తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి, తిరుమలకు పలువురు ప్రముఖులు

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి, తిరుమలకు పలువురు  ప్రముఖులు

Vaikuntha Ekadashi In Telugu States : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి శోభ మొదలైంది. వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని వైష్టవ ఆలయాలు అంగరంగ వైభవంగా ముస్తాబయ్యాయి. చలిని సైతం లెక్క చేయకుండా ఆలయాలకు తరలివచ్చారు భక్తులు. ఉత్తర ద్వార దర్శనం కోసం ఆలయాలకు బారులు తీరుతున్నారు. గోవిందా, నమో నారాయణాయ..నామాలతో ఆలయాలు మార్మోగుతున్నాయి. భక్తుల ప్రత్యేక పూజలతో ఆలయాల వద్ద సందడి నెలకొంది.

తెలంగాణాలో :-
భద్రాచలం రాములోరి ఆలయం, యాదాద్రి లక్ష్మినరసింహస్వామి టెంపుల్, వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం, ధర్మపురి లక్ష్మినరసింహస్వామి దేవస్థానంతో పాటు తెలంగాణలో ప్రముఖ ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేశారు. భద్రాద్రిలో గరుడ వాహనంపై రామయ్య, సీతమ్మ, హనుమంత వాహనంపై లక్ష్మణుడు దర్శనం ఇస్తున్నారు. యాదాద్రిలోని బాలలయంలో స్వామివారు తూర్పు ద్వారం, పాతగుట్టలో ఉత్తర ద్వారా స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. విద్యుత్ దీపాలతో పాటు పూలతో ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు.

ఏపీలో :-
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం, పంచారామం, తిరుమల ఆలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. వైష్ణవ ఆలయాలల్లో హోమాలు, ప్రవచనాలు నిర్వహిస్తున్నారు భక్తులు. వేలాది దేవాలయాలు ఉదయం మూడు గంటలకే తెరుకుచున్నాయి. వైకుంఠ ఏకాదశి రోజున చిత్తశుద్ధితో ఉపవాసం, జాగరణ, పుజాధికారాలు జరిపితే… ఆ ఏడాదంత మనశ్శాంతిగా, సమస్యలు లేకుండా, ఆరోగ్యం, ఆనందంగా బతుకుతారని ఆధ్యాత్మిక వాదులు విశ్వసిస్తారు.

తిరుమల కొండపై :-
తిరుమల కొండపై వైకుంఠ ఏకాదశి సందడి నెలకొంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సరిగ్గా 12 గంటల 5 నిమిషాలకు వైకుంఠ ద్వారం తెరుచుకుంది. తిరుమల చరిత్రలో మొదటిసారిగా పది రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుండటంతో భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. అయితే కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా రోజుకు 35 వేల మంది భక్తులకే దర్శనం చేయించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు.

ఏకాంతంగా సేవలు, వీఐపీ దర్శనాలు :-
12 గంటల 5 నిమిషాల నుంచి 4 గంటల వరకు తిరుప్పావైతో శ్రీవారిని మేల్కొలిపి ఏకాంతంగా ధనుర్మాస కైంకర్యాలు, అభిషేకం, తోమాల, అర్చన సేవలను నిర్వహించారు. ఆ తర్వాత వీఐపీ దర్శనాలు మొదలుపెట్టారు. తిరుమల కొండపై టీటీడీ విద్యుత్‌శాఖ విభాగం అద్భుతమైన లైటింగ్‌ ఏర్పాట్లు చేసింది. ఉదయం ఆరు టన్నుల పుష్పాలతో శ్రీవారి ఆలయాన్ని అలంకరించారు. మరో నాలుగు టన్నులతో బయట ప్రాంతాల్లో అలంకరణ చేశారు.

శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు :-
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తిరుమలలో పలువురు ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న వారిలో టిటిడి పాలకమండలి సభ్యులు జూపల్లి రామేశ్వర్ రావు, తెలంగాణ మంత్రులు హరీష్ రావు, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, ఏపి మంత్రులు ఆదిమూలపు సురేష్‌, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి, అవంతి శ్రీనివాస్, సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి అరవింద్ బాబ్డే, కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఎంపిలు మిధున్ రెడ్డి, రెడ్డెప్ప, గోరంట్ల మాధవ్, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పలువురు ప్రముఖులు తిరుమలేషుడిని దర్శించుకున్నారు. ఇవాళ్టి నుంచి జనవరి 3వ తేదీ వరకూ రోజుకు ముప్పై వేల మంది భక్తులకు మాత్రమే దర్శనం కల్పిస్తామన్నారు టీటీడీ అధికారులు.