Ram Navami 2022 : సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది . కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచం ద్ర

Ram Navami 2022 : సీతారాముల కళ్యాణానికి ముస్తాబైన భద్రాద్రి

Bhadrachalam Kalyanam

Ram Navami 2022 :  భద్రాద్రి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కల్యాణానికి మిథిలా స్టేడియం ముస్తాబైంది . కల్యాణ ఘడియలు సమీపిస్తుండగా .. పట్టు వస్త్రాలు ధరించి పెళ్లిపీటలు ఎక్కేందుకు శ్రీ సీతారామచంద్రస్వామి వారు సిద్ధమయ్యారు . ఆదివారం (ఏప్రియల్ 10) మధ్యాహ్నం సరిగ్గా 12 గంటలకు పునర్వసు నక్షత్రం , అభిజిత్ లగ్న సుముహూర్తాన స్వామి, అమ్మవార్ల కల్యాణం జరుగనుంది.

ఈ కమనీయ వేడుకను తిలకించేందుకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీ‌స్గఢ్, ఒడిశా, తమిళనాడుతో పాటు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తున్నారు. ముత్యాల తలంబ్రాలు, గోటి తలంబ్రాలు, పెళ్లి సామగ్రితో ఆలయానికి చేరుకుంటున్నారు. కరోనా దెబ్బకు రెండేళ్లుగా జగదభిరాముడి కల్యాణాన్ని తిలకించలేకపోయిన భక్తులు ఈసారి భారీ సంఖ్యలో భద్రాచలం చేరుకుంటున్నారు.

భద్రాద్రి రామయ్య కల్యాణ మహోత్సవాన్ని కనులారా వీక్షించి తరించేందుకు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఏడాదికోసారి శ్రీరామనవమి నాడు భద్రాద్రిలో అంగరంగ వైభంవగా జరిగే శ్రీ సీతారా మచంద్రస్వామి వారి కల్యాణం కోసం అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. దేశం నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులను ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. సోమవారం జరిగే మహా పట్టాభిషేకాన్ని కూడా ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా, ఈరోజు సాయంత్రం రామాలయంలో జరిగిన ఎదుర్కోలు ఉత్సవం, గరుడ సేవ తదితర కార్యక్రమాలను తిలకించిన భక్తులు పరవశించి పోయారు. ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే.. భద్రాద్రి మిథిలా స్టేడియంలో ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు జరిగే రామయ్య కల్యాణ కమనీయ దృశ్యాలను కనులారా వీక్షించి తరించేందుకు భక్తులు భారీగా స్టేడియంకు చేరుకున్నారు.

భద్రాచలం పట్టణంలోని రామాలయ పరిసరాలు, గోదావరి స్నానఘట్టాలు, కరకట్ట, ఆర్టీసీ బస్టాండ్, అంబేడ్కర్ సెంటర్, బ్రిడ్జి సెంటర్ ఇలా ఎక్కడ చూసినా భక్తజన సందోహమే కనిపించింది. స్వామి వారి కల్యాణానికి ఈ ఏడాది రెండున్నర లక్షల మంది భక్తులు రావచ్చని అంచనా వేసిన అధికారులు అందుకు తగినట్టుగా ఏర్పాట్లు చేశారు. కళ్యాణం జరిగే మిథిలా స్టేడియాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.

స్టేడియం బయట నిల్చుని కల్యాణ తంతును వీక్షించేందుకు ప్రత్యేకంగా టీవీలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా రామాలయ పరిసర ప్రాంతాలలో వసతి కేంద్రాలను, తాగునీటి సౌకర్యం కల్పించారు. గోదావరి స్నానఘట్టాలు, విస్తా కాంప్లెక్స్ పరిసర ప్రాంతాల్లో షామియానాలు ఏర్పాటు చేశారు. మిథిలా స్టేడియం చుట్టు పక్కల గ్యాలరీలో ప్రత్యేకంగా ఈసారి కూలర్లు ఏర్పాటు చేశారు.
Also Read : Ram Navami 2022 : శ్రీరామ నవమి విశిష్టత
ఒక పక్క ఎండ వేడిమి ఉండటంతో భద్రాద్రికి తరలివచ్చే భక్త జనం కోసం పట్టణ పరిసర ప్రాంతాలలో మంచినీటి వసతితో పాటు మజ్జిగ, వైద్య ఆరోగ్య శిబిరాలను సైతం ఏర్పాటు చేశారు. రామాలయం, మాఢవీధులు, గోదావరి ఘాట్లలో చలువ పందిళ్లు వేశారు. రామాలయాన్ని విద్యుత్ దీపాలతో అలంకరించడంతో దేదీప్యమానంగా వెలుగొందుతోంది. ఆదివారం ఉదయం 9.30 గంటలకు ఆలయం నుంచి స్వామి వారి ఉత్సవ మూర్తులను మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. 10.30 గంటల నుంచి 12.30 గంటల వరకు కల్యాణ తంతు నిర్వహిస్తారు. తలాంబ్రాలు, లడ్డుల కోసం పట్టణంలో24 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు.

సీతారామచంద్ర స్వామి కల్యాణ వేడుకలలో అపశృతి చోటు చేసుకోకుండా పోలీసులు డేగ కన్నులతో క్షుణంగా పరిశీలిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం కలిగిన భద్రాద్రితో పాటు చత్తీస్‌గడ్, ఒడిసా, మహారాష్ర్ట, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో మావోయిస్టుల కదలికలను సైతం సిసి కెమోరాల ద్వారా పర్యవేక్షిస్తున్నారు. అనుమానస్పదంగా ఉన్న వారు, లొంగిపోయిన మావోయిస్టుల కదలికలపై దృష్టి సారించారు.

ఇతర ప్రాంతాల నుండి తరలివచ్చే భక్తుల వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేకంగా కరకట్ట ప్రాంతంలో పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు. కల్యాణ క్రతువు కోసం 6వేల మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కొత్తగూడెం ఎస్‌పి సునీల్‌దత్ తెలిపారు. మొత్తం మీద కల్యాణం సజావుగా సాగేందుకు రెవిన్యూ, దేవాదాయ, పోలీసు శాఖలు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు.