Tirumala Srivari Brahmotsavam 2022 : రెండేళ్ల త‌ర్వాత.. భ‌క్తుల స‌మ‌క్షంలో తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు నిలిపివేత

కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి బ్ర‌హ్మోత్స‌వాలు భ‌క్తుల స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌నున్నాయి.

Tirumala Srivari Brahmotsavam 2022 : రెండేళ్ల త‌ర్వాత.. భ‌క్తుల స‌మ‌క్షంలో తిరుమ‌ల శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాలు.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లు నిలిపివేత

Tirumala Srivari Brahmotsavam 2022 : కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు తిరుమలలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసారి తిరుమ‌ల‌ శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాలు భ‌క్తుల స‌మ‌క్షంలోనే జ‌ర‌గ‌నున్నాయి. క‌రోనా కార‌ణంగా 2020, 2021 సంవత్సరాల్లో భ‌క్తులు లేకుండా వెంక‌న్న బ్ర‌హ్మోత్స‌వాల‌ను ఏకాంతంగా నిర్వ‌హించింది తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానం (టీటీడీ).

అయితే క‌రోనా వ్యాప్తి బాగా త‌గ్గిన నేప‌థ్యంలో ఈ ఏడాది శ్రీవారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను భ‌క్తుల స‌మ‌క్షంలో వైభవంగా నిర్వ‌హించేందుకు రంగం సిద్ధం చేసింది. రెండేళ్ల తర్వాత భక్తుల సమక్షంలో మాఢ వీధుల్లో ఉత్సవాలు జరగనున్నాయి. ఈ ఏడాది భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని అంచనా వేసిన టీటీడీ.. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది. బ్ర‌హ్మోత్స‌వాల‌కు సంబంధించిన షెడ్యూల్‌ను టీటీడీ విడుద‌ల చేసింది.

బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభం కావ‌డానికి ముందుగా ఈ నెల 20న ఉద‌యం 6 గంట‌ల నుంచి 11 గంట‌ల వ‌ర‌కు శ్రీవారి ఆల‌యంలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా కోయిల్ అళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. అనంత‌రం ఈ నెల 26న బ్ర‌హ్మోత్స‌వాలకు అంకురార్ప‌ణ జ‌ర‌గ‌నుండ‌గా.. ఈ నెల 27 నుంచి అక్టోబ‌ర్ 6 వ‌ర‌కు 9 రోజుల పాటు వివిధ రూపాల్లో వివిధ వాహ‌న సేవ‌ల్లో శ్రీవారు మాడ వీధుల్లో భ‌క్తుల‌కు ద‌ర్శ‌నం ఇవ్వ‌నున్నారు. ఇదే సమయంలో పెరటాసి మాసం ప్రారంభం కానుంది. దీంతో తమిళనాడు నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని టీటీడీ అంచనా వేసింది.

ఈ నెల 27న ఏపీ సీఎం జగన్ రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. అన్ని రోజులు వాహన సేవలను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో రోజూ లక్షమందికిపైగా భక్తులు దర్శనానికి వస్తుంటారు. గరుడ సేవ రోజున ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది.

ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాల సమయంలో ఆర్జిత సేవలు రద్దు చేస్తుంటారు. దీంతో పాటు వృద్ధులు, వికలాంగులు, చంటి పిల్లల తల్లిదండ్రులు, శ్రీవారి ట్రస్ట్ సేవల భక్తులకు ప్రత్యేక ప్రవేశ దర్శనం నిలిపివేస్తుంది టీటీడీ. ఈ దఫా టీటీడీ మరో అడుగు ముందుకేసింది. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను కూడా నిలిపివేసింది. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది టీటీడీ.

శ్రీవారి సాల‌క‌ట్ల బ్ర‌హ్మోత్స‌వాల్లో వాహ‌న సేవ‌ల వివ‌రాలు..
సెప్టెంబ‌ర్ 26-బ్ర‌హ్మోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ‌
సెప్టెంబ‌ర్ 27-ధ్వ‌జారోహ‌ణం, పెద్ద శేష వాహ‌న సేవ‌
సెప్టెంబ‌ర్ 28-చిన్న శేష వాహ‌నం, స్న‌ప‌న తిరుమంజ‌నం, హంస వాహ‌న సేవ‌
సెప్టెంబ‌ర్ 29-సింహ వాహ‌న సేవ‌, ముత్య‌పు పందిరి వాహ‌న సేవ‌
సెప్టెంబ‌ర్ 30-క‌ల్ప‌వృక్ష వాహ‌న సేవ‌, స‌ర్వ భూపాల వాహ‌న సేవ‌
అక్టోబ‌ర్ 01-మోహిని అవ‌తారంలో స్వామి వారి ద‌ర్శ‌నం, గ‌రుడ వాహ‌న సేవ‌
అక్టోబ‌ర్ 02-హ‌నుమంత వాహ‌న సేవ‌, గ‌జ వాహ‌న సేవ‌
అక్టోబ‌ర్ 03-సూర్యప్ర‌భ వాహ‌న సేవ‌, చంద్ర‌ప్ర‌భ వాహ‌న సేవ‌
అక్టోబ‌ర్ 04-ర‌థోత్స‌వం, అశ్వ వాహ‌న సేవ‌
అక్టోబ‌ర్ 05-చ‌క్ర‌స్నానం, ధ్వ‌జావ‌రోహ‌ణం