రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

  • Published By: murthy ,Published On : November 19, 2020 / 08:30 PM IST
రేపటి నుంచి తుంగభద్ర పుష్కరాలు ప్రారంభం

Tungabhadra Pushkaram starts tomorrow :  నవంబర్ 20 నుంచి  డిసెంబర్ 1 వరకు తుంగభద్ర పుష్కరాలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో పుష్కరాలను విజయవంతం చేయడానికి జోగులాంబ‌- గ‌ద్వాల్ జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. రేపటి నుంచి 12 రోజుల పాటు పుష్కరాలను నిర్వ‌హించ‌నున్నారు.

నవంబర్ 20వతేదీ శుక్రవారం మధ్యాహ్నం 1.23 గంటలకు ప్రారంభం కానున్న తుంగ‌భ‌ద్ర పుష్క‌రాల్లో అలంపూర్ ‌ ఘాట్‌ వద్ద తొగుట పీఠాధిపతి మాధవనంద స్వామి, హిందూ దేవాలయ ప్రతిష్టాన్ పీఠాధిపతి కమలానంద భారతి స్వామిజీ శాస్త్రోక్తంగా ఈ పుష్క‌రాల‌ను ప్రారంభించ‌నున్నారు. తొలి రోజు (శుక్రవారం) పుష్కరాల్లో  దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిరంజ‌న్ రెడ్డి, ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొననున్నారు.



కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కరోనా మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేసిన‌ట్లు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. తుంగభద్ర పుష్కరాల నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.2.50 కోట్లను విడుదల చేసింద‌ని మంత్రి చెప్పారు.

పుష్కరాల సందర్భంగా పితృ దేవతలకు పిండ ప్రదానం చేసేందుకు 100 మందికి   పైగా పురోహితులను ఎంపిక చేసి, వారికి గుర్తింపు కార్డులను అందజేశామ‌న్నారు. పిండ ప్రదానం, తదితర కార్యక్రమాలకు రేట్లను దేవాదాయ శాఖ నిర్ణ‌యించింద‌ని, ఆ వివరాలను వీటి కోసం కేటాయించిన షెడ్ల వద్ద ప్రదర్శించనున్న‌ట్లు పేర్కొన్నారు.



పుష్కర ఘాట్లకు సమీపంలోని ఆలయాల్లో దర్శనాలకు ఇబ్బంది లేకుండా ఉమ్మ‌డి మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాకు చెందిన ప్ర‌త్యేక అధికారులు, దేవాదాయ శాఖ సిబ్బందిని విధుల్లో నియమించార‌న్నారు.

పుష్కర ఘాట్లలో థర్మల్ స్క్రీనింగ్ తర్వాతే భక్తులను  లోపలికి అనుమతిస్తామని….సోషల్ డిస్టెన్స్ మెయిన్ టెయిన్ చేయటం…. మాస్కులు ధరించడం తప్పనిసరి అని మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి తెలిపారు. ఈ 12 రోజుల పాటు ఉద‌యం 6 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కే పుష్క‌రాల నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తిస్తున్న‌ట్లు ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.



ప‌దేళ్ల లోపు పిల్ల‌లు, గ‌ర్భిణీలు, 65 ఏళ్ల పైబ‌డిన ‌వారు పుష్క‌రాల‌కు రావొద్ద‌ని సూచించింది. క‌రోనా నెగిటివ్ రిపోర్టుతో వ‌చ్చిన వారినే  పుష్క‌ర ‌ఘాట్ల‌లోకి అనుమ‌తించ‌నున్నారు. టెస్టు రిపోర్టు లేకుండా వ‌చ్చే వారికి థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ అనంత‌రం అనుమ‌తి ఇవ్వ‌నున్నారు. క‌రోనా ల‌క్ష‌ణాలు ఉన్న వారికి పుష్క‌ర‌ఘాట్ల‌కు అనుమ‌తి నిరాక‌రించ‌నున్నారు.



పుష్క‌ర‌ఘాట్లు, ఆల‌య ప్ర‌వేశ ద్వారాల వ‌ద్ద శానిటైజ‌ర్లు, థ‌ర్మ‌ల్ స్ర్కీనింగ్ త‌ప్ప‌ని స‌రిగా ఉంచ‌నున్నారు. మాస్కు ధ‌రించ‌డం, ఆరు అడుగుల భౌతిక దూరం పాటించటం త‌ప్ప‌నిస‌రి చేసింది ప్రభుత్వం. కొవిడ్ నిబంధ‌న‌ల‌కు లోబ‌డి పుష్క‌ర స్నానాల‌కు అనుమ‌తి ఇవ్వ‌నున్నారు.