Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి స్ధానికులకు ప్రత్యేక టికెట్లు

తిరుప‌తిలో స్థానికుల కోసం 5 ప్రాంతాల్లో కౌంట‌ర్లు ఏర్పాటుచేసి రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామ‌ని, ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో స్థానిక భ‌క్తులకు మాత్ర‌మే

Vaikunta Ekadasi : వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతి స్ధానికులకు ప్రత్యేక టికెట్లు

Vaikunta Ekadasi

Vaikunta Ekadasi :  సామాన్య భ‌క్తులను  దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శిని పుర‌స్క‌రించుకుని జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు  టిటిడి అద‌న‌పు ఈవో ధ‌ర్మారెడ్డి తెలిపారు.  తిరుప‌తిలో స్థానికుల కోసం  5 ప్రాంతాల్లో కౌంట‌ర్లు ఏర్పాటు చేసి  రోజుకు 5 వేలు చొప్పున మొత్తం 50 వేల టోకెన్లు కేటాయిస్తామ‌ని,  ఒమిక్రాన్ వ్యాప్తి నేప‌థ్యంలో స్థానిక భ‌క్తులకు మాత్ర‌మే ఈ టోకెన్లు మంజూరు చేస్తామ‌ని చెప్పారు. వైకుంఠ ద్వార ద‌ర్శ‌నం కోసం టికెట్లు బుక్ చేసుకున్న భ‌క్తుల‌కు  కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉంటే ఇత‌ర భ‌క్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్ర‌యాణం వాయిదా వేసుకోవాల‌ని కోరారు.

తిరుమ‌ల  అన్న‌మ‌య్య భ‌వ‌నంలో వైకుంఠ ఏకాద‌శి ఏర్పాట్ల‌పై వివిధ విభాగాల అధికారుల‌తో ధర్మారెడ్డి  ఈ రోజు స‌మీక్ష నిర్వహించారు. ఈసందర్బంగా  ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. తిరుమ‌ల‌లో యాత్రికులు బ‌స చేసేందుకు దాదాపు 7500 పైగా గ‌దులు ఉండ‌గా ప్ర‌స్తుతం 1300 గ‌దుల్లో  పున‌రుద్ధ‌ర‌ణ ప‌నులు జ‌రుగుతున్నాయి. ఈ కార‌ణంగా భ‌క్తులు వీలైనంత వ‌ర‌కు తిరుప‌తిలోనే  గ‌దులు పొందాల‌ని కోరారు.

సామాన్య భ‌క్తుల సౌక‌ర్యాన్ని దృష్టిలో ఉంచుకుని జ‌న‌వ‌రి 1న‌, వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13 నుండి 22వ తేదీ వ‌ర‌కు స్వ‌యంగా వ‌చ్చే ప్ర‌ముఖుల‌కు మాత్ర‌మే విఐపి బ్రేక్ ద‌ర్శ‌నం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. జనవ‌రి 13న వైకుంఠ ఏకాదశి నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 11న  కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌ుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మల‌యప్పస్వామి వారు స్వర్ణ రథంపై ఆల‌య నాలుగు మాడ వీధుల‌లో భక్తుల‌కు దర్శనమిస్తారు.

వైకుంఠ ద్వాద‌శి సంద‌ర్భంగా ఉద‌యం గం. 5 నుండి గం.6 గంట‌ల వ‌ర‌కు స్వామి వారికి చ‌క్ర‌స్నానం ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. ల‌డ్డూ కాంప్లెక్సులో భ‌క్తుల‌కు ఎటువంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా 5 ల‌క్ష‌ల ల‌డ్డూలు స్టాక్ ఉంచ‌ుతున్నట్లు ఆయన తెలిపారు.

Also Read : ATM Cash Withdrawal : జనవరి 1 నుంచి న్యూ రూల్స్.. ఏటీఎం నగదు విత్‌డ్రా కొత్త ఛార్జీలు ఇవే..!

వైకుంఠ ఏకాద‌శి సంద‌ర్భంగా చెన్నైలోని స‌మాచార కేంద్రానికి 30 వేల చిన్న‌ల‌డ్డూలు, 500 పెద్ద ల‌డ్డూలు, 75 వేల చిన్న‌ల‌డ్డూలు (రూ.7/-) బెంగ‌ళూరులోని స‌మాచార కేంద్రానికి 10 వేల చిన్న‌ల‌డ్డూలు, 100 పెద్ద ల‌డ్డూలు, హైద‌రాబాద్‌లోని స‌మాచార కేంద్రానికి 10 వేల చిన్న‌ల‌డ్డూలు,  వేలూరులోని స‌మాచార కేంద్రానికి 5 వేల చిన్న‌ల‌డ్డూలు, 100 పెద్ద ల‌డ్డూలు, ఒంటిమిట్ట‌, వేలూరులోని స‌మాచార కేంద్రాల‌కు క‌లిపి 7 వేల చిన్న‌ల‌డ్డూల‌ను భ‌క్తుల‌కు విక్ర‌యించేందుకు అందుబాటులో ఉంచుతామని ధర్మారెడ్డి వివరించారు.

కోవిడ్ వ్యాప్తిని అరిక‌ట్టేందుకు శ్రీ‌వారి ఆల‌యంలో ట్రై ఓజోన్ స్ప్రేయింగ్ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన చెప్పారు. అలిపిరి చెక్‌ పాయింట్‌, తిరుమ‌ల‌లోని గ‌దుల కేటాయింపు కేంద్రాలు, వైకుంఠ క్యూ కాంప్లెక్స్, శ్రీ‌వారి ఆల‌యం మ‌రియు ల‌డ్డూ కౌంట‌ర్ల వద్ద కోవిడ్ నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా శానిటైజేష‌న్‌ చేస్తున్నట్లు ఆయన చెప్పారు.