Yadadri Temple : స్వర్ణ కాంతులతో వెలిగిపోతున్న యాదాద్రి ఆలయం

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు.

Yadadri Temple : స్వర్ణ కాంతులతో వెలిగిపోతున్న యాదాద్రి ఆలయం

Yadadri Temple

Yadadri Temple : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యాదాద్రి ఆలయం పునర్మిర్మాణ పనులు శరవేగంతో జరుగుతున్నాయి. అధికారులు పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తిచేస్తున్నారు. శనివారం సాయంత్రం ప్రధానాలయానికి సరికొత్త హంగులతో విద్యుత్ దీపాలంకరణ ట్రయల్ రన్ నిర్వహించారు. ఆలయ ఆర్కిటెక్ట్ ఆనంద్ సాయి పర్యవేక్షణలో విద్యుత్ దీపాల అలంకరణ చేశారు.

విద్యుత్ దీప కాంతులలో లక్ష్మిన‌రసింహ స్వామి ఆల‌యం స్వ‌ర్ణ‌కాంతుల‌తో విరాజిల్లుతోంది. జిగేల్ మనే స్వర్ణ కాంతులుతో వెలుగొందుతున్న ఆలయ ప్రాంగణం, గోపురాలు, మండపాలను చూసి స్ధానికులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ఆలయ సుందర దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించేందుకు ఆసక్తి చూపించారు.

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయం చోళ, కాకతీయ, పల్లవ శిల్ప కళాకృతులతో… మరెక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. దశాబ్దాల తరబడి రాతి చెక్కడాలు జరగాల్సిన పనులను కేవలం నాలుగేళ్లలో పూర్తి చేశారు. ప్రధాన ఆలయాన్ని 2.33 ఎకరాల విస్తీర్ణంలో ఆగమ,శిల్ప వాస్తు శాస్త్రాల ప్రకారం సంపూర్ణంగా కృష్ణ శిలతో రూపొందించారు.

దాదాపు 2.5 లక్షల టన్నుల నల్లరాతితో అష్ట భుజ మండప ప్రాకారాలు, కాకతీయ కళా రూపాలు, యాలి స్తూపాలు రూపొందించారు. అష్టలక్ష్మి రూపాలతో సాలహారాలు, ఆళ్వారుల విగ్రహాలు, ప్రహ్లాద చరితం… ఉప ఆలయాలతో భక్త జనులను మైమరిపించేట్లు యాదాద్రిశుడి సన్నిధి ఆధ్యాత్మిక నిలయంగా మారింది. మాడ వీధులతో 4.3 ఎకరాల విస్తీర్ణంలో ఆలయ ప్రాంగణం రూపొందింది.

నలువైపులా ఆరు రాజ గోపురాలు నిర్మించారు. ఆలయ వాస్తు నిర్మాణ శాస్త్రంలో 16 రకాల గోపురాలుంటే వాటిలో మూడు రకాల గోపురాలు ఒకే ఒక్క యాదాద్రి బృహద్ధాలయంలో ఉన్నాయి. ఈ గోపురాలపై మహావిష్ణువుకు సంబంధించిన 257 విగ్రహాలను పొందు పరిచారు. ఆలయ తొలి ప్రాకారంలో నలువైపులా 93 సాలహారాలు, రెండవ ప్రాకారంలో 52, మాడ వీధిలో 96 సాలహారాలను దేవత మూర్తులు, అష్టలక్ష్మి దేవి రూపాలతో తీర్చిదిద్దుతున్నారు.