Tholi Ekadasi 2021 : తొలి ఏకాదశి విశిష్టత

ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి...శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాదితొలి ఏకాదశి జూలై 20, మంగళవారం నాడు  జరుపుకుంటున్నారు.

Tholi Ekadasi 2021 : తొలి ఏకాదశి విశిష్టత

Significance Of Tholi Ekadasi

Tholi Ekadasi 2021 :  ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి…శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ ఏడాదితొలి ఏకాదశి జూలై 20, మంగళవారం నాడు  జరుపుకుంటున్నారు. శ్రీ ప్లవ నామ సంవత్సరం,ఆషాఢమాసం, గ్రీష్మ బుతువు, దక్షిణాయనం, మంగళవారం, శుధ్ద ఏకాదశి తిధి రాత్రి గం.7-17 వరకు ఉంది.  హిందూ సంస్కృతిలో “తొలి ఏకాదశి” పర్వదినానికి విశేష స్థానముంది. ఏడాదిలో వచ్చే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుద్ధ ఏకాదశిని ‘‘తొలి ఏకాదశిగా’’ గా పిలుస్తారు. దీనికే హరి వాసరమని, ‘‘పేలాల పండుగ’’ అని కూడా పిలుస్తారు.

ఈ రోజు నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు శ్రీ మహవిష్ణువు పాల కడలిపై శయనిస్తాడు. అందుకే దీన్ని శయన ఏకాదశి అంటారు. ఈ రోజున యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్లీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొవడమే ఉత్థాన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి తర్వాత రోజు ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. శ్రీహరి యోగ నిద్రలో ఉండే ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి చాతుర్మాస్యదీక్ష చేస్తారు.

తాళజంఘుడు అనే రాక్షసుడి కుమారుడు మురాసురుడితో మహావిష్ణువు యుద్ధం చేసి అలసిపోతాడు. ఆ సమయంలో తన శరీరం నుంచి జనించిన కన్య పేరు ఏకాదశి అంటారు. రుక్మాంగదుడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే సమయంలో మోహిని రూపంలో వచ్చి, పొందుకోరిన రంభను తిరస్కరించాడు. ప్రస్తుతం ఈ దీక్షను మఠాధిపతులు, సన్యాస ఆశ్రమ స్వీకారం చేసినవారు మాత్రమే ఆచరిస్తున్నారు.

చాతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగు నెలలపాటు ఆహార నియమాలు పాటిస్తూ కఠిన నిష్ఠతో కామ క్రోధాదులను విసర్జిస్తారు. నిజానికి పంచభూతాలు, సూర్యచంద్రులు, గ్రహాలు పరస్పర సంబంధాన్నీ, వాటి గమనాన్ని బట్టి ఇది ప్రకృతిలో మార్పులకు సంకేతం. ప్రత్యక్ష దైవం సూర్యుడు దక్షిణం వైపునకు మరలిన ఈ రోజు నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది.

చాతుర్మాస్య దీక్షతోపాటు మహిళలకు సౌభాగ్యాన్ని కలిగించే గోపద్మ వ్రతాన్ని కూడా  ఈరోజు నుంచే ఆచరిస్తారు. దీన్ని తొలి ఏకాదశి మొదలు కార్తీక శుక్లపక్ష ద్వాదశి వరకు అంటే క్షీరాబ్ధి ద్వాదశి వరకు ఆచరించాలని పురాణాలు చెబుతున్నాయి.

ఆషాఢమాస తొలి ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేచి, శుద్ధి చేసుకుని శ్రీహరిని నియమ నిష్ఠలతో పూజించాలి. శుభ్రం చేసుకుని విష్ణుమూర్తిని పసుపు, కుంకుమ, పుష్పాలతో అలంకరించాలి. తర్వాత చక్కెర పొంగలిని నైవేద్యంగా సమర్పించాలి.

ఏకాదశి వ్రతమాచరించే వారు మాంసాహారం, గుమ్మడి కాయ, చింతపండు, ఉసిరి, ఉలవలు, మినుములతో చేసినవి, వండిన ఆహార పదార్థాలను తీసుకోరాదు. అలాగే మంచంపై కూడా శయనించరాదు.

ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. ఈ ఏకాదశి విశిష్టతను పద్మ పురాణంలో వివరించారు. త్రిమూర్తులలో ఒకరైన శ్రీహరితో ముడిపడిన ఈ ఏకాదశి మహత్య్మం గురించి అనేక కథలు కూడా మన పురాణాలలో ఉన్నాయి.

మానవజాతిని ఉద్ధరించటానికి సాక్షాత్తు శ్రీహరే ఈ ఏకాదశిని ఏర్పాటు చేశాడనీ, ఈ వ్రతాన్ని నియమనిష్టలతో ఆచరించిన వారు అన్ని సమస్యల నుంచి విముక్తి పొందడమే కాదు, మరణానంతరం వైకుంఠానికి చేరుకుంటారని పద్మ పురాణంలో పేర్కొన్నారు.

ఇది ముఖ్యంగా రైతుల పండుగ. ఏరువాక లాగే తొలి ఏకాదశిని వేడుక చేసుకుంటారు. అతివృష్టి, అనావృష్టి లాంటి ప్రకృతి వైపరీత్యాలు చోటు చేసుకోకూడదని, పైరుకు ఎలాంటి తెగుళ్లు సోకకూడదని, ఏ ఆంటకాలు ఎదురవకూడదని వేడుకుంటారు.

తొలి ఏకాదశి నాడు మొక్కజొన్న పేలాలను పొడి చేసి, అందులో బెల్లం కలిపి దేవుడికి నైవేద్యంగా సమర్పించి, ప్రసాదంగా తీసుకుంటారు. ఏకాదశి రోజు రైతులు పూజ పూర్తిచేసి పొలానికి వెళ్లి పని చేసుకుంటారు. ఈ రోజు తప్పనిసరిగా పని చేయాలనే నమ్మకం ఉంది.  కొత్త కూలీలను మాట్లాడ్డం లాంటి పనులు చేస్తారు. కొత్త ఒప్పందాలు ఈ రోజు కుదుర్చుకుంటే మంచిదని నమ్మి అలా చేస్తారు.

మహావిష్ణువు వరంతో అన్నంలో దాగిన పాపపురుషుడు, బ్రహ్మ పాలభాగం నుంచి కిందపడిన చెమట బిందువులో అవతరించిన రాక్షసుడు తమ నివాసానికి చోటు ఇవ్వమని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏకాదశి నాడు భుజించే వారి అన్నంలో నివసించమని వరం ప్రసాదించాడు. దీంతో ఈ రాక్షసులు ఇద్దరూ ఆ రోజు అన్నంలో ఉంటారు కాబట్టి ఉదరంలోకి చేరి క్రిములుగా మారి అనారోగ్యాన్ని కలిగిస్తారని మన పురాణాలు తెలియ చేస్తున్నాయి.

మనకి శాస్త్ర ప్రకారంగా దక్షిణాయణం అంతా ఉపాసనా కాలం. సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు మళ్ళీ మకర రాశిలోకి ప్రవేశించే పర్యంతం మధ్యలో ఉండే కాలం అంతా కూడా చాలా చాలా గొప్ప గొప్ప నైమిత్తిక తిథులతో కూడుకున్నదై ఉంటుంది. నైమిత్తిక తిథుల యందు చేసినటువంటి కర్మాచరణం వలన కలిగిన ఫలం చిత్తశుద్ధిని కల్పించడానికి సాధనంగా మారుతుంది.

ఎప్పుడైతే చిత్తశుద్ధి కలిగిందో పాత్రత కలుగుతుంది. పాత్రత కలిగితే ఈశ్వరుడు జ్ఞానాన్ని కటాక్షిస్తాడు. ఆ జ్ఞానమే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిగా చెప్పబడే కైవల్యము/మోక్షమునకు కారణం అవుతుంది. విహిత కర్మాచరణం చేయడానికి కావలసినటువంటి నైమిత్తిక తిథులన్నీ విశేషమైన సమాహార స్వరూపంతో ఉండేది దక్షిణాయణ పుణ్యకాలం.

ఏకాదశి నాడు ఏం చేయాలి: ఏకాదశి నాడు ఉపవాసం ఉండి..ఆ రాత్రంతా జాగరణ చేయాలి.. రాత్రివేళ విష్ణుమూర్తికి సంబంధించిన భాగవతాన్ని చదువుకోవడం, విష్ణుసహస్రనామ పారాయణ చేయాలి.. మర్నాడు ద్వాదశి రోజున దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి ఉపవాస దీక్షను విరమించాలి.. తొలి ఏకాదశి నాడు ఆవులను పూజించాలి.

పేలాల పిండి: తొలి ఏకాదశి నాడు పేలాల పిండిని తప్పక తినాలని అంటారు. పేలాలు పితృదేవతలకు ఎంతో ఇష్టమైనవి.. అందువల్ల మనకు జన్మనిచ్చిన పూర్వీకులను ఈ రోజు గుర్తు చేసుకోవడం మన బాధ్యత. అలాగే ఆరోగ్యపరంగా బయటి ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరం అనేక మార్పులకు లోనవుతుంది. గ్రీష్మ రుతువు ముగిసిన తర్వాత వర్ష రుతువు ప్రారంభమయ్యే కాలం.. కాబట్టి శరీరానికి పేలాల పిండి వేడిని కలగజేస్తుంది. అందువల్ల ఈరోజున దేవాలయాల్లోనూ.. ఇళ్ల వద్దా పేలాల పిండిని ప్రసాదంగా పంచుతారు.