చెత్త రికార్డు మూట గట్టుకున్న సంజూ శాంసన్

చెత్త రికార్డు మూట గట్టుకున్న సంజూ శాంసన్

భారత్‌తో తలపడిన శ్రీలంక ఆడిన మూడు టీ20ల సిరీస్‌ను కోల్పోయింది. పూణె వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో కోహ్లీసేన 78పరుగుల తేడాతో విజయాన్ని దక్కించుకుంది. మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎంసీఏ) స్టేడియం వేదికగా సంజూ శాంసన్ కెరీర్ లో చెత్త రికార్డు నమోదైంది. రెండు సంవత్సరాలుగా టీమిండియాలో చోటు కోసం ఎదురుచూస్తున్న సంజూకు ఇన్నేళ్లకు కల నెరవేరింది. 
 
కొంతకాలంగా పలు సిరీస్‌ల కోసం బృందంలో చోటు దక్కించుకుంటున్నాడే కానీ, తుది జట్టులో పేరు సంపాదించుకోలేకపోతున్నాడు. టీ20 ప్రపంచకప్ 2020 సమీపిస్తున్న తరుణంలో టీమిండియా మేనేజ్‌మెంట్ ప్లేయర్ల బలాబలాలను బేరీజు వేయాలని భావించింది. ఈ క్రమంలోనే సంజూని జట్టులోకి తీసుకుంది. 

ఈ గ్యాప్‌లో శాంసన్ 73 టీ20లు ఆడే అవకాశం కోల్పోయాడు. ఫలితంగా భారత్ తరఫున అత్యధిక టీ20లకు దూరమైన ఆటగాడిగా చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో మూడు మార్పులు చేసింది. శివమ్ దూబే, రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్‌ల స్థానంలో మనీశ్ పాండే, సంజూ శాంసన్, యుజవేంద్ర చాహల్‌లు జట్టులోకి వచ్చారు. 

ఈ మ్యాచ్‌లో తడబడిన శాంసన్ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వన్ డౌన్ లో దిగి.. దూకుడుగా ఆడే ప్రయత్నంలో తొలి బంతికే సిక్సు బాదిన శాంసన్.. లంక బౌలర్ హసరంగా వేసిన రెండో బంతికి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.