగి శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు వివరించారు.

భద్రాద్రి రామయ్య సన్నిధిలో
భద్రాద్రి రామాలయం వైకుంఠ ఏకాదశి శోభ సంతరించుకుంది. సీతారమ చంద్ర స్వామి వారు ముక్కోటి ద్వారం గుండా దర్శనమిస్తున్నారు. ఆలయ అధికారులు వివిఐపిలకు మాత్రమే పాస్‌లు మంజూరు చేస్తున్నారు. ఉత్తర ద్వార దర్శనం వైపు భక్తులు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు అధికారులు.

ఒంగోలులో
ఒంగోలులో ముక్కోటి పర్వదిన వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తెల్లవారు జామునే దేవాలయాలకు చేరుకున్న భక్తులు ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటున్నారు. ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవస్వామి దేవాలయంలో ముక్కోటి పర్వదినం ఈ సందర్భంగా ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ సిబ్బంది అన్ని చర్యలు చేపట్టారు. ఉత్తరాయణంలో వచ్చే ద్వాదశిని ముక్కోటి ఏకాదశి అని … ఇదే సమయమున ఉత్తరద్వారం గుండా స్వామి వారిని దర్శిస్తే సకల భోగాలు లభిస్తాయని భక్తులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.. ఉత్తరద్వారం గుండా స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని తెలిపారు

ముక్కొటి ఏకాదశి ని పురస్కరించుకొని విజయవాడలోని ప్రముఖ వైష్ణవ ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వేకువజామునుంచే క్యూలైన్లలో స్వామి వారి ఉత్తర ద్వార దర్శనం కోసం బారులు తీరారు. నగరంలోని  లబ్బీపేట వెంకటేశ్వరస్వామి, జిల్లాలోని ముఖ్య ఆలయాల్లో ఉత్తర ద్వారం గుండా స్వామి వార్లను దర్శించుకొని భక్తజనం తరిస్తున్నారు.