Tirumala Brahmotsavam : ధ్వజారోహణంతో శ్రీవారి సాల‌క‌ట్ల‌ బ్రహ్మోత్సవాలు ప్రారంభం

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2021 ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈరోజు సాయంత్రం 5.10 గంటల నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి.

10TV Telugu News

Tirumala Brahmotsavam : శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2021 ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం (అక్టోబర్ 7) సాయంత్రం 5.10 గంటల నుంచి 5.30 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. సప్తగిరులు గోవిందనామ స్మరణతో మార్మోగిపోతున్నాయి. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీవేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు శ్రీవారి ఆలయంలో ధ్వజారోహణ కార్యక్రమం వైభవంగా జరిగింది. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారి సమక్షంలో వేద‌మంత్రోచ్ఛార‌ణ‌ మధ్య మంగళవాయిద్యాలు మోగుతున్న వేళ అర్చకస్వాములు బంగారు ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఎగురవేశారు.

Tirumala Brahmotsavam Starts From Today (3)

ముక్కోటి దేవతలను ఆహ్వానిస్తూ అర్చకులు ధ్వజపటం ఎగురవేశారు. ధ్వజారోహణంలో భాగంగా వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. శ్రీవాసుదేవ బ‌ట్టాచార్యులు కంక‌ణ‌భ‌ట్ట‌ర్‌గా వ్య‌వ‌హ‌రించారు. సకల దేవతలను, అష్టదిక్పాలకులను, స‌ప్త‌మ‌రుత్తులను (దేవ‌తాపురుషులు), రుషిగ‌ణాన్ని, స‌క‌ల ప్రాణికోటిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ గ‌రుడాళ్వార్ ధ్వ‌జ‌స్తంభాన్ని అధిరోహిస్తారు. విశ్వ‌మంతా గ‌రుడుడు వ్యాపించి ఉంటారు. ఆయ‌న్ను శ్రీ‌నివాసుడు వాహ‌నంగా చేసుకోవ‌డంతో స‌ర్వాంత‌ర్యామిగా స్వామివారు కీర్తిస్తున్నారు. ధ్వ‌జ‌ప‌టంపై గ‌రుడునితోపాటు సూర్య‌చంద్రులకు కూడా స్థానం క‌ల్పించ‌డం మన సంప్ర‌దాయం.
Indrakeeladri: ‘తిరుమల స్థాయిలో ఇంద్రకీలాద్రి.. రూ. 75 కోట్లతో అభివృద్ధి’

Tirumala Brahmotsavam Starts From Today (2)

పెస‌ర‌ప‌ప్పు అన్నం (పొంగ‌లి) ప్ర‌సాదాన్ని నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్ర‌సాదం స్వీక‌రించిన వారికి సంతాన ప్రాప్తి, దీర్ఘాయుష్షు, సిరిసంప‌ద‌లు స‌మ‌కూరుతాయ‌ని ప్రగాడ విశ్వాసం.. ధ్వ‌జ‌స్తంభానికి క‌ట్టిన ద‌ర్భ అమృత‌త్వానికి ప్ర‌తీక‌గా చెబుతారు. పంచ‌భూతాలు, స‌ప్త‌మ‌రుత్తులు క‌లిపి 12 మంది అధిష్టాన దేవ‌త‌లుగా చెబుతారు. ఇది స‌క‌లదోషాల‌ను హ‌రిస్తుంది. ద‌ర్భ‌ను కోసేట‌ప్పుడు, కైంకర్యాల్లో వినియోగించేట‌పుడు ధ‌న్వంత‌రి మంత్ర పారాయ‌ణం చేస్తారు. ధ్వ‌జారోహ‌ణం అనంత‌రం తిరుమ‌ల‌రాయ మండ‌పంలో ఆస్థానం చేప‌ట్టారు.

Tirumala Brahmotsavam Starts From Today (1)

ధ్వ‌జారోహ‌ణ ఘ‌ట్టానికి ముందు సాయంత్రం 3గంటల నుంచి 4.30 గంట‌ల వ‌ర‌కు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతి వారిని, ధ్వజపటాన్ని ఆలయ విమాన ప్రాకారం చుట్టూ ఊరేగించారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌ వై.వి.సుబ్బారెడ్డి, ఈవో జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు ఈ ధ్వజారోహణం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాత్రికి పెద్దశేష వాహన సేవ నిర్వహించ నున్నారు. బ్రహ్మోత్సవాల వేళ తిరుమల విద్యుత్‌ శోభతో వెలిగిపోతోంది. ప్రధాన ప్రదేశాల్లో అలంకరణలు ఆకట్టుకున్నాయి. శ్రీవారి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Thirumala : తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు సర్వం సిద్ధం