Hamsaladeevi : కాకి హంసగా మారి … ఆపై హంసల దీవిగా

ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో

Hamsaladeevi : కాకి హంసగా మారి … ఆపై హంసల దీవిగా

Hamsala Deevi

Hamsaladeevi : కాకిలా కలకాలం బ్రతికే కన్నా హంసలా ఆరునెలలు బ్రతకటం మేలన్న నానుడి అనాదిగా అందరి నోటినుండి వినిపిస్తూనే ఉంది. అయితే అలాంటి చరిత్రకు ప్రత్యక్ష తార్కాణంగా నిలిచేదే హంసల దీవి. ఆంధ్రప్రదేశ్ లోని క్రిష్ణా జిల్లాలో పవిత్ర క్రిష్ణా నది సముద్రంలో కలిసే ప్రదేశాన్ని హంసల దీవిగా పిలుస్తారు. మహరాష్ట్రల్లో పుట్టి వేలకిలోమీటర్లు పరవళ్ళు తొక్కుతూ ఇక్కడ సాగరంలో సంగమిస్తుంది. దీనిని చాలా పవిత్ర స్ధలంగా బావిస్తారు. ఈ ప్రదేశంలోనే రుక్మీనీ సమేత వేణుగోపాల స్వామి ఆలయం ఉంది.

హంసల దీవిగా చెప్పబడుతున్న ప్రాంతంలోనే దేవతలు పుణ్యస్నానాలు చేసి , ఒకే ఒక్కరాత్రిలో వేణుగోపాల స్వామి ఆలయాన్ని నిర్మించారని పురాణగాధలు చెబుతున్నాయి. దేవతలు ఆలయాన్ని నిర్మిస్తున్న సమయంలో తెల్లవారు తుండగా ఓ మనిషి అది గమనించటంతో ఒక్కసారిగా దేవతలంతా శిలలుగా మారిపోయారని చెబుతుంటారు. ఆలయంలో ఉన్న ఉన్న విగ్రహాలు వారివేనని, అసంపూర్తిగా ఉన్న ఆలయ గాలిగోపురమే ఇందుకు నిదర్శనమని చెబుతుంటారు.

హసంల దీవికి మరో పురాణ కధకూడా ఉంది. పూర్వకాలంలో ప్రజలు తాము చేసిన పాపాలు తొలగించుకునేందుకు గంగానదిలో స్నానం చేసేవారు. జనం పాపాలు నదిలో వదులుతుంటే ఆ భారాన్ని మోయలేదని గంగాదేవి విష్ణుమూర్తి వద్ద తన బాధను వ్యక్తం చేసింది. పాపానికి ప్రతీకగా భావించే నలుపు రంగును ధరించిఉండే కాకి రూపంలో పుణ్యనదుల్లో స్నానమాచరించమని సూచించాడు. ఎక్కడైతే నలుపు రంగు తెలుపు గా మారుతుందో అప్పుడే నీకు పాప విముక్తి లభిస్తుందని చెప్పాడట. విష్ణు మూర్తి సూచనతో గంగా దేవి అనేక నదుల్లో స్నానమాచరించి చివరికి హంసల దీవి ప్రాంతానికి చేరుకుని సాగరసంగమ ప్రాంతంలో స్నానమాచరించగా నలుపు రంగు కాస్త తెలుపుగా మారిపోయిందట. అందుకే ఈ ప్రాంతానికి హంసల దీవిగా పేరొచ్చిందని చెబుతుంటారు.

హంసల దీవిలో ఉన్న వేణుగోపాల స్వామి ఆలయం ఎంతో విశిష్టమైనదిగా భక్తులు భావిస్తారు. ఆలయంలోపల స్ధంభాలపై రాయబడ్డ లిపిని దేవలిపిగా చెబుతుంటారు. సంతానంలేని వారు ఈ స్వామిని దర్శించుకుంటే సంతాన కలుగుతారని నమ్మకం. కుప్పా వంశీయులు ఆలయనిర్వాహణ చూస్తూ ప్రతి ఏటా కళ్యాణోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఆలయాన్ని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం దత్తత తీసుకుని పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది.

ప్రతి సంవత్సరం మాఘమాసంలో వేణుగోపాల స్వామి ఉత్సవాలు వైభవంగా జరుగుతాయి. ఈ కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుంటారు. మూడురోజుల పాటు జరిగే ఈ ఉత్సవ వేడుకలో మూడోరోజు సముద్రస్నానమాచరించే కార్యక్రమం ఉంటుంది. ఆరోజు భక్తులు పెద్ద సంఖ్యలో సాగర సంగమ ప్రదేశంలో స్నానమాచరిస్తారు. రధోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. కార్తీక మాసంలోనూ ప్రత్యక పూజలు, సముద్రస్నానాలతో ఈ ప్రాంతమంతా అధ్యాత్మిక వాతావరణం కనిపిస్తుంది. విజయవాడ, గుంటూరు జిల్లాల నుండి ఈ హంసల దీవిని చేరుకోవచ్చు.