ఉండ్రాళ్లు పెట్టకపోతే.. గణేష్ కోప్పడతాడు!

  • Published By: veegamteam ,Published On : August 27, 2019 / 09:57 AM IST
ఉండ్రాళ్లు పెట్టకపోతే.. గణేష్ కోప్పడతాడు!

వినాయక చవితి అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఉండ్రాళ్లు. గణపయ్య నైవేద్యంలో ప్రధానమైనవి ఇవే. వీటినే కుడుములు అని అంటారు. బియ్యం రవ్వతో చేసే ఉండ్రాళ్లు అందేనండీ కుడుములు అంటే వినాయకుడికి చాలా ఇష్టం. వీటి తరువాతే  ఏవైనా. నూనె వాడకుండా చేసే పిండివంటలు వినాయక చవితి పండుగలో ప్రత్యేకత. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఏమున్నా లేకపోయినా ఉండ్రాళ్లు, జిల్లేడు కాయలు, పాలతాలికలు తప్పనిసరి. ఉండ్రాళ్లు, జిల్లేడు కాయలు, పాలతాలికలను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం… 

ఉండ్రాళ్లు (కుడుములు) :
కావలసిన పదార్థాలు: 
బియ్యపు రవ్వ: 1 కప్పు, నీళ్ళు- 1 -1/2 కప్పులు,  శెనగపప్పు: 1/2 కప్పు జీలకర్ర- 1 టీస్పూన్, సాల్ట్ -సరిపడా
నూనె కొద్దిగా (బియ్యం పిండి ఉండలు కట్టకుండా ఉండేందుకు మాత్రమే) 

తయారు చేసే పద్దతి :
ముందుగా మందపాటి గిన్నెలో నీరు పోసి సరిపడా ఉప్పు వేసుకోవాలి. నీళ్లు బాగా మరిగాక శెనగపప్పు వేయాలి. ఆ తర్వాత బియ్యం రవ్వ వేసి ఉండలు కట్టకుండా కలపాలి. జీలకర్ర వేసుకోవాలి. మంట చిన్నగా పెట్టి బియ్యం రవ్వ మెత్తగా మగ్గాక దించేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్లెంలో వేసి (కొద్దిగా నెయ్యి లేదా నూనె వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది)  చల్లారబెట్టుకుని కుడుముల్లా చేసుకోవాలి. ఆ తర్వాత ఇడ్లీ పాత్ర పొయ్యిమీద పెట్టి కొద్దిగా నీరు పోసి ఈ ఉండాళ్లను వాటిపై పేర్చి.. మూత పెట్టాలి. కొంచెం సేపు ఆవిరిపై ఉడికించాలి. అంతే.. వినాయకుడికి ఇష్టమైన ఉండ్రాళ్లు రెడీ.. 

ఈ ఉండ్రాళ్లలో రవ్వ ఉడికించేటప్పుడు  ఇష్టమైతే..కొబ్బరి కూడా వేసుకోవచ్చు. అలాగే ఉండ్రాళ్లు  చేసుకునేటప్పుడు కుడుముల మధ్యలో చిన్న బెల్లం ముక్క పెట్టుకుంటే బెల్లం పెట్టకుంటే ఆ వేడికి బెల్లం కరిగి ఉండ్రాళ్లు  తినేటప్పుడు మంచి రుచిగా ఉంటాయి. 

…………

బెల్లం ఉండ్రాళ్లు 
కావలసిన పదార్థాలు: 
బియ్యప్పిండి – అర కప్పు. నీరు – ముప్పావు కప్పు; బెల్లం తురుము – అర కప్పు కంటె కొద్దిగా తక్కువ; ఎండుకొబ్బరి తురుము – మూడు టేబుల్‌ స్పూన్లు: ఏలకులపొడి – కొద్దిగా; నెయ్యి/నూనె – రెండు టేబుల్‌ స్పూన్లు 
 

తయారు చేసే పద్ధతి 
ఒక పెద్ద పాత్రలో నీరు పోసి మరిగించాలి. బెల్లం తురుము వేసి రెండు మూడు నిముషాలు కలపాలి. ఏలకులపొడి, ఎండుకొబ్బరి తురుము, బియ్యప్పిండి వేసి ఆపకుండా కలపాలి. లేదంటే అడుగుఅంటుతుంది. కిందకు దించి చల్లార్చాలి. తరువాత చేతికి నెయ్యి లేదా నూనె రాసుకుని ఈ మిశ్రమాన్ని ఉండలు చేసుకోవాలి.  వీటిని కుక్కర్లో ఇడ్లీ రేకుల మీద పెట్టి..వాటి మీద కొద్దిగా నెయ్యి వేసి, మూత పెట్టాలి (విజిల్‌ పెట్టకూడదు). లేదంటే ఇడ్లీ పాత్రలో ఇడ్లీ రేకు పెట్టి దానిపై పేర్చుకోవచ్చు..అలా ఒక ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి. అంతే విఘ్ననాయకుడికి ఇష్టమైన బెల్లం ఉండ్రాళ్లు రెడీ.

…………

జిల్లేడు కాయలు
కావలసిన పదార్థాలు: 
బియ్యం రవ్వ: 2 కప్పులు, తరిగిన బెల్లం: 1 కప్పు, పచ్చికొబ్బరి తురుము: 2 కప్పులు, గసగసాలు: 1గ్రా. బాదం, జీడిపప్పు, కిస్‌ మిస్‌: 2 నెయ్యి: మంచి వాసన  కోసం  యాలకుల పొడి..

తయారు చేసే పద్ధతి 
ముందుగా గిన్నెలో నాలుగు కప్పుల నీళ్లు పోసి స్టౌ మీద పెట్టాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు సరిపడా ఉప్పు కూడా వేయాలి. తరువాత  రవ్వ పోసి ఐదు నిమిషాలు ఉడికించాలి. రవ్వ మెత్తగా ఉడికిన తర్వాత ప్లేట్ లో వేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు ఇంకో గిన్నెలో కొబ్బరి తురుము, బెల్లం కలిపి, కొద్దిగా నీరు చల్లి ఐదు నిమిషాలు ఉడికించి నెయ్యిలో వేయించిన డ్రై ఫ్రూట్స్, వేయించిన గసగసాలు యాలకుల పొడి వేసి కలపాలి. 

ఇలా కలిపిన మిశ్రమాన్ని చిన్న ఉండలుగా చుట్టాలి. బియ్యపు రవ్వతో చేసిన పిండి ముద్దను తీసుకుని, పూరీలా అదిమి, మధ్యలో కొబ్బరి ముద్ద పెట్టి, అన్ని వైపులా మూయాలి. కొబ్బరి ముద్ద బైటకు కనపించకుండా మూసెయ్యాలి. దీనిని జిల్లేడు కాయల ఆకారంలో చేసుకోవాలి. లేదా మనకు ఇష్టమైన షేప్ లో చేసుకోవచ్చు. అన్నీ చేసుకున్నాక..కుడుముల్ని పెట్టినట్లుగా..ఇడ్లీ పాత్రలో ఆవిరి మీద కొద్దిసేపు ఉడికించాలి. అంతే వినాయకుడుకి ఎంతో ఇష్టమైన జిల్లేడు కాయాలు రెడీ.

………

పాలతాలికలు
కావలసిన వస్తువులు: 
‌పాలు – ఒక లీటరు. 
నీళ్లు – ఒక లీటరు. 
‌సగ్గు బియ్యం – ‌100 గ్రాములు. 
బియ్యపిండి – 100 గ్రాములు. 
మైదాపిండి – రెండు టీ స్పూన్లు 
పంచదార – 200 గ్రా 
‌బెల్లం – 1/4 కిలో  
‌ఏలకులపొడి – ఒక టీ స్పూన్  
నెయ్యి – కొద్దిగా 

తయారు చేసే విధానం: 
పాలలో నీటిని కలిపి పొయ్యిమీద మరిగించాలి. పొంగురాగానే సగ్గుబియ్యం వేసి మెత్తగా ఉడికించాలి. ఈలోపు బియ్యంపిండిలో మైదాపిండి, ఒక స్పూను పంచదార వేసి సగ్గుబియ్యం ఉడుకుతున్న తేటతో (సగ్గుబియ్యం రాకుండా పాలు మాత్రమే) తీసుకుని పిండి కలుపుకోవాలి. ఈ పిండిని జంతికల చేసే గొట్టంతో లేదా బూందీ దూసుకునే గరిటెతో మరుగుతున్న పాలలోకి ఒత్తాలి. వాటిని బాగా ఉడికించుకోవాలి.

వాటిని పాలల్లోకి జారవిడిచేటప్పుడు చాలా చాకచక్యంగా పడేలా చూడాలి. లేదంటే ఒకదానిపై ఒకటి పడితే.. ముద్దగా అయిపోతాయి. కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. ఇవి  పాలలోనే ఉడుకుతాయి. కాబట్టి పాలతాలికలు. తాలికలు పాలల్లో ఉడుకుతుండగానే బెల్లం, పంచదార కలిపి పాకం పట్టి చల్లారనివ్వాలి. తాలికలు ఉడికిన తరువాత దించేసి చల్లారిన పాకాన్ని, ఏలకుల పొడిని వేసి కలపాలి.