Sri Venkateswara Vaibavotsams : హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో వేంక‌టేశ్వ‌ర స్వామి వైభ‌వోత్స‌వాలు.. తిరుమల తరహాలో శ్రీవారి సేవలు

తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామికి జ‌రిగే నిత్య‌, వార‌సేవ‌లు, ఉత్స‌వాల‌ను చూసే అవ‌కాశం ద‌క్క‌ని ల‌క్ష‌లాది మంది భ‌క్తులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల ద్వారా వీటిని చూసి త‌రించే అదృష్టం ల‌భిస్తుంద‌ని జేఈవో వీర‌బ్ర‌హ్మం చెప్పారు.

Sri Venkateswara Vaibavotsams : హైద‌రాబాద్‌ ఎన్టీఆర్ స్టేడియంలో వేంక‌టేశ్వ‌ర స్వామి వైభ‌వోత్స‌వాలు.. తిరుమల తరహాలో శ్రీవారి సేవలు

Sri Venkateswara Vaibavotsams : తిరుమ‌ల‌లో శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామికి జ‌రిగే నిత్య‌, వార‌సేవ‌లు, ఉత్స‌వాల‌ను చూసే అవ‌కాశం ద‌క్క‌ని ల‌క్ష‌లాది మంది భ‌క్తులకు శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాల ద్వారా వీటిని చూసి త‌రించే అదృష్టం ల‌భిస్తుంద‌ని జేఈవో వీర‌బ్ర‌హ్మం చెప్పారు. ఇటీవ‌ల నెల్లూరులో నిర్వ‌హించిన వైభ‌వోత్స‌వాల్లో వేలాది మంది భ‌క్తులు పాల్గొన్నార‌ని, అక్టోబ‌ర్ 11 నుండి 15వ తేదీ వ‌ర‌కు హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించే శ్రీ వేంక‌టేశ్వ‌ర వైభ‌వోత్స‌వాలు ల‌క్ష‌లాది మంది భ‌క్తులు స్వామివారి సేవ‌లు చూసి త‌రించే అవ‌కాశం ల‌భిస్తుంద‌ని చెప్పారు. వైభ‌వోత్స‌వాల గురించి హైద‌రాబాద్ లో 10 రోజుల ముందు నుంచే ప్ర‌చార ర‌థాల ద్వారా విస్తృతంగా ప్ర‌చారం చేయాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. వైభ‌వోత్స‌వాల ఏర్పాట్ల‌పై సోమ‌వారం అధికారుల‌తో వ‌ర్చువ‌ల్‌గా స‌మీక్ష నిర్వ‌హించారు.

భ‌క్తులు సులువుగా గుర్తించ‌గ‌లిగే ప్రాంతంలో టీటీడీ పంచ‌గ‌వ్య ఉత్ప‌త్తుల విక్ర‌య కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని జేఈవో చెప్పారు. వేదిక‌తోపాటు స్టేడియంలో శోభాయ‌మానంగా పుష్పాలంక‌ర‌ణ‌, విద్యుత్ అలంక‌ర‌ణ‌లు, ఫ్లెక్సీలు, ఆర్చిల నిర్మాణం చేప‌ట్టాల‌ని ఆదేశించారు. భ‌క్తులు అధిక సంఖ్య‌లో వ‌చ్చే అవ‌కాశం ఉన్నందు వ‌ల్ల అవ‌స‌ర‌మైన‌న్ని ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాల‌న్నారు. పారిశుద్ధ్యం, అన్న‌ప్ర‌సాదాల పంపిణీ, ర‌వాణ, వ‌స‌తి, ఫొటో ఎగ్జిబిష‌న్ ఏర్పాటుపై ప్ర‌త్యేక‌ శ్ర‌ద్ధ వ‌హించాల‌న్నారు.

నెల్లూరు వైభవోత్స‌వాల‌ త‌ర‌హాలో పోటు, ప్ర‌సాదం కౌంట‌ర్లు ఏర్పాటు చేయాల‌ని కోరారు. భ‌క్తులు ఎండకు, వర్షానికి ఇబ్బంది ప‌డ‌కుండా జర్మన్ షెడ్డు ఏర్పాటు చేయాల‌న్నారు. భ‌క్తుల‌కు సేవ‌లందించేందుకు త‌గినంత మంది శ్రీ‌వారి సేవ‌కుల‌ను ఆహ్వానించాల‌న్నారు. భ‌క్తుల‌కు తాగునీటికి ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా స్టేడియంలో ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు.

ఆహ్వాన‌ ప‌త్రిక‌లు, భ‌క్తుల‌కు పాసులు అందించ‌డానికి త‌గిన ఏర్పాట్లు చేయాల‌ని చెప్పారు. వేదిక మీద ఉండే సిబ్బంది, అధికారులు త‌ప్ప‌నిస‌రిగా టీటీడీ డ్రెస్‌ కోడ్ పాటించాల‌న్నారు. సేవ‌ల ప్రారంభానికి ముందు ప్ర‌వ‌చ‌నాలు, ఆయా సేవ‌ల విశిష్ట‌త‌ను భ‌క్తుల‌కు తెలియ‌జేసేందుకు ఇప్ప‌టినుంచే త‌గిన ఏర్పాట్లు చేప‌ట్టాల‌న్నారు. సంగీత‌, నృత్య కార్య‌క్ర‌మాల ద్వారా స్వామివారి వైభ‌వాన్ని క‌ళ్ల‌కు కట్టేలా ప్ర‌ద‌ర్శించే విధంగా క‌ళాకారుల‌ను ఎంపిక చేయాల‌ని సూచించారు. స్వామివారి సేవ‌ల‌ను అద్భుతంగా వివ‌రించ‌గ‌లిగే వ్యాఖ్యాత‌ల‌ను ఎంపిక చేసుకోవాల‌ని కోరారు.