T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం నుంచి ఆడుతున్న తెలుగు కుర్రాడు

భారత జట్టులో ఆడాలని కలలు కన్న ఓ హైదరాబాదీ కుర్రాడు.. మన తెలుగువాడు..

T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో వేరే దేశం నుంచి ఆడుతున్న తెలుగు కుర్రాడు

Oman

T20 World Cup 2021: భారత జట్టులో ఆడాలని కలలు కన్న ఓ హైదరాబాదీ కుర్రాడు.. మన తెలుగువాడు.. గల్ఫ్‌లోని ఓ దేశానికి వరల్డ్ కప్‌లో ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అతనే హైదరాబాదీ ఆల్‌ రౌండర్, ఒమన్‌ దేశ క్రికెటర్‌ శ్రీమంతుల సందీప్‌ గౌడ్‌! క్రికెట్ అంటే ప్రాణంగా భావించే సందీప్ గౌడ్.. టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఆడబోతున్నాడు.

హైదరాబాద్ కవాడీగూడకు చెందిన 29ఏళ్ల సందీప్ గౌడ్ ఒమన్-పపువా న్యూ గినియా మధ్య జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో ఒమన్ జట్టు తరపున ఆడబోతున్నాడు. 2016లో ఉద్యోగం కోసం ఒమన్ వెళ్లిన సందీప్ అక్కడే స్థిరపడి దేశవాళీ మ్యాచుల్లో ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే సందీప్‌కి జాతీయ జట్టులో అవకాశం లభించింది. సందీప్ 2005-08 మధ్య హైదరాబాద్ అండర్-15, 19 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు.

ఉద్యోగరిత్యా వేరే దేశానికి వెళ్లినా క్రికెటర్ అవ్వాలనే తన లక్ష్యానికి తగ్గట్లుగానే అడుగులు వేస్తూ ఒక్కో మెట్టు ఎదిగి అవకాశం దొరికినప్పుడల్లా రాణించి జాతీయ క్రికెటర్ అయ్యాడు. దిగ్గజ బ్యాట్స్‌మన్, భారత మాజీ కెప్టెన్‌ మొహమ్మద్‌ అజహరుద్దీన్‌ చదివిన ఆల్‌ సెయింట్స్‌ హైస్కూల్‌ విద్యార్థి సందీప్. వీవీఎస్‌ లక్ష్మణ్‌ను స్ఫూర్తిగా తీసుకుని క్రికెట్‌ను కెరీర్‌గా మలుచుకున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా ఆ దేశం తరపున సత్తా చాటుతున్నాడు.

హైదరాబాద్ చిక్కడపల్లిలోని అరోరా కాలేజిలో బీకామ్‌ చదువుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయ జట్టుకు ఎంపికయ్యాడు సందీస్. 2009–10 సీజన్‌లో అండర్‌–22 కల్నల్‌ సీకే నాయుడు ట్రోఫీ నెగ్గిన హైదరాబాద్‌ జట్టులో సందీప్ కూడా సభ్యుడిగా ఉన్నాడు. ఈ టోర్నీలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీస్‌’గా కూడా నిలిచాడు. భారత్‌లో రంజీల్లో అవకాశం కోసం 2013 నుంచి ట్రై చేసినా అవకాశం రాకపోవడంతో 2016లో ఒమన్‌లోని ఖిమ్జి రామ్‌దాస్‌ కంపెనీలో ఇమ్మిగ్రేషన్‌ ఆఫీసర్‌గా ఉద్యోగం రావడంతో అక్కడికి వెళ్లిపోయాడు.

ఒమన్‌ డెవలప్‌మెంట్‌ ఎలెవెన్‌ తరఫున ఐర్లాండ్‌పై ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో రాణించడంతో (55 నాటౌట్‌) సందీప్‌ ఆ దేశ జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. నెదర్లాండ్స్‌తో అరంగేట్ర మ్యాచ్‌లో 2 వికెట్లు పడగొట్టిన సందీప్ రెండో మ్యాచ్‌లో స్కాట్లాండ్‌పై 19 బంతుల్లోనే 31 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

ఐసీసీ వరల్డ్‌ క్రికెట్‌ లీగ్‌ డివిజన్‌-2లో నమీబియాతో మ్యాచ్‌లో కీలక సమయంలో అజేయ అర్ధ సెంచరీతో రాణించి జట్టుకు ఐసీసీ వన్డే హోదా దక్కేలా చేశాడు. ఇప్పుడు ప్రపంచకప్‌లో ఒమన్ దేశం ఆడుతండగా.. ఆ జట్టులో సందీపే కీలకంగా ఉన్నాడు.