Shravana Purnima And Raksha Bandhan : శ్రావణ పూర్ణిమ-రక్షా బంధనం

శ్రావణ పౌర్ణమి.....ఈ రోజునే రాఖి పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంద

Shravana Purnima And Raksha Bandhan : శ్రావణ పూర్ణిమ-రక్షా బంధనం

Raksha Bandhan

శ్రావణ పౌర్ణమి…..ఈ రోజునే రాఖి పౌర్ణమి అని, జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. భారతీయ సంప్రదాయంలో తరతరాలుగా శ్రావణ పూర్ణిమకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. శ్రీమహావిష్ణువును స్మరిస్తూ ఆయన శక్తి అందరినీ రక్షిస్తోందని భావించుకుంటూ ఈ పండుగను జరుపుకోవడం కనిపిస్తుంది. ఈ రోజు ఆడవారు తమ సోదరులకి రాఖి కడతారు. దీని ఉద్దేశ్యం సోదర- సోదరీ బంధం వర్ధిల్లాలని, ఆ రక్షాబంధనం తమని కాపాడుతుంది అని నమ్మకం.   ఈ ఏడాది రాఖీ పౌర్ణమి ఆదివారం ఆగస్టు 22వ తేదీన వచ్చింది.

దీనికి సంబంధించిన చిన్న కధ ఒకటి ప్రచారంలో ఉంది. రాణి కర్ణావతి అనే ఆవిడ తమ రాజ్యం మీద గుజరాత్ నవాబు దాడి చేస్తోంటే తన రాజ్యాన్ని ఎలా కాపాడుకోవాలో తెలియ లేదు. తన పురోహితుడి సలహాని అనుసరించి ఒక సోదరుడిలా తమని కాపాడమని శ్రావణ పౌర్ణమి నాడు మొఘల్ రాజు హుమయూన్ కి రాఖి పంపింది. ఆయన తన సైన్యాన్ని రాణి కర్ణావతికి సహాయంగా పంపి ఆమెని, ఆమె రాజ్యాన్ని కాపాడాడు. అప్పటినుంచి ఈ రాఖి పండుగ కొనసాగుతోంది అని ప్రచారంలో ఉంది.

దీనిలో వాస్తవం ఎంత ఉన్నా ఇది ఒక విధంగా మంచి ఆచారం అని చెప్పవచ్చు. ఈ రక్షాబంధనం గురించి మరి కొంత విశ్లేషణ చూద్దాం. మన ప్రాచీన గ్రంథాలలో హేమాద్రి, నిర్ణయ సింధువు వాటిలో ఈ రక్షాబంధనం (రాఖి) ఎలా కట్టుకోవాలో చాలా వివరంగా ఉన్నది. మన దురదృష్టం కొద్ది మనము సంస్కృత భాషను విడిచి పెట్టడం వల్ల, ఆయా గ్రంథాలలో ఉన్నది మనకి అర్ధం కాకపోవడం మూలంగా ఈ రాఖి పౌర్ణమిని ఒక వేడుకగా మాత్రమే చేస్తున్నాం. రంగు-రంగుల ప్లాస్టిక్ కాగితాలతో, దారాలతో చేసిన రాఖీలు కట్టుకుంటున్నాము. రక్షాబంధనం(రాఖి) ఎలా కట్టుకోవాలో వివరంగా పరిశీలన చేద్దాం.

మనం ఏదైనా శుభకార్యం లేదా పూజ చేసేటప్పుడు గణపతి పూజ చేసి, రక్షాబంధనం కట్టుకుంటాం. ఎందుకంటే ఆ పూజ విఘ్నం లేకుండా జరగాలి అని. ఆ రక్షాబంధనం ధరించే ముందు దారం తో 3 లేదా 5 పోగులు వేసి దానికి మామిడి ఆకు లేదా పసుపుకొమ్ము కట్టి, పూజించి చేతికి కడతారు. అది సాధారణ రక్షాబంధనం. మరి ఇప్పుడు శ్రావణ పౌర్ణమి నాడు కట్టే రక్షాబంధనం ప్రత్యేకత ఏమిటో చూద్దాం.

రక్షా బంధనం – ప్రత్యేకత
శ్రావణ పౌర్ణమి నాడు రక్షాబంధనాన్ని తల్లి – తండ్రి వద్దగానీ, ఒక సమర్ధుడైన గురువు వద్ద కాని ధరించాలి. వీరికి మాత్రమే మన గురించి సంపూర్ణమైన అవగాహన ఉంటుంది. మన జాతక ప్రకారం లేదా మన నిత్య జీవితం లో వచ్చే ఇబ్బందులు వీరితో మాత్రమే ఎటువంటి దాపరికం లేకుండా చెప్పుకోగలుగుతాము.

ఇది అర్ధం కావాలంటే రక్షాబంధనం అంటే ఏమిటి, దీన్ని ఎలా తయారు చెయ్యాలి అనేది వివరంగా తెలుసుకోవాలి. శ్రావణ శుక్ల త్రయోదశి నాడు రక్షాబంధనం తయారు చేయవలిసిన వస్తువులు సమకూర్చుకోవాలి. ( ఈ వస్తువులు వారి గురు సంప్రదాయం అనుసరించి ఉంటాయి. ) వీలైనంతవరకు పౌర్ణమి వెళ్ళకుండా రక్షాబంధనం ధరించాలి. ఇంట్లో ఆడవారి ఇబ్బంది రోజులు ఉంటే అప్పుడు రక్షాబంధనం స్వీకారం చెయ్యకూడదు. గురువుగారికి తమ ఇబ్బంది చెప్పి ఇబ్బందులు తీరినాక రక్షాబంధనం స్వీకరించాలి.

రక్షాబంధనం లేదా రక్ష అనగా ఒక తాడు లేదా దారం కడతారు అనుకోవద్దు. విభూతి, పసుపు, కుంకుమ, అక్షింతలు, కొన్ని యంత్రాలు , గోమతి చక్రం, శ్రీఫలం, లక్ష్మి గవ్వలు, కొన్ని ప్రత్యక సమయంలో సేకరించిన కొన్ని వస్తువులు ఇలాంటివి మీ అవసరాన్ని అనుసరించి ఇవ్వడం జరుగుతుంది.

మనకి సాధారణంగా వచ్చే సమస్యలు కొన్ని చూద్దాం. వ్యక్తిగతంగా తీసుకుంటే చదువు, ఉద్యోగం, పెళ్లి , ఇల్లు , డబ్బు, వాహనం, ఇలాంటివి. కుటుంబపరంగా చూస్తే భార్య, పిల్లలు, అత్తా-మామ, తల్లి- తండ్రి, సోదరులు , అక్క-చెల్లెళ్ళు, వీరివల్ల సమస్యలు. సామాజికంగా చూస్తే కారు డ్రైవర్, ప్రక్క ఇంటి వాళ్ళు , పై అధికారి లేదా బాస్, సహోద్యోగులు, స్నేహితులు. ఇంతే కాకుండా చాలా సమస్యలు చెప్పుకోలేనివి ఉంటాయి. మన ప్రాచీనులు ఇలాంటి ఇబ్బందులు అన్నిటికి మంత్రశాస్త్ర పరంగా అనేక పరిహారాలు సూచించారు. ఒక్కొక్క సమస్యని పరిష్కరించుకోవటానికి ఒక్కొక్క దేవత అనుగ్రహం కావాలి.

ఉదాహరణకి….
చదువు — సరస్వతి, హయగ్రీవుడు, దక్షిణామూర్తి.
ఉద్యోగం — గణపతి,లక్ష్మీదేవి, సుదర్శనుడు,మణిభద్రుడు.
పెళ్లి — మాతంగి, స్వయంవర పార్వతి, గంధర్వుడు.
ఇల్లు— భైరవుడు,లలిత,లక్ష్మి,గణపతి.
డబ్బు— లక్ష్మి,
స్వర్ణాకర్షణ భైరవుడు, తారాదేవి.
పిల్లలు—- సుబ్రహ్మణ్యస్వామి, సంతాన గోపాలుడు.
శత్రుబాధ నివారణ : సుదర్శనుడు, ప్రత్యంగిర, కాళి, శరభేశ్వరుడు.
కోర్టు కేసులు— వనదుర్గ, బగలాముఖి.
నర-దృష్టి—బేతాళుడు, ఖడ్గ రావణుడు, అఘోర రుద్రుడు.
కార్యసిద్ధి—చండి, దుర్గ, సిద్ధలక్ష్మి
ఇలా చాలా మంత్రాలు, వాటిని వినియోగించే విధానాలు మన పూర్వీకులు చాలా వివరంగా చెప్పారు.

ఏదైనా దేవత అనుగ్రహం పొందాలి అంటే ఆ దేవతకి సంబంధించిన మంత్రం, జపం, హోమం (చండి హోమం లాంటివి) చెయ్యాలి. కొన్ని మంత్రాలు అందరూ చెయ్యలేరు…. కొన్ని చెయ్యకూడదు. ప్రస్తుత కాలంలో నియమాలు పాటించడం చాల కష్టం అవుతోంది. అందువల్ల ఆయా మంత్రాలలో నిష్టాతులు అయిన గురువుల వద్ద మంత్ర పూరితం అయిన రక్షాబంధనం కట్టుకోవడం వల్ల అన్ని ఇబ్బందులు తొలిగిపోతాయి.
గురువు యొక్క ప్రాధాన్యం ఒక్క సారి చూద్దాం. బ్రహ్మ శపిస్తే దాన్ని విష్ణువు తొలగించగలరు. విష్ణువు శపిస్తే దాన్ని శివుడు, శివుడు శపిస్తే అమ్మవారు, అమ్మవారు శపిస్తే దాన్ని గురువు తొలగించగలరు. కాని గురువు శపిస్తే దాన్ని ఎవరూ తొలగించలేరు. హిందూ ధర్మంలో గురువుకి అంతటి విశిష్ట స్థానం ఉంది. అందువల్ల మీరు ఎంచుకున్న గురువు చేతిమీదుగా రక్షాబంధనం ధరించి సకల శుభాలు పొందగలరు.

రక్షాబంధనం – విశిష్టత
రక్షాబంధనం దాని విశిష్టత ఓసారి చూద్దాం. భవిష్యోత్తర పురాణంలోనూ, మహాభారత కథలోనూ రక్షాబంధన ప్రసక్తి మనకు కనిపిస్తుంది. ధర్మరాజు కృష్ణుడిని రక్షాబంధన విశేషాలను గురించి అడిగినప్పుడు కృష్ణుడు దీనివల్ల కలిగే మేలును ఆయనకు వివరించాడు. రక్షాబంధనాన్ని ఒకసారి కట్టించుకుంటే ఇక ఆ సంవత్సరమంతా దుష్ట, ప్రేత, పిశాచ బాధ ఉండదని, అనారోగ్యాన్ని, అశుభాన్ని పోగొడుతుందని కృష్ణుడు చెప్పాడు. ఈ సందర్భంగా పూర్వం జరిగిన ఓ సంఘటనను కూడా ఆయన వివరించాడు. పూర్వకాలంలో దేవతలకు, రాక్షసులకు విపరీతంగా యుద్ధం జరుగుతుండేది. ఆ యుద్ధంలో రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేక బాధపడుతుండేవారు. ఆ పరిస్థితి చూసి ఎలాగైనా దేవేంద్రుడికి విజయం కలగాలని ఇంద్రుడి భార్య శచీదేవి అతడికి రక్ష కట్టింది. ఆ తర్వాత యుద్ధానికి వెళ్ళిన ఇంద్రుడు రాక్షసులను చీల్చి చెండాడాడు. రక్షాబంధనానికి అంత గొప్ప శక్తి ఉంది. ఈ రక్షాబంధనం సందర్భంలో చదివే శ్లోకం

‘యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః,
తేనత్వామభిబధ్నామి రక్షే మా చల మా చల’

దీనిలో రక్షాబంధనం అంటే సాక్షాత్తూ శ్రీ మహావిష్ణు శక్తేనని తెలియచెప్పే భావం ఇమిడి ఉంది.

దేవేంద్రుడు, శచీదేవి వృత్తాంతం ఇలా ప్రాచీనంగా ఉన్న కథలో కనిపిస్తుంటే చరిత్ర గతిలో మొగలాయి చక్రవర్తుల ఏలుబడిలో ఈ రక్షాబంధనానికి మరికొంత కొత్త విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. సాధారణంగా చాలామంది ఇంటి ముందు ఇలా రాసి ఉంటుంది.  శ్రీరామరక్ష సర్వజగ్రక్ష . శ్రీరాముని వల్ల సకల లోకములు రక్షింపబడాలి అని అర్ధం చేసుకోవచ్చు.  ఇంతే కాకుకుండా బూడిద గుమ్మడికాయ, పటిక, ముళ్ళ కర్ర, కొబ్బరికాయ, కను దృష్టి వినాయకుడిబొమ్మ, పంచముఖి ఆంజనేయుడు, నరసింహ స్వామి బొమ్మ ఇలాంటివి చాలా పెడుతూ ఉంటారు. ఇవి మనలని రక్షిస్తాయి అని మన నమ్మకం. వీటిలో బొమ్మలు లేదా విగ్రహాలు అనేది ఈరోజుల్లో అందరికి అందుబాటులో ఉంటున్నాయి.

పూర్వకాలంలో ఇవి అందరికి అంత అందుబాటులో ఉండేవి కావు. ఆ రోజులలలో పెద్దవారి చేత అక్షింతలు వేయించుకోవడం, బొట్టు పెట్టించుకోవడం చేసేవారు. ఇవి అన్నీ రక్ష ఇచ్చే పద్దుతులే.  అసలు రక్ష దేనికి కావాలి. ఇంటికా, శరీరనికా, కుటుంబానికా చూద్దాం.

శరీర రక్ష: జాతకం ప్రకారం దుష్ట గ్రహ దశలలో అనారోగ్యం, శారీరక- మానసిక ఇబ్బందులు, ప్రమాదాలు, శరీరానికి గాయాలు, అభిచార ప్రయోగాలు, గాలిదోషాలు (దిష్టి తీసి పారవేసినవి తొక్కడం మూలంగా వచ్చే ఇబ్బందులు ) ఇలాంటివాటికి ఇచ్చే రక్ష శరీరాన్ని రక్షిస్తుంది.

గృహానికి రక్ష: మనం ఇంటికి తాళం పెట్టుకొని బయటకి వెళితే లేదా విదేశాలు వెళితే దొంగతనం జరిగే అవకాశం ఉంటుంది.. కార్తవీర్యార్జునుడు దొంగల వల్ల బాధలు కలగకుండా చూస్తాడు. కార్తవీర్యార్జున మంత్రం జపం రోజూ చెయ్యడం మూలంగా దొంగతనాలు జరగవు. ఒకవేళ ధన నష్టం, దొంగతనం జరిగినప్పుడు కార్తవీర్యార్జున మంత్రం జపం చేయడం మూలంగా తిరిగి ఆ ధనాన్ని పొందుతాము. అలాగే ప్రక్క ఇంటి వారితో గొడవలు, అద్దెకు ఉన్నవారితో ఇబ్బందులు, వీధిలో పిల్లల అల్లరి ఇటువంటివి ఇంటికి సంబంధించి బయటకు కనబడే సమస్యలు. మన కంటికి కనబడకుండా ఇబ్బంది పెట్టివి కొన్ని చూద్దాం. ఇంటి స్థలంలో ఉన్న ఎముకలు వంటి వాటి వల్ల వచ్చే ఇబ్బందులు కంటికి కనబడవు. అలాగే వీధిపోటు, ప్రక్క ఇంటి వెన్నుపోటు, ఇంట్లో చనిపోయిన వారి ప్రభావం, నరదృష్టి వల్ల ఇబ్బందులు, అభిచార ప్రయోగాలు వీటి వల్ల వచ్చే ఇబ్బందులు కూడా కంటికి కనబడవు. ఇలాంటి పరిస్థితి లో ఇంటికి రక్షణ కల్పించాలి. అవసరాన్ని అనుసరించి ఏదైనా యంత్ర ప్రతిష్ట చెయ్యడం లేదా హోమాలు చెయ్యడం మూలంగా ఇంటికి రక్షణ కల్పించ వచ్చు. ఈ శ్రావణ పౌర్ణమి నాడు ఇంటికి కూడా రక్షాబంధన చెయ్యడం మూలంగా ఇంటిని సుఖప్రదం చేసుకోవచ్చు.

కుటుంబ రక్షణ: ఇంటి యజమాని వేరే ఊరు లేదా దేశం లో ఉన్నప్పుడు ఇంట్లో వారి అవసరం (రక్షణ )కోసం కొంత డబ్బు లేదా ఇంకా ఏదైనా ఏర్పాటు చేస్తారు. ఇది భౌతిక అవసరాలని మాత్రమే తీర్చ గలుగుతుంది. ఇల్లు అన్నప్పుడు ఇంట్లో వాళ్ళు అందరూ వస్తారు. అందులో భార్య, పిల్లలు, పశువులు (ప్రస్తుత కాలంలో ఇంట్లో పెంచే కుక్క పిల్లలు), ధనం, దేహాభిమానం (పరువు-మర్యాదలు) ఈవన్నీ రక్షింపబడినప్పుడే ఇంటికి రక్షణ ఉన్నట్లుగా భావించాలి.

పై విధంగా శరీరాన్ని, ఇంటిని, కుటుంబాన్ని, ధనాన్ని, దేహాభిమానాన్ని కాపాడడం కోసం శ్రావణ పౌర్ణమి నాడు రక్షణ చేసుకోవచ్చు. కొన్ని వస్తువులు లేదా యంత్రాలు వంటి వాటిని మంత్రములతో చైతన్యం చేస్తి శరీరం మీద (తావీజు లాగ )ధరించడం, లేదా ఇంట్లో వుంచడం, లేదా ఇంటిముందు కట్టడం మూలం రక్షణ పొందవచ్చు.

మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.