72 ఏళ్ల కల సాకారం : సిరీస్ భారత్ వశం…

  • Published By: madhu ,Published On : January 7, 2019 / 04:10 AM IST
72 ఏళ్ల కల సాకారం : సిరీస్ భారత్ వశం…

సిడ్నీ : ఎప్పడూ మీరే గెలుస్తారా ? మేము గెలవవద్దా ? ఆసీస్ గడ్డపై భారత్ విజయం ఎప్పుడు సాధిస్తుందా ? అనే భారతీయ క్రీడాభిమానుల కలలు ఫలించాయి. 72 ఏళ్ల కల సాకారమైంది…ఆసీస్ గడ్డపై భారత్ విజయం సాధించింది. 2-1 తేడాతో సిరీస్‌ని కోహ్లీ టీం వశం చేసుకుంది. ఆసీస్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ చివరకు డ్రా అయ్యింది. వర్షం కారణంగా ఐదో రోజు ఆట రద్దయ్యింది. 4 టెస్టుల సిరీస్‌ని భారత్ 2-1 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై తొలిసారి భారత్ టెస్టు సిరీస్ విజయం సొంతం చేసుకున్నట్లైంది. ఆస్ట్రేలియాలో ఆడిన 47 టెస్టుల్లో భారత్ కేవలం 7 విజయాలు మాత్రమే దక్కించుకుంది. 
కలిసికట్టుగా రాణించిన భారత క్రీడాకారులు…
టీమిండియాలో క్రీడాకారులందరూ రాణించడంతో ఈ కల సాకారమైందని చెప్పవచ్చు. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 193 కీలక ఇన్నింగ్స్ ఆడాడు. నేనేం తక్కువ తినలేదంటూ పంత్ 159 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. సిడ్నీ టెస్టులో భారత వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఆస్ట్రేలియాపై సరికొత్త రికార్డును సృష్టించాడు. అగర్వాల్ (77), జడేజా (81) బ్యాట్ ఝులిపించడం…ఇతర బ్యాట్ మెన్స్ సహకారంతో భారత్ 7 వికెట్లు కోల్పోయి 622 పరుగుల భారీ స్కోరు చేసింది. అనంతరం డిక్లేర్డ్ చేసింది. 
చుక్కలు చూపించిన కుల్‌దీప్ యాదవ్…
అనంతరం బ్యాటింగ్‌‌కు దిగిన ఆసీస్ బ్యాట్స్ మెన్స్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ప్రధానంగా కుల్ దీప్ యాదవ్ తన బౌలింగ్‌తో మాయ చేసేశాడు. ప్రధాన బ్యాట్ మెన్స్‌ని అవుట్ చేసి కంగారుల తోక కట్ చేశాడు. ఇతర బౌలర్లు కూడా రాణించడంతో ఆసీస్ చేతులెత్తేసింది. కేవలం 300 పరుగులకే ఆలౌట్ అయ్యింది. కుల్ దీప్ యాదవ్ 5 వికెట్లు తీయగా షమీ, జడేజాలు చెరో 2 వికెట్లు…బుమ్రా ఒక వికెట్ తీశారు. 
మూడు దశాబ్దాల తరువాత ఫాలో ఆన్…
322 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం సాధించిన టీమ్‌ ఇండియా….ఆస్ట్రేలియాకు ఫాలోఆన్‌ విధించింది. అతిథ్య జట్టును మూడు దశాబ్దాల తర్వాత ఫాలోఆన్‌ ఆడించిన ఘనత భారత్ దక్కించుకుంది. 4ఓవర్లు ఆడిన ఆస్ట్రేలియా 6/0తో ఉంది. కానీ వెలుతురు సమస్య కారణంగా నాలుగో రోజు ఆట నిలిచిపోయిది. అప్పటికి ఓపెనర్లు ఉస్మాన్‌ ఖవాజ (4), మార్కస్‌ హరీస్‌ (2)లు క్రీజులో ఉన్నారు. ఇక ఐదో రోజు వర్షం అడ్డంకిగా నిలిచింది. ఎడతెరపి లేకుండా వర్షం పడుతుండడంతో అంపైర్లు నాలుగో టెస్టు డ్రాగా ప్రకటించారు. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌..ప్లేయర్ ఆఫ్ ద సిరీస్‌గా పుజారా నిలిచాడు. 
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : 622/7 డిక్లేర్డ్‌.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : 300 ఆలౌట్.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ (ఫాలోఆన్) 6/0. వర్షంతో ఆట నిలిపివేత