Ugadi 2023 : ఉగాది పండుగ విశిష్టత .. ఉగాది పచ్చడి ప్రాముఖ్యత

ప్రకృతిమాత వసంతరుతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటుంది. ఉగాది పండగతో వసంత రుతువు ఆరంభం అవుతుంది. అటువంటి ఉగాది పండుగ విశిష్టత గురించి ఉగాది పచ్చడి ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం..

Ugadi 2023 : వసంతం ప్రతీ చెట్లు పచ్చని చిగుర్లతో కళకళలాడే రుతువు. రుతువుల్లో ఆఖరి రుతువు ‘శిశిరం’లో చెట్ల ఆకులు రాలిపోతాయి. వసంత రుతువుతో చెట్లన్నీ చిగురిస్తాయి. దీంతో ఎక్కడ చూసినా పచ్చదనమే కనిపిస్తుంది. ప్రకృతిమాత వసంతరుతువు ఆగమనంతో పచ్చటి చీర చుట్టుకుంటుంది. ఉగాది పండగతో వసంత రుతువు ఆరంభం అవుతుంది. చెట్లు చిగురించి పూవులు పూయు కాలం. ఋతువుల రాణీ వసంతకాలం. వసంత ఋతువు అనగా ఉత్తర అమెరికా ఆంగ్లంలో పతనం అని కూడా పిలుస్తారు. తెలుగు నెలలైన చైత్ర, వైశాఖ మాసాలు వసంతరుతువు కనువిందు చేస్తుంది. ఆ తరువాత రుతువు మారుతుంది. వసంత రుతువు తరువాత గ్రీష్మ రుతువు వస్తుంది.ఇలా కాల చక్రంలో ఆరు రుతువులు ఈ పర్యావరణాన్ని నడిపిస్తుంటాయి.

ఉగాది పండుగతో గొప్ప వసంత రుతువు ఆగమం ఆరంభమవుతుంది. ఉగస్య ఆది అనేదే ఉగాది. “ఉగ” అనగా నక్షత్ర గమనం – జన్మ – ఆయుష్షు అని అర్థాలు. వీటికి ‘ఆది’ అనగా మొదలు ‘ఉగాది’. అనగా ప్రపంచం జన్మ ఆయుష్షులకు మొదటిరోజు కనుక ఉగాది అయింది. ఇంకొకవిధంగా చెప్పాలంటే, ‘యుగం’ అనగా రెండు లేక జంట అని కూడా అర్ధం. ఉత్తరాయణ, దక్షిణాయనములనబడే ఆయన ద్వయ సంయుతం ‘యుగం’ (సంవత్సరం) కాగా, ఆ యుగానికి ఆది యుగాది అయింది. అదే సంవత్సరాది. ఉగాది – వసంతాలకు గల అవినాభావ సంబంధం, సూర్యునికి సకల ఋతువులకు ప్రాతః సాయం కాలాది త్రికాలములకు ఉషాదేవతయే మాతృస్వరూపం. భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్ర శుక్ల పాడ్యమి నాడే అనగా ఉగాది రోజున సృష్టి జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది.

Ugadi 2023 : ‘ఉగాది’ ఏ రాష్ట్రంలో ఏ పేరుతో జరుపుకుంటారో తెలుసా?

వేదాలను హరించిన సోమకుని వధించి మత్స్యావతారిధారియైన విష్ణువు వేదాలను బ్రహ్మకప్పగించిన శుభతరుణ పురస్కారంగా విష్ణువు ప్రీత్యర్ధం ‘ఉగాది’ ఆచరణలోకి వచ్చెనని పురాణ ప్రతీతి. చైత్ర శుక్ల పాడ్యమి నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడు కనుక సృష్టి ఆరంభించిన సంకేతంగా ఉగాది జరుప బడుతుందని కూడా చెప్పబడుతుంది. శాలివాహన చక్రవర్తి చైత్ర శుక్ల పాడ్యమి నాడే పట్టాభిషిక్తుడై తన శౌర్యపరాక్రమాలతో శాలివాహన యుగకర్తగా భాసిల్లిన కారణాన ఆ యోధాగ్రని స్మృత్యర్థం ఉగాది ఆచరింపబడుతుందని చారిత్రక వృత్తాంతం. ఏది ఏమైనా జడప్రాయమైన జగత్తులో చైతన్యాన్ని రగుల్కొల్పి మానవాళిలో నూతనాశయాలను అంకురింపచేసే శుభదినం ‘ఉగాది’

ఉగాది రోజు నుండే తెలుగు సంవత్సరం మొదలవుతుంది కాబట్టి ఇది తెలుగువారి మొదటి పండుగ. ఉగాది రోజున కొత్తగా పనులు ప్రారంభించుట పరిపాటి. ఆ రోజున ప్రాతః కాలమున లేచి ఇళ్లు, వాకిళ్లు, శుభ్ర పరచుకుంటారు. ఇంటి గుమ్మాలకు మామిడి తోరణాలు కట్టి అలంకరిస్తారు.తలంటి స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి, ఉగాది పచ్చడితో దినచర్య ప్రారంభిస్తారు.

“ఉగాది పచ్చడి” ప్రాముఖ్యత..
“ఉగాది పచ్చడి” ఈ పండుగకు ప్రత్యేకమైంది. అత్యంత ముఖ్యమైనది. షడ్రుచుల సమ్మేళనం – తీపి (మధురం), పులుపు (ఆమ్లం), ఉప్పు (లవణం), కారం (కటు), చేదు (తిక్త), వగరు (కషాయం) అనే ఆరు రుచులు కలసిన ఉగాది పచ్చడి తెలుగువారికి ప్రత్యేకం. సంవత్సరం పొడుగునా ఎదురయ్యే మంచి చెడులను, కష్ట సుఖాలను సంయమనంతో స్వీకరించాలన్న సందేశాన్ని ఉగాది పచ్చడి మనకు తెలియజేస్తుంది.. ఈ పచ్చడి కొరకు చెరకు, అరటి పళ్ళు, మామిడి కాయలు, వేప పువ్వు, చింతపండు, జామకాయలు, బెల్లం మొదలగునవి వాడుతుంటారు. ఇలా ఈ షడ్రుచుల మేళవింపుగా ఉన్న ఈ పచ్చడి తింటే చక్కటి ఆరోగ్యంతో ఉంటారు. ఆయా కాలాలను బట్టి ఆయా ఆహారాలు తినే సంప్రదాయం మన భారతీయకులకు మాత్రమే ప్రత్యేకమని నిరూపించే పండుగల్లో ‘ఉగాది’పండుగ అత్యంత శ్రేష్టమైనది. ఆరోగ్యకరమైనది, ప్రత్యేకమైనది విరాజిల్లుతోంది.

 

ట్రెండింగ్ వార్తలు