Vontimitta Kalyanam : వెన్నెల్లో రాములోరి కల్యాణం

శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు

Vontimitta Kalyanam : వెన్నెల్లో రాములోరి కల్యాణం

Vontimitta Kalyanam

Vontimitta Kodandarama Kalyanam :  శ్రీరాముని కల్యాణం పగలు జరగడంతో ఆ అపురూప దృశ్యాన్ని చూసే అదృష్టం లభించలేదని విచారిస్తున్న చంద్రునికి ఒంటిమిట్టలో జరిగే కల్యాణం తిలకించే అవకాశం కల్పిస్తానని రాముడు మాట ఇచ్చినట్లు పురాణ కథనం. పురాణ వేత్తల ప్రకారం వాల్మీకి రామాయణం బాలకాండ చివర సీతారాముల వివాహ ఘట్టం ఉంది. చైత్ర మాసంలో ఉత్తర ఫల్గుణి నక్షత్రంలో రాముడితోపాటు లక్ష్మణ , భరత , శత్రఘ్నల వివాహాలు కూడా జరిగాయి. అవన్నీ పగటిపూట జరిగాయి.

చరిత్ర ప్రకారం బుక్కరాయులు ఒంటిమిట్టలో ఈ బ్రహ్మోత్సవాలను ప్రారంభించాడు. ఉత్సవాల్లో భాగంగా శ్రీరామ కల్యాణోత్సవం నిర్వహించాలి. రామాయణంలో శ్రీరామచంద్రుని కల్యాణం జరిగిన నక్షత్రానికే ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలలో రామయ్య కల్యాణం నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నారు. అప్పట్లో ఉత్సవాల్లో తొలిసారిగా ఈ కల్యాణం నిర్వహించేందుకు తలపెట్టిన ఉత్తర ఫల్గుణి నక్షత్రం రాత్రి పూట వచ్చింది. లగ్నశుద్ది చూసుకుని బుక్కరాయలు రాత్రిపూటే తొలిసారిగా బ్రహ్మోత్సవాల్లో శ్రీ సీతారాముల కల్యాణోత్సవం నిర్వహించారు. ఆ సంప్రదాయమే నేటికీ కొనసాగుతుండడం విశేషం.

రాత్రి వేళ కల్యాణం జరగడంతో చంద్రునికి ఈ ఉత్సవాన్ని వీక్షించే భాగ్యం లభించింది. బుక్కరాయలు చంద్రవంశానికి చెందిన వారు. తమ వంశ మూల పురుషుడు చంద్రుడు చూస్తూ ఆనందిస్తుండగా శ్రీ సీతారామ కల్యాణ నిర్వహణ సంతోషాన్ని పొందేందుకు బుక్కరాయలు రాత్రి కల్యాణాలను ఆ తర్వాత కూడా కొనసాగించారు.

కమనీయం.. ఎదుర్కోలు ఉత్సవం
ఒంటిమిట్ట కోదండ రామాలయంలో నవమి వేడుకలు ముగిసిన తరువాత పౌర్ణమి రోజు రాత్రి పండు వెన్నెల్లో జానకి రాముల పరిణయ ఘట్టాని అట్టహాసంగా నిర్వహించడం తరతరాలుగా ఆనవాయతీగా వస్తోంది. పెళ్లికి ముందు సద్గుణ సంపన్నుడైన కళ్యాణరాముడు, లోకోత్తమ సౌందర్యవతి సీతమ్మను అందంగా ముస్తాబు చేస్తారు. కోదండ రామాలయంలో రెండు చిన్న మండపాలు ఉన్నాయి. వీటిని ఎదుర్కోలు మంటపాలని పిలుస్తారు.

కళ్యాణం రోజు ఈ రెండు మంటపాలను సుందరంగా ముస్తాబు చేస్తారు. పడమర వైపున్న మండపంలో రామయ్య, తూర్పున ఉన్న మండపంలో సీతమ్మను కొలువుదీర్చి ఎదుర్కోలు కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహిస్తారు. ఆ తరువాత కల్యాణ వేదికపై కల్యాణం నిర్వహిస్తారు. కాగా ఈ ఆలయం టీటీడీలోకి విలీనమైంది. 2016 నుంచి ఒంటిమిట్ట శివారులో నిర్మించిన కల్యాణ వేదిక ప్రాంగణంలో సీతారాముల పరిణయ ఘట్టాన్ని నిర్వహిస్తున్నారు. ఎదుర్కోలు కార్యక్రమాన్ని కూడా ఇక్కడే చేపడుతున్నారు.