Asia Cup 2022 Ind Vs Pak : చెలరేగిన భారత బౌలర్లు.. పాకిస్తాన్ 147 ఆలౌట్

ఆసియా కప్‌ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు.

Asia Cup 2022 Ind Vs Pak : చెలరేగిన భారత బౌలర్లు.. పాకిస్తాన్ 147 ఆలౌట్

Asia Cup 2022 Ind Vs Pak : ఆసియా కప్‌ టీ20 టోర్నీలో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో మ్యాచ్ లో భారత బౌలర్లు చెలరేగారు. కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి పాక్ బ్యాటర్లను కట్టడి చేశారు. వరుసగా వికెట్లు తీస్తూ పాక్ ను కోలుకోనివ్వలేదు. ఈ మ్యాచ్ లో టాస్ నెగ్గిన రోహిత్ శర్మ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. రోహిత్ శర్మ నిర్ణయాన్ని బౌలర్లు వమ్ము కానివ్వలేదు. లైన్ అండ్ లెంగ్త్ తో బౌలింగ్ చేశారు.

టీమిండియా బౌలర్లు చెలరేగడంతో 19.5 ఓవర్లలోనే పాకిస్తాన్ 147 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత్ కు 148 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. భారత బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యలు చెలరేగారు. పదునైన బంతులతో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించారు. ముఖ్యంగా టీమిండియా ప్రధాన పేసర్ భువీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. నాలుగు వికెట్లు తీసి పాక్ వెన్ను విరిచాడు. హార్దిక్ పాండ్య మూడు వికెట్లు పడగొట్టాడు. అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు, అవేశ్ ఖాన్ ఒక వికెట్ తీశారు. భువీ, పాండ్యలు పాక్ ను కోలుకోలేని దెబ్బకొట్టారు.

పాకిస్తాన్ బ్యాటర్లలో ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్ (42 బంతుల్లో 43 పరుగులు) టాప్ స్కోరర్. సూపర్ ఫామ్ లో ఉన్న కెప్టెన్ బాబర్ ఆజమ్(10) విఫలం అయ్యాడు. ఇఫ్తికార్ అహ్మద్ 28 పరుగులు సాధించాడు. ఫకార్ జమాన్ (10), కుష్దిల్ షా (2) పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. చివర్లో దహాని (6 బంతుల్లో 16), హరీస్ రవూఫ్ (7 బంతుల్లో 13 నాటౌట్) ధాటిగా ఆడడంతో పాక్ కాస్త గౌరవప్రదమైన స్కోర్ ని సాధించగలిగింది.