Tirumala Temple Drone Visuals : తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ల వివాదంలో ట్విస్ట్.. డ్రోన్లు ఎగిరింది నిజమే

తిరుమల శ్రీవారి ఆలయంపైన డ్రోన్ల వివాదం మలుపు తిరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు తేలింది.

Tirumala Temple Drone Visuals : తిరుమల శ్రీవారి ఆలయంపై డ్రోన్ల వివాదంలో ట్విస్ట్.. డ్రోన్లు ఎగిరింది నిజమే

Tirumala Temple Drone Visuals : తిరుమల శ్రీవారి ఆలయంపైన డ్రోన్ల వివాదం మలుపు తిరిగింది. శ్రీవారి ఆలయంపై డ్రోన్లు ఎగిరినట్లు స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. డ్రోన్లతోనే తిరుమల శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లు తేలింది. ఆస్థాన మండపం సమీపంలోని రోడ్డు పైనుంచి డ్రోన్లను ఎగురవేసినట్లు గుర్తించారు. డ్రోన్ లు ఎగురుతున్న దృశ్యాలను స్థానికులు చిత్రీకరించారు. కాకుల కోన వద్ద సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలు తీసేందుకు డ్రోన్ ఆపరేటర్ వచ్చినట్లు తెలుస్తోంది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ వీడియోలను చిత్రీకరించేందుకు గతేడాది టీటీడీ అనుమతి ఇచ్చింది. ఆ సమయంలోనే డ్రోన్ ఆపరేటర్.. శ్రీవారి ఆలయ దృశ్యాలను చిత్రీకరించినట్లు చెబుతున్నారు.

డ్రోన్ ద్వారానే శ్రీవారి ఆలయం దృశ్యాలు చిత్రీకరించినట్లు టీటీడీ గుర్తించింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ స్టడీ కోసం బృందం వచ్చింది. ఆ బృందం డ్రోన్లతో వీడియోలు తీసినట్లు టీటీడీ గుర్తించింది. కాకుల కొండకి సమీపంలోనే వేస్ట్ మేనేజ్ మెంట్ ప్లాంట్ ఉంటుంది. వేస్ట్ మేనేజ్ మెంట్ ను డ్రోన్లతో షూట్ చేయడానికి గతంలో టీటీడీ అనుమతి ఇచ్చింది. దాంతో పాటే వారు శ్రీవారి ఆలయం పరిసరాలను కూడా డ్రోన్లతో షూట్ చేసినట్లు గుర్తించారు. తొలుత.. డ్రోన్లతో చిత్రీకరించారా? లేక గూగుల్ నుంచి సేకరించారా? అన్నది తెలుసుకోవడానికి వీడియోలను ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపి నిర్ధారణ చేసుకుంటాము, ఆ తర్వాత కేసులు పెడతామని టీటీడీ విజిలెన్స్ విభాగం చెప్పడం జరిగింది. అలా చెప్పిన 24 గంటల్లోపే.. దీన్ని టీటీడీ గుర్తించగలిగింది.

Also Read..Tirumala: తిరుమలలో డ్రోన్ దృశ్యాలపై స్పందించిన టీటీడీ ఛైర్మన్ సుబ్బారెడ్డి.. ఏమన్నారంటే?

డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయం పరిసరాలను వీడియో తీసినట్లు తెలుసుకుంది. అయితే, దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు అనేది గోప్యంగా ఉంచారు అధికారులు. ఎందుకంటే, డ్రోన్లతో చిత్రీకరించేందుకు టీటీడీనే అనుమతి ఇచ్చింది. దీంతోనే ఈ వ్యవహారం చోటు చేసుకుంది. గతంలో ఘాట్ రోడ్ లో కూడా డ్రోన్ కెమెరాతో చిత్రీకరణకు టీటీడీ అనుమతి ఇవ్వడం జరిగింది. ఘాట్ రోడ్ లో కొండచరియలు విరిగిపడినప్పుడు డ్రోన్లకు అనుమతి ఇచ్చారు. అదే తరహాలో సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ స్టడీ కోసం డ్రోన్ కెమెరాలతో విజువల్స్ తీసుకోవడానికి పర్మిషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కొలువైన తిరుమలలో డ్రోన్లు ఎగరడం, శ్రీవారి ఆలయం దృశ్యాలను డ్రోన్లలో చిత్రీకరించడం, ఆ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడం కలకలం రేపాయి. ఆగమశాస్త్రం ప్రకారం.. శ్రీవారి ఆలయంపై ఎలాంటి వస్తువులు ఎగరడానికి వీలులేదు. అంతేకాదు తిరుమలలో డ్రోన్ల వినియోగంపై నిషేధం కూడా ఉంది. అయితే, ఏకంగా డ్రోన్ కెమెరాలతో శ్రీవారి ఆలయ దృశ్యాలు చిత్రీకరించినట్లుగా ఉన్న వీడియోలు వెలుగులోకి రావడం చర్చనీయాంశంగా మారింది. వెంకన్న ఆలయానికి సంబంధించిన డ్రోన్ షాట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇన్ స్టాగ్రామ్ పేజీ ఐకాన్ అనే అకౌంట్ నుండి ఈ వీడియో అప్ లోడ్ అయింది.

Also Read..Drone Cameras In Tirumala : తిరుమలలో డ్రోన్ కెమెరాల కలకలం.. సోషల్ మీడియాలో శ్రీవారి ఆలయ వీడియోలు వైరల్

అలిపిరి మొదలుకుని శ్రీవారి ఆలయం, తిరుమలలోని ఇతర పరిసరాలన్నీ కూడా హై సెక్యూరిటీ జోన్‌లో ఉంటాయి. ఎక్కడికక్కడ సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సెక్యూరిటీ 24 గంటలూ ఉంటుంది. ఇంత సెక్యూరిటీ ఉన్నా.. ఒక డ్రోన్ కెమెరా సాక్ష్యాత్తు శ్రీవారి ఆలయం ఎదురుగా.. ఆస్తాన మండపం ప్రాంతం నుండి శ్రీవారి ఆలయం పరిసరాలు మొత్తం షూట్ చేసినట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాల్లో ఉంది. దీంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తిరుమలలో డ్రోన్‌ కెమెరాలు ఎలా వాడతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు శ్రీవారి ఆలయంపై డ్రోన్ కెమెరాలు ఎగరేసినా విజిలెన్స్ యంత్రాంగం గుర్తించకపోవడం దారుణం అని మండిపడుతున్నారు. ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమే అంటున్నారు. నిందితులపై చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఈ వ్యవహారం దుమారం రేపడంతో తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పటిష్ట భద్రత ఉన్న ఆలయంపై డ్రోన్‌తో చిత్రీకరించేందుకు అవకాశం లేదని ఆయన తెలిపారు. డ్రోన్ కెమెరాతో చిత్రీకరించిన ఇన్‌స్టాగ్రామ్ రీల్ హైదరాబాద్‌కు చెందిన సంస్థ సోషల్ మీడియాలో ప్రసారం చేసినట్లుగా గుర్తించామని, సదరు సంస్థపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని అన్నారు. నిజంగా అవి డ్రోన్ చిత్రాలా? పాత చిత్రాలతో యానిమేట్ చేశారా? అనే కోణంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు టీటీడీ చైర్మన్ తెలిపారు. తిరుమలలో పటిష్ఠ భద్రత ఉందని, డ్రోన్ చిత్రాలపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భక్తులకు విజ్ఞప్తి చేశారు వైవీ సుబ్బారెడ్డి.