Ganesh Idol is Immersed : గణేషుడ్నే ఎందుకు నిమజ్జనం చేస్తారు ?

గణేష్ నిమజ్జనమే ఎందుకు చేస్తారు. 9 రోజుల పాటు పూజించిన విగ్రహాన్ని ఆఖరున నిమజ్జనం చేయటం ఎందుకు ? చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది.

10TV Telugu News

Ganesh Idol Is Immersed :  హిందువులు సాంప్రదాయబధ్ధంగా జరుపుకునే అతిపెద్ద పండుగలలో వినాయకచవితి ఒకటి. శ్రీరామ నవమి. గణేష్ నవరాత్రులు, శరన్నవరాత్రులు చూసుకుంటే ఒక గణేష్ నవ రాత్రులు జరిగాకే వినాయకుడ్ని నిమజ్జనం చేస్తారు. గణేష్ నిమజ్జనమే ఎందుకు చేస్తారు. 9 రోజుల పాటు పూజించిన విగ్రహాన్ని ఆఖరున నిమజ్జనం చేయటం ఎందుకు ? చాలామందికి ఈ సందేహం వస్తూ ఉంటుంది.

వినాయక చవితి ప్రతిఏటా భాద్రపద శుధ్ధ చవితినాడు వస్తుంది. కాలచక్రంలో జరిగి రుతుధర్మాను సారంగా ఆ సమయంలో ఎండలు తగ్గి బీటలు వారిన భూమి వర్షపు జల్లులతో ప్రాణశక్తిని పుంజుకుని పచ్చదనాన్ని సంతరించుకుంటుంది. పుష్పాలు విచ్చి పరిమళాలు వెదజల్లుతుంటాయి. నదులలో నీరు నిండి జీవనతత్వం అభివృద్ధి చెందుతుంది. బుధుడు అధిపతియైన హస్త… వినాయకుని జన్మనక్షత్రం. బుధగ్రహానికి ఆకుపచ్చని రంగంటే ఇష్టం. వినాయకునికి కూడా గడ్డిజాతి మొక్కలంటే ఇష్టం. అందుకే ఆయనకు గరికతోనూ, వివిధ ఆకులతోనూ పూజిస్తాం.

గణేష పూజకు ఒండ్రుమట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను మాత్రమే ఉపయోగించడంలో ఒక విశేషముంది. అదేమంటే ఆ కాలంలో జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టికోసం జలాశయాలలో దిగి మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లు అవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తీయడం, దానితో బొమ్మను చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రుమట్టిలో నానడం ఒంటికి మంచిదని ప్రకృతి చికిత్స వైద్యులు చెబుతారు. ప్రకృతి చికిత్సకు ఒండ్రుమట్టిని వాడటం మనకు తెలిసిందే.

అయితే పదిరోజుల పాటు పూజలు చేసిన వినాయక విగ్రహాన్ని పదకొండోరోజున మేళతాళాలతో జల నిమజ్జనం చేయడంలో ఒక వేదాంత రహస్యం ఉంది. పాంచ భౌతికమైన ప్రతి ఒక్క పదార్థం.. అంటే పంచభూతాల నుంచి జనించిన ప్రతి ఒక్క సజీవ, నిర్జీవ పదార్థమూ మధ్యలో ఎంత వైభవంగా, ఇంకెంత విలాసంగా గడిపినప్పటికీ అంతిమంగా మట్టిలో కలిసిపోవలసిందే. అందుకే ప్రకృతి దేవుడైన వినాయక విగ్రహాలను మట్టితోనే చేస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో పూజలు చేసి, నైవేద్యాలు సమర్పించి నీటిలో నిమజ్జనం చేస్తారు.

ఇంకో విశేషం ఏమిటంటే …. తొమ్మిది రోజుల పాటు వినాయక విగ్రహాన్ని, వివిధ రకాల పత్రాలతో పూజిస్తారు.గణపతికి చేసే షోడశోపచార పూజల్లో వాడే పత్రిని మనం తాకటం వల్ల కూడా వాటిలోని ఔషధ గుణాలు మనలోకి ప్రవేశిస్తాయి. వాటిమీద నుంచి వచ్చే గాలి కూడా విశేషమైనదే. తొమ్మిది రోజులు విగ్రహాన్నీ, పత్రాలనూ ఇంట్లో ఉంచడం వల్ల… ఇంట్లో గాలి ఔషధ గుణాల్ని పెంచుకుంటుంది. అది మనకు ఎంతో మేలుచేస్తుంది.. ఇంట్లో ఉంచుకున్న తర్వాత.. దగ్గరలో ఉన్న చెరువు, నది, లేదంటే బావిలో నిమజ్జనం చేస్తారు. అందుకు తగ్గట్టే.. వర్షాకాలం కావడంతో నదులు, చెరువులూ నిండుగా కళకళలాడుతూ ఉంటాయి. ఇటీవల సముద్రాల్లో నిమజ్జనం చేసే సంస్కృతి కూడా ఎక్కువగా కనిపిస్తోంది. మట్టి విగ్రహాల్నీ, పత్రిని నీటిలో నిమజ్జనం చెయ్యడం ద్వారా నీటిలో ఉండే క్రిమి కీటకాలు చనిపోతాయి.