Sravana Masam 2022 : శ్రావణ మాసం విశిష్టత-పండుగలు

హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు.

Sravana Masam 2022 : శ్రావణ మాసం విశిష్టత-పండుగలు

Sravana Masam 2022

Sravana Masam 2022 :  హిందూ పంచాంగంలో ప్రతి నెలకు ఒక ప్రత్యేకత ఉంది. వాటిలో శ్రావణ మాసం ఒకటి. ఈ మాసంలో మహిళలు ఎక్కువగా వరలక్ష్మివ్రతం జరుపుకుంటారు. చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాడు  చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది.

శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం “శ్రవణా నక్షత్రం” అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం. శ్రావణ మాసంలోని మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి, మహత్తును కలిగినవి.  శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు.

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు
శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాల మాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్ల చవితి-నాగులచవితి.. మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.
శుక్ల  ఏకాదశి-పుత్రదా ఏకాదశి   ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.
శ్రావణ పూర్ణిమ – రాఖీపూర్ణిమ.  సోదరుడి సుఖ  సంతోషాలు కోరుతూ అక్కా  చెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు.  నుదుట బొట్టు పెట్టి.. అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ.  అంతే గాక ఈ రోజు పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.
పూర్ణిమ – హయగ్రీవ జయంతి-వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం. హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణ విదియ– శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి. క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.
కృష్ణపక్ష అష్టమి – శ్రీకృష్ణాష్టమి . శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.
కృష్ణపక్ష అమావాస్య – పోలాల అమావాస్య.  ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.