Ugadi Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు.

Ugadi Asthanam : తిరుమల శ్రీవారి ఆలయంలో వైభ‌వంగా ఉగాది ఆస్థానం

Ugadi Asthanam Tirumala

Ugadi Asthanam :  తిరుమల శ్రీవారి ఆలయంలో శ‌నివారం శ్రీ శుభ‌కృత్‌నామ సంవత్సర ఉగాది ఆస్థానం వైభ‌వంగా జరిగింది.ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతం అనంతరం శుద్థి నిర్వహించారు. ఆ తరువాత శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి, విష్వక్సేనుల వారికి విశేష సమర్పణ చేశారు. విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా ఆలయంలోనికి ప్రవేశించారు. ఆ తరువాత శ్రీవారి మూలవిరాట్టుకు మరియు ఉత్స‌వ‌మూర్తులకు నూతన వస్త్రాలను ధరింపచేశారు. అనంతరం పంచాంగ శ్రవణం జరిగింది. బంగారు వాకిలి వ‌ద్ద‌ ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా ఉగాది ఆస్థానం నిర్వహించారు.

అనంత‌రం టిటిడి ఛైర్మ‌న్ శ్రీ వై.వి.సుబ్బారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ దేశ, విదేశాల‌లో ఉండే తెలుగు ప్ర‌జ‌ల‌కు శ్రీ శుభ‌కృత్‌నామ నూతన సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. శ్రీ‌వారి ఆనుగ్ర‌హంతో క‌రోనా మ‌హ‌మ్మారి నుండి బ‌య‌ట‌ప‌డి దేశ వ్యాప్తంగా సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నాయ‌ని ఆయన చెప్పారు. రాబోవు రోజుల్లో ఇలాంటి ప్ర‌మాదాలు లేకుండా లోకంలోని మాన‌వాళిని కాపాడాల‌ని శ్రీ‌వారిని ప్రార్థించిన‌ట్లు తెలిపారు.

ఈ నూత‌న సంవ‌త్స‌రంలో ప్ర‌జ‌లంద‌రు ఆయురారోగ్యాల‌తో, సుఖ‌సంతోషాల‌తో, సిరిసంప‌ద‌ల‌తో ఉండాల‌ని ఆకాంక్షించారు. ఈ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి గౌ.శ్రీ పెర్నివెంక‌ట‌రామ‌య్య, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి దంప‌తులు, పలువురు బోర్డు స‌భ్యులు, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్వర్యంలో ఆలయం లోపల ఆపిల్‌, ద్రాక్ష, బత్తయి, సపోటా, నారింజ, కర్బూజ, మామిడి, చెరకు వంటి విభిన్న రకాల పండ్ల గుత్తులు, అపురూపమైన ఉత్తమజాతి పుష్పాలతో భూలోక వైకుంఠంగా శ్రీవారి ఆలయాన్ని ఆకర్షణీయంగా రూపొందించారు. శ్రీవారి ఆలయంలో ధ్వజస్థంభం చెంత శ్రీలంక ఆర్ట్‌తో చేసిన అలంక‌ర‌ణ‌లు, పుచ్చకాయలతో ఆకర్షణీయంగా చెక్కిన శ్రీప‌ద్మావ‌తి శ్రీ‌నివాసుల క‌ల్యాణ ఘ‌ట్టం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Also Read : Ugadi Celebration : ప్రగతి భవన్‌‌లో ఉగాది వేడుకలు.. కేసీఆర్ ఛలోక్తులు

న‌వ‌ధాన్య‌ల‌తో చెసిన శ్రీ‌మ‌హావిష్ణువు, శ్రీ‌రాముడి సెట్టింగ్‌లు భ‌క్తుల‌ను ఆక‌ర్షించాయి. అదేవిధంగా ఆలయం బయట వివిధ రకాల పుష్పాలతో అశ్వాలు, త్రేత‌, ద్వాప‌ర‌, క‌లియుగాల‌కు సంబంధించిన వివిధ స‌న్నివేశాల సెట్టింగులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆలయం బ‌య‌ట‌ భక్తులు తమ చరవాణిలలో ఫలపుష్ప ఆకృతులతో ఫోటోలు దిగుతూ ఉల్లాసంగా గడిపారు. టిటిడి గార్డెన్ సూప‌రింటెండెంట్ శ్రీ‌శ్రీ‌నివాసులు ఆధ్వ‌ర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వ‌చ్చిన 150 మంది పుష్పాలంక‌ర‌ణ క‌ళాకారులు మూడు రోజుల పాటు శ్ర‌మించి ఆక‌ర్ష‌ణీయ‌మైన ఫల – పుష్ప ఆకృతులను రూపొందించారు.